బావా బామ్మర్దుల తీన్మార్ డాన్స్‌లకు అర్థం లేదు: ఎంపీ చామల ఫైర్

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తూ బీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకోవడంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం సాంకేతిక కారణాలతో కమిషన్ నివేదికపై స్టే వస్తే, తాము తప్పు చేయలేదని క్లీన్ చిట్ వచ్చినట్లు హరీష్ రావు, కేటీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తప్పుదోవ పట్టిస్తున్నారు: “కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోర్టు అంటే.. అవినీతి జరగలేదని కాదు. క్లీన్ చిట్ వచ్చినట్లు బావా బామ్మర్దులు తీన్మార్ డాన్స్లు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.”

కూలింది గుండెకాయే: మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరానికి గుండెకాయ అని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు రెండు పిల్లర్లు కూలితే ఏమవుతుందని అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని ఎంపీ విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నీళ్లు నింపవద్దని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

గూగుల్ మ్యాప్ ఇంజనీరింగ్: కేసీఆర్ గూగుల్ మ్యాప్లు చూసి ఇంజనీర్ అవతారమెత్తి ప్రాజెక్టులు కట్టడం వల్లే అవి కుంగిపోతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ ఎందుకు కుంగలేదని ప్రశ్నించారు.

దక్షిణ తెలంగాణకు అన్యాయం: పదేళ్లలో దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో మొదలైన ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. కేవలం అప్పుల కోసం కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు.

సిబిఐ విచారణ ఎక్కడ?: “సిబిఐ విచారణను హైకోర్టు ఆపలేదు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే విచారణ జరిపించాలి. పదేళ్ల దోపిడీని బీజేపీ ఎందుకు ఆపలేదు? మీరు ఆడుతున్న డ్రామాలను గమనించే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని సీఎం చేశారు” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో సున్నా సీట్లకు పరిమితం కావడమే అందుకు నిదర్శనమన్నారు.

ఏడాది కాలంగా ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్, ఇప్పుడు జీవన్ రెడ్డిని రీచార్జ్ చేయడానికి బయటకు వచ్చారా అని చామల సెటైర్ వేశారు. బీఆర్ఎస్ నేతలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చిస్తోందని, త్వరలోనే “సంబురాల రాంబాబులను” లోపల వేస్తామని హెచ్చరించారు.

హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ఇది కేవలం ప్రాథమిక అడ్డంకి మాత్రమేనని, అవినీతిపై విచారణ ఆగదని స్పష్టం చేస్తోంది. న్యాయ నిపుణుల సలహాతో తదుపరి అడుగులు వేయడం ద్వారా బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది.

Share
Share