- ఉదయసముద్రం రిజర్వాయర్ లో నిషేదాజ్ఞలు గాలికి
- సముద్రంలో దూకి ఈత కొడుతున్న పెద్దలు, పిల్లలు
- యథేచ్చగా చేపల వేట.. అడ్డొచ్చిన సెక్యూరిటీ పైన దాడులు
- కరకట్ట బలహీనంగా ఉందని హెచ్చరించిన ఎన్డీఎస్ఏ(NDSA)
- అయినా పట్టించుకోని పట్టణ ప్రజలు.. తాగునీరు కలుషితం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండలోని పానగల్లు ఉదయ సముద్రం రిజర్వాయర్ లో నిషేదాజ్ఞలు యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. రిజర్వాయర్ లో చేపల వేట, ఈత కొట్టడం పైన ఇరిగేషన్, మత్స్యశాఖలు విధించిన ఆంక్షలను ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ రిజర్వాయర్ లో నల్లగొండ, భువనగిరి, ఆలేరు వరకు సప్లై చేస్తున్న వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. ప్రతి రోజు 50 క్యూసెక్కుల నీటిని డ్రా చేస్తున్నారు. సముద్రంలో పర్యావరణం దెబ్బ తినొద్దని, తాగునీరు కలుషితం కావొద్దని ఈత కొట్టడం, చేపల వేట పైన నిషేదం ఎప్పటి నుంచో అమల్లో ఉంది, కానీ పానగల్లులోని మత్స్య కార్మికులు నాటు పడవలు ఉపయోగించి చేపల వేట సాగిస్తున్నారు. ఇంకోవైపు పిల్లలు, పెద్దలు ఉదయం, సాయంత్రం వేళలో సముద్రంలోకి దూకి ఈత కొడుతున్నారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1.5 టీఎంసీ కాగ, ప్రస్తుతం 0.9 టీఎంసీ నీళ్లు నిల్వ ఉన్నాయి. మెయిన్ కెనాల్ నుంచి సాగర్ నీళ్లు సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి. 75 శాతం మేర నీటి నిల్వలు ఉన్నందున సముద్రంలోకి ఎవరూ దిగొద్దని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు.
సెక్యూరిటీ సిబ్బంది పైన దాడులు..
సముద్రంలోకి దిగొద్దని అడ్డుపడుతున్న సెక్యూరిటీ గార్డ్స్ పైన దాడులకు దిగుతున్నారని అధికారులు చెప్పారు. వాచ్ అండ్ వార్డ్ డ్యూటీలో భాగంగా సముద్రంలోకి ఎవరూ దిగకుండా కాపాల కాస్తున్న సిబ్బంది ఆదేశాలను ఎవరూ లెక్క చేయడం లేదు. ఈత కొట్టేందుకు వస్తున్న వాళ్లలో పోలీసు సిబ్బంది కూడా ఉన్నందున సెక్యూరిటీ సిబ్బంది గట్టిగా మందలించలేపోతున్నారని, అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తాము శిక్షణ పొందిన పోలీసులమని చెప్పి బెదిరిస్తున్నారని సిబ్బంది చెప్పారు. ఏఎమ్మార్పీ(AMRP) మెయిన్ కెనాల్ నుంచి సముద్రంలోకి కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయని, కొన్ని సందర్భాల్లో మొసళ్లు, ప్రమాదకరమైన పాములు కూడా సముద్రంలోకి వస్తుంటాయని, పొరపాటున ఏదైనా ప్రాణనష్టం జరిగితే ఎవరూ ఎంత బాధపడ్డ ప్రయోజనం ఉండదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇల్లీగల్ కార్యకలాపాలు..
సముద్రం కట్టమీద అసాంఘిక కార్యకలాపాలు మితిమీరిపోయాయని, ఉదయమే గంజాయి తాగేందుకు యువత కట్టమీదకు చేరుకుంటోందని, రాత్రి వేళల్లో మద్యం, మత్తు పదార్థాలు వాడుతున్నారని అధికారులు తెలిపారు. తమ పైన ఎక్కడ దాడి చేస్తారనే భయంతో గంజాయి బ్యాచ్ ను గట్టిగా మందలించలేకపోతున్నామని చెప్పారు. పోలీసులు రెండు, మూడు రోజులకోసారి పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ ఇల్లీగల్ వ్యవహారాలు కొనసాగుతూనే ఉన్నాయని, పైగా ఉదయ సముద్రం కరకట్ట బలహీనంగా ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించిందని, దాంతో కట్టమీద నుంచి సముద్రంలోకి దూకి ఈత కొట్టడం మరింత ప్రమాదమని, అదే కట్టమీద అసాంఘిక కార్యకలపాలు కొనసాగించడం ప్రాణాపాయంగా మారిందని అధికారులు తెలిపారు. రిజర్వాయర్ పర్యావరణం దెబ్బతినకుండా కాపాడేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఆఫీసర్లు కోరుతున్నారు. నల్లగొండ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరిగా స్పదించట్లేదని, కాబట్టి ఉన్నతస్థాయి అధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.