Breaking News: మిర్యాలగూడలో ‘నక్ష సర్వే’ స్పీడప్..! జూలై చివరి నాటికి పనులు పూర్తి చేస్తాం: కలెక్టర్

నల్లగొండ, ఏపీబీ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం పైలట్ పద్ధతిలో ఎంపిక చేసిన మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో ఆస్తులు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు మరియు మౌలిక సదుపాయాల ఖచ్చిత సమాచారాన్ని డిజిటలైజ్ చేసేందుకు చేపట్టిన “నక్ష సర్వే” పనులు మిర్యాలగూడలో వేగంగా సాగుతున్నాయి. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) రామకృష్ణారావు నక్ష సర్వే పురోగతిపై పైలట్ జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పాల్గొని మిర్యాలగూడ మున్సిపాలిటీలో జరుగుతున్న సర్వే వివరాలను క్షేత్రస్థాయి గణాంకాలతో సహా వివరించారు.

నల్లగొండ జిల్లా నుండి పైలట్ ప్రాజెక్ట్ కింద మిర్యాలగూడ మున్సిపాలిటీ మాత్రమే ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సర్వే కోసం మున్సిపల్ యంత్రాంగం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది.

బ్లాకుల విభజన: సర్వేను సులభతరం చేసేందుకు మొత్తం మున్సిపాలిటీ పరిధిని 32 వార్డులుగా విభజించారు. ఇందులో 356 టోటల్ బ్లాకులు, 43 అగ్రికల్చర్ (వ్యవసాయ) బ్లాకులు, 313 బిల్డింగ్ (భవనాల) బ్లాకులను ఏర్పాటు చేశారు.

37 శాతం పనులు పూర్తి: మిర్యాలగూడ పరిధిలో మొత్తం 25,000 ఆస్తులను అధికారులు గుర్తించారు. అందులో ఇప్పటివరకు 9,375 ఆస్తులకు సంబంధించిన డిజిటల్ సర్వేను విజయవంతంగా పూర్తి చేసి, 37% ప్రగతిని సాధించినట్లు కలెక్టర్ సీఎస్కు వివరించారు. ఇప్పటికే 6 వార్డుల్లో సర్వే వంద శాతం పూర్తి కాగా, మరో 6 వార్డుల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఈ భారీ సర్వేను గడువులోగా పూర్తి చేసేందుకు మున్సిపల్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో బలగాలను రంగంలోకి దించారు. ఇండ్లు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములను శాటిలైట్ మరియు క్షేత్రస్థాయి మ్యాపింగ్ చేయడానికి మొత్తం 14 ప్రత్యేక బృందాలను నియమించారు. ఇందులో సాధారణ సర్వే కోసం 5 టీమ్లు, 5 లైసెన్స్డ్ సర్వేయర్ల బృందాలు టెక్నికల్ సపోర్ట్తో పనిచేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి క్లెయిమ్స్, తప్పులు దొర్లకుండా పక్కాగా మ్యాపింగ్ చేస్తున్నామని, జూలై చివరి నాటికి మిర్యాలగూడ మున్సిపాలిటీలో ‘నక్ష సర్వే’ ప్రక్రియను పూర్తి చేసి నివేదిక అందిస్తామని కలెక్టర్ చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. అంతకుముందు సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మరియు పన్నుల వసూళ్లు, మౌలిక వసతుల కల్పనకు ఈ నక్ష సర్వే డేటా అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎక్కడా ఆలస్యం చేయకుండా నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

Share
Share