APB News Exclusive: ఎపిసోడ్ -4: కతాలగూడ భూముల్లో కదలుతున్నడొంక!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్ పరిధిలోని కతాలగూడ భూముల్లో జరిగిన అక్రమాల డొంక మెల్లగా కదులుతోంది. ఏపీబీ న్యూస్ లో మూడు రోజుల పాటు వరుసగా వచ్చిన కథనాల పైన ఎట్టకేలకు నల్లగొండ తహాశీల్దార్ ఆఫీసర్లలో కదిలిక వచ్చింది. అసలు భూమి లేనప్పటికీ మిస్సింగ్ సర్వే నంబర్ల ముసుగులో సాగిన భూముల దందా గురించి ఆఫీసర్లు కూపీ లాగడం మొదలు పెట్టారు. కతాలగూడ రెవెన్యూ సిబ్బంది, ఆఫీసులో పలువురు అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు సిండికేట్గా మారి భూముల అక్రమాలకు తెరలేపినట్టు పై ఆఫీసర్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. విశ్వనీయ సమాచారం మేరకు సర్వే నంబర్ 503, 504లో 12.50 గుంటల భూమికి జరిగిన రిజిస్ట్రేషన్ వెనక పెద్ద హైడ్రామానే నడిపించినట్టు ఆఫీసర్లు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. చెరువు బాట జాగలో 12.50 గుంటల భూమిని కాజేసేందుకు మిస్సింగ్ సర్వే నంబర్ కింద ఒక రైతు పేరు మీద పిటీషన్ పెట్టించారు. ఎప్పటి నుంచో ఆ పిటీషన్ పెండింగ్ లో ఉందని పై ఆఫీసర్లను నమ్మించారు. తహాశీల్దార్ ఆఫీస్ లో పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ను భూభారతి చట్టం కింద క్లియర్ చేసేందుకు కలెక్టరేట్ లో జరిగిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం అక్రమార్కులకు అవకాశం కల్పించింది.  జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగే ఈ స్పెషల్ డ్రైవ్ ను అడ్డంపెట్టుకున్న రెవెన్యూ సిబ్బంది ఈ 12.50 గుంటల ఆప్లికేషన్ కూడా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉందని ఆఫీసర్లను నమ్మించి చకచకా రిజిస్ట్రేషన్ చేయించారు.

ఏపీబీ న్యూస్ లో గుట్టుచప్పుడు కాకుండా పంచునామా చేసి, భూములను మాయం చేశారని వెలుగులోకి తేవడంతో స్పందించిన తహాశీల్దార్ అసలు ఏం జరిగిందో చెప్పాలని రెవెన్యూ సిబ్బందిని గట్టిగానే మందలించినట్టు తెలిసింది. దీంతో కంగుతిన్న సిబ్బంది స్పెషల్ డ్రైవ్ లో మిస్సింగ్ సర్వే నంబర్ పేరుతో భూమి రిజిస్ట్రేషన్ చేసిన సంగతి వాస్తవమేనని అంగీకరించినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన ఫైల్ కూడా ఉందని, కాకపోతే ఇంకా రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ కాలేదని, అవసరమైతే మళ్లీ ఇప్పుడు సదరు రైతును పిలిపించి మిస్సింగ్ సర్వే నంబర్ కింద ఒక పిటీషన్ తీసుకుని రికార్డుల్లో ఎంట్రీ చేయోచ్చని చెప్పడంతో ఆఫీసర్ లు షాక్కు గురియ్యారు. తహాశీల్దార్నే నమ్మించి మోసం చేసిన రెవెన్యూ సిబ్బంది ఘనకార్యాలు ఇంకా చాలా ఉన్నాయని కతాలగూడ రైతులు చెపుతున్నారు. అవకాశం ఇస్తే అక్రమార్కుల చిట్టా బయట పెడ్తామని అంటున్నారు. గతంలో గ్రీన్సిటీలో భాగంగా ఆక్రమణకు గురైన 4 ఎకరాల చెరువు నుంచి ఇప్పటి వరకు జరిగిన అక్రమాలు అనేకం ఉన్నాయని అంటున్నారు.

ఇక మహాలక్ష్మీ వెంచర్ ను అడ్డంపెట్టుకుని 523, 524 నంబర్లలో రెండెకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ఆడిన హైడ్రామాలో సర్వేయర్ల పాత్ర కీలకం. రియల్టర్లతో చేతులు కలిపిన సర్వేయర్లు ఈ రెండు సర్వే నంబర్లలో నక్షాలో అసలు బాటే లేదని చెప్పడం గమనార్హం. ఒక వేళ నిజంగానే బాట లేనట్లయితే ఈ రెండు సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్ చేసిన భూమి ఫీల్డ్లో ఎక్కడ ఉందో చూపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం మహాలక్ష్మీ వెంచర్లో రోడ్లు, పార్కులకు కేటాయించిన మిగులు భూమి రెండు ఎకరాలను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించలేదు. పట్టేదారుల పైనే ఉంది. రికార్డుల్లో మ్యూటేషన్ జరగలేదు. దీంతో అదే సర్వే నంబర్లలో ఉన్న రెండెకరాల భూమికి ఇటీవల డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. నిజంగానే ఆ రెండెకరాలు మహాలక్ష్మీ వెంచర్దే అయితే ఫీల్డ్లో కనిపించాలి. కానీ ఎప్పుడో రోడ్ల కోసం కేటాయించిన భూమిని మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చేతులు మారడం వెనక ఉన్న అసలు కారణం ఏమిటీ ? అనేది రెవెన్యూ సర్వేయర్లు చెప్పాలి. లేదంటే తహాశీల్దార్, సర్వేయర్లు కలిసి ఫీల్డ్ లో విచారిస్తే అక్కడ ప్రభుత్వ భూమి ఉందా ? లేదా? డబుల్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎవరికి.? ఎందుకు వచ్చింది? అనేది విచారిస్తే తప్పా అసలు దొంగలు బయట పడరని స్థానిక రైతులు అంటున్నారు.

నల్లగొండ తహాశీల్దార్ ఆఫీసు పేరు చెబితేనే పై ఆఫీసర్లు హడలెత్తిపోతున్నారు. అద్దె ఇంట్లో జీవనం సాగిస్తూ, నిత్యం పనిఒత్తిడితో సతమతమయ్యే తహాశీల్దార్ కు సొంత కారు కూడా లేదంట. సొంత బైక్ పైనే ఆఫీసుకు వచ్చే తహాశీల్దార్ను బలవంతంగా ఇక్కడికి బదిలీ చేశారు. సొంత మండలం కదా అని తిప్పర్తి నుంచి ఇక్కడికి వచ్చిన ఆయనకు నల్లగొండ ఆఫీసు ఒక ముళ్లకిరీటంగా మారింది. ఎటువైపు చూసిన భూములు, ప్లాట్ల పంచాయితీలు తప్పా మరొకటి కనిపించడం లేదు. ఒకవైపు ప్రోటకాల్, మరో వైపు కోర్టు కేసులతో నిత్యం బిజీగా ఉంటున్న తహాశీల్దార్ కు అసలు ఆఫీసులో, ఫీల్డ్ లో ఎవరు ఏం చేస్తున్నారో కూడా అంతుచిక్కడం లేదు. ఈ ఆఫీసు ఎప్పుడు రూరల్, అర్బన్ గా వేరు పడుతుందా..? ఈ బాధల నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందా? అని ఉద్యోగులు, ఆఫీసర్లు ఎదురుచూస్తున్నారంటే ఇక్కడి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. మరో ఏడాదిలో తహాశీల్దార్ కు డెప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ కూడా వస్తదని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కతాలగూడ, నల్లగొండ కార్పోరేషన్లో భూముల గొడవలు ఉచ్చులా బిగుసుకుంటున్నాయని ఆఫీసు సిబ్బంది చర్చించుకోవడం గమనార్హం.

Share
Share