Breaking News: ధరల పెరగడంతోనే హ్యామ్ రోడ్లకు ఎక్సెస్ టెండర్లు: మంత్రి కోమటిరెడ్డి

  • పొరుగు రాష్ట్రాలతో తెలంగాణలో ఎక్సస్ పర్సంటేజీ తక్కువే
  • ఎక్సెస్ రేట్ల పైన వస్తున్న ఆరోపణలకు మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ
  • పొరుగు రాష్ట్రాల్లో హ్యామ్ మోడల్ రోడ్లు అధ్యయనం చేసిన కమిటీ
  • ఎక్సెస్ రేట్లు ఎందుకు కోడ్ చేయాల్సి వచ్చిందో వివరించిన ఆఫీసర్లు
  • బిటుమెన్ ధరలు, జీఎస్టీ భారం, యుద్ధ పరిస్థితులే ప్రధాన కారణం

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: హ్యామ్ (HAM) ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోమవారం అధికారులతో మూడు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేపడుతున్న హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుల పురోగతి, పనుల నాణ్యత, నిర్మాణ వేగం, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై అధికారులతో మంత్రి సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..

మంచి రోడ్లతో రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు. రహదారుల అభివృద్ధి వల్ల పరిశ్రమలు ఏర్పడి మౌలిక వసతులు పెరుగుతాయని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం టెండర్ ప్రక్రియ వివరాలపై అధికారులను మంత్రి ఆరా తీశారు. కేంద్ర రహదారుల రవాణా మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రవేశపెట్టిన హ్యామ్ విధానాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 2016 నుండి దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ఇప్పటివరకు 374కు పైగా ప్రాజెక్టులను రూ.4 నుండి 5 లక్షల కోట్ల పెట్టుబడులతో చేపట్టినట్లు వెల్లడించారు.

జాతీయ స్థాయిలో విజయవంతమైన ఈ విధానాన్ని మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయని, అదే నమూనాలో తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్ర రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎక్సెస్ టెండర్లు అంటూ వస్తున్న ఆరోపణలపై మంత్రి అధికారులను అడిగారు.

హ్యామ్ అమలు చేసిన మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణలోనే ఎక్సెస్ తక్కువగా ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అవి అసత్య ప్రచారాలు అని గణాంకాలతో సహా మంత్రికి వివరించారు.

HAM ఫేజ్-1 కింద రోడ్లు మరియు భవనాల శాఖ ద్వారా రూ.13,006.27 కోట్ల వ్యయంతో 441 రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇవి మొత్తం 6,092.37 కిలోమీటర్ల పొడవుతో 34 ప్యాకేజీలుగా అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ.6,250 కోట్లతో 2,162 రహదారుల నిర్మాణ పనులు 7,450 కిలోమీటర్ల పొడవుతో 17 ప్యాకేజీల రూపంలో కొనసాగుతున్నాయని వెల్లడించారు.

ఈ ప్రాజెక్టుల అమలుకు ముందు టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీస్ నిర్వహించి, NHAI నమూనాలోనే RFP మరియు DCA డాక్యుమెంట్లు రూపొందించి పారదర్శకంగా టెండర్లు ఆహ్వానించినట్లు అధికారులు వివరించారు.

సాధారణ రహదారి పనులతో పోలిస్తే HAM ప్రాజెక్టుల్లో అదనపు ప్లాంట్ & మెషినరీ వినియోగం, ఆధునిక డిజైన్లు, సర్వేలు, 15 సంవత్సరాల నిర్వహణ బాధ్యత, పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్ సేవలు, ఇండిపెండెంట్ ఇంజనీర్ ఛార్జీలు, GST మరియు వడ్డీ భారం వంటి అంశాల కారణంగా అదనపు వ్యయం ఉంటుందని అధికారులు తెలిపారు. GST మరియు వడ్డీ ప్రభావం వల్ల మాత్రమే సుమారు 9.30 శాతం అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన HAM ప్రాజెక్టుల్లో కూడా భారీ పాజిటివ్ ఎక్సెస్ బిడ్ ట్రెండ్ నమోదైందని వెల్లడించారు. గుజరాత్లో 66 శాతం వరకు, మహారాష్ట్రలో 47 శాతం వరకు ఎక్సెస్ పాజిటివ్ బిడ్లు నమోదయ్యాయని తెలిపారు. NHAI ప్రాజెక్టుల్లో కూడా 50 శాతం వరకు అధిక బిడ్లు వచ్చిన ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఇంధనం, బిటుమెన్, స్టీల్, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగాయని, ముఖ్యంగా బిటుమెన్ ధరలు దాదాపు 100 శాతం వరకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు వ్యయంపై 20 నుండి 25 శాతం వరకు ప్రభావం పడుతుందన్నారు. టెండర్ ప్రక్రియ ప్రారంభమైన సమయంలో బిటుమెన్ ధర మెట్రిక్ టన్నుకు రూ.44 వేలుగా ఉండగా, ప్రస్తుతం రూ.89 వేల వరకు చేరిందని, అంటే దాదాపు 100 శాతం పెరుగుదల నమోదైందని అధికారులు వివరించారు.

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా, పరిశ్రమల విస్తరణకు అనుకూలంగా, ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించేలా నాణ్యమైన రహదారి మౌలిక వసతుల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అలాగే ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మంగళవారం లేదా బుధవారం కలుస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Share
Share