- విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణ నిర్ణయం ‘పిచ్చి నిర్ణయం’
- మోదీ కాళ్ల మీద పడటానికే సీబీఐ దర్యాప్తుకు మొగ్గు – రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి
- కరెంటు కోతలు, వడ్ల కొనుగోళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్పై విచారణలు
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ హయాంలో కేబినెట్ సమావేశం అంటే ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసేవారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపులకే పరిమితమైందని మండిపడ్డారు.
సీబీఐ విచారణపై ఘాటు విమర్శలు:
గత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సీబీఐ విచారణకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని జగదీష్ రెడ్డి తప్పుబట్టారు:
సీబీఐపై నమ్మకం ఎక్కడ?: సీబీఐ అనేది మోదీ జేబు సంస్థ అని రాహుల్ గాంధీ అంటుంటారని, మరి అదే సంస్థకు విచారణ ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది మోదీ కాళ్ల మీద పడటం తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు.
పోలీసుల సామర్థ్యంపై ప్రశ్న: “తెలంగాణ పోలీసుల మీద మీకు నమ్మకం లేదా? వాళ్లు చేతకాని వాళ్లా?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
కమిషన్ రిపోర్ట్ ఏది?: మదన్ బి. లోకూర్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదని, అసలు ఆ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. లోకూర్ కమిషన్ ప్రస్తుత ప్రభుత్వాన్ని తిట్టి వెళ్లిందని తమ దగ్గర సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు.
కరెంటు కోతలు – వ్యవసాయ సంక్షోభం:
కోతలు మొదలయ్యాయి: కేసీఆర్ కేవలం ఏడాదిలోపే కరెంటు కష్టాలను తీరిస్తే, ఇప్పుడు మళ్లీ 2014 ముందు నాటి పరిస్థితులు వచ్చాయని, 12 గంటలే కరెంటు ఇస్తున్నారని విమర్శించారు. ఏ మంత్రయినా చర్చకు వస్తే నిరూపిస్తానని సవాల్ విసిరారు.
వడ్ల కొనుగోలు: రైతు బంధు, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్పై విచారణలు కోరుతున్నారని ఆరోపించారు. బోనస్ ఎగ్గొట్టేందుకే వడ్లు కొనడం లేదని మండిపడ్డారు.
కేసీఆర్ కడిగిన ముత్యం:
కేసీఆర్ ఏ విచారణకైనా భయపడరని, ఎన్ని విచారణలు జరిగినా ఆయన ‘కడిగిన ముత్యం’ లా బయటకు వస్తారని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం విషయంలోనూ ఇదే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి బ్యాచ్ అంతా అసమర్థులని, రాష్ట్ర నాయకత్వం రాహుల్ గాంధీ డైరెక్షన్లో కాకుండా మోదీ డైరెక్షన్లో నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.