- 24 గంటల్లోనే ఇద్దరు నిందితుల పట్టివేత
- రూ.2.20 లక్షల నగదు, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం
నల్లగొండ, ఏపీబీ న్యూస్: బ్యాంకుల వద్ద ప్రజల దృష్టి మరల్చి నగదు దోచుకుంటున్న అంతరాష్ట్ర ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, వారిలో ఒకరు మైనర్ బాలుడు ఉన్నట్లు నల్గొండ డీఎస్పీ(DSP) కె. శివరాం రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. నిందితుల వద్ద నుంచి రూ.2.20 లక్షల నగదు, ఒక హెచ్ఎఫ్ డీలక్స్ ద్విచక్ర వాహనం, ఒక వివో సెల్‌ఫోన్, బ్యాంక్ పాస్‌బుక్‌లు, దృష్టి మరల్చేందుకు ఉపయోగించే సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నల్లగొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ 128/2026, సెక్షన్లు 318(4), 303(2) బీఎన్ఎస్(BNS) కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు. జిల్లాలో దొంగతనాలను అరికట్టాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు పోలీసులు నిరంతర నిఘా, గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే వివిధ రకాల దొంగతనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
ఈ నెల 19న నల్లగొండ క్లాక్ టవర్ సమీపంలోని యూనియన్ బ్యాంక్ వద్ద తిప్పర్తికి చెందిన రైతు గాదె లింగయ్య తన వరి ధాన్యం అమ్మిన డబ్బులలో రూ.1.50 లక్షలను బ్యాంకు నుంచి డ్రా చేసుకుని బైక్ ట్యాంక్ కవర్లో పెట్టుకున్నాడు. గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో కొంతమంది వ్యక్తులు మరో బైక్‌ను అడ్డంగా పెట్టి రైతు దృష్టి మరల్చి నగదుతో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజీలు, నిందితుల ఫొటోలు, వాహనాల వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా ఈ ముఠా మే 21న నకిరేకల్‌లోని ఎస్బీఐ(SBI) బ్యాంక్ వద్ద మరో రైతు నుంచి రూ.1.40 లక్షలు దొంగిలించినట్లు గుర్తించారు. అదే రోజు సాయంత్రం వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను ఒప్పుకున్నట్లు తెలిపారు. అరెస్టయిన వారిలో మహారాష్ట్ర రాష్ట్రం సోలాపూర్‌కు చెందిన కేశవ తేజ దొక్వల (20) ఉండగా, మరో వ్యక్తి 13 ఏళ్ల మైనర్ బాలుడు. ప్రధాన నిందితుడు రాహుల్ పరారీలో ఉన్నాడు.
విచారణలో నిందితులు మక్తల్, మరికల్, నల్లగొండ 1 టౌన్, ఖమ్మం త్రీటౌన్, నకిరేకల్ ప్రాంతాల్లో ఇలాంటి దొంగతనాలు చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకుల వద్ద అమాయకులను మాటల్లో పెట్టి దృష్టి మరల్చి నగదు ఎత్తుకెళ్లడం తమ పద్ధతి అని నిందితులు వెల్లడించినట్లు పేర్కొన్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ
బ్యాంకుల వద్ద ఈ తరహా ముఠాలు ఎక్కువగా రద్దీ సమయాల్లో నిఘా పెడతాయని డీఎస్పీ హెచ్చరించారు. పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసిన వారిని లక్ష్యంగా చేసుకుని వెంబడిస్తారని తెలిపారు. వేరే బైక్‌ను అడ్డంగా పెట్టడం, కింద నోట్లు పడేయడం, బైక్ నుంచి ఆయిల్ కారుతోందని చెప్పడం, బట్టలపై మురికి లేదా దురద పౌడర్ చల్లడం వంటి ట్రిక్స్‌తో బాధితుల దృష్టి మరల్చి నగదు దోచుకుంటారని వివరించారు. బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసే సమయంలో లేదా జమ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తోడుగా మరో వ్యక్తిని తీసుకెళ్లాలని సూచించారు. బ్యాంకుల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.