- గడువు ముగిసినా కొనసాగుతున్న ఔట్ సోర్సింగ్ స్టాఫ్
- సిబ్బంది కొరతను సాకుగా చూపి ఆఫీసుల్లో డ్యూటీ
- రాష్ట్ర వ్యాప్తంగా 120 మంది ఉద్యోగుల తొలగింపు
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 24 మంది
- అయినప్పటికీ అనధికారికంగానే ఆఫీసుల్లో కొలువు
- విజిలెన్స్ తనిఖీల్లో బయటపడ్డ అధికారుల బాగోతం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అధికారుల బండారం బయటపడింది. ప్రభుత్వం తొలగించిన ఔట్సోర్సింగ్ సిబ్బంది అధికారుల అండతో ఇంకా ఆఫీసుల్లోనే తిష్ట వేశారు. ఐదు నెలల నుంచి జీతభత్యాలు లేకున్నా ఆఫీసులోనే అనధికారికంగా పెత్తనం చలాయిస్తున్నారు. అధికారుల అండతో కీలకమైన రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ చక్క బెడుతున్నారు. ఒక్క నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆరుగురు వ్యక్తులు అనధికారికంగా పనిచేయడం కలకలం రేపింది. ప్రభుత్వం తొలగించమని ఆదేశించిన వినకుండా అధికారులు ప్రైవేటు సైన్యం చేతికి పెత్తనం అప్పగించారు. రిజిస్ట్రేషన్ కు అవసరమయ్యే వేలిముద్రలు సేకరణ, ఈకేవైసీ(eKYC), డేటా ఎంట్రీ వంటి కీలకమైన విధులు నిర్వరిస్తున్నారు. గత ఐదు నెలల నుంచి ఎలాంటి జీత భత్యాలు లేకున్నా ఆఫీసుల్లోనే తిష్టవేయడం అధికారుల అవినీతికి అద్దం పడుతోంది. ప్రతి డాక్యుమెంట్ కు ఒక రేటు ఫిక్స్ చేయడం, ఆ మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తుల ద్వారా వసూళ్లు చేయడం జరుగుతోంది. నల్లగొండ ఆఫీసులో జరుగుతున్న ఈ అవినీతి బాగోతం గురించి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో నల్లగొండ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ రంగంలోకి దిగి విచారణ చేపట్టగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రద్ధు చేసిన ఏజెన్సీలను కొనసాగిస్తున్న ఎస్ఆర్(SR)లు..
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను అడ్డంపెట్టుకుని ఆఫీసర్లు ప్రతి నెల లక్షల రూపాయాలు జీతాల రూపంలో స్వాహా చేస్తున్నారని ప్రభుత్వ విచారణలో తేలింది. ఉద్యోగులు లేకున్నా ఉన్నట్టు చూపించడం, ఎక్కువ మంది పనిచేస్తున్నట్టు బోగస్ రికార్డులు సృష్టించి జీతాల రూపంలో వందల కోట్లు కాజేశారు. దీంతో ఆ ఏజెన్సీల కాంట్రాక్టును ప్రభుత్వం రద్ధు చేసింది, కానీ సబ్ రిజిస్ట్రార్లు మాత్రం వాళ్లను వదులుకోలేక అట్లనే కొనసాగిస్తున్నారు. ఆఫీసుల్లో సిబ్బంది కొరత ఉందనే సాకును అడ్డంపెట్టుకుని ప్రైవేటు సైన్యంతో రిజిస్ట్రేషన్ వ్యవహారాలు నడిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లలో పనిచేస్తున్న 120 మందిని తొలగించినట్టు తెలిసింది. 2019లో నియామకమైన ఈ ఉద్యోగులను, సంబంధిత ఏజెన్సీల కాంట్రాక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల క్రితం రద్దు చేసింది, కానీ ఉమ్మడి జిల్లాలో అత్యధిక లావాదేవీలు జరిగే నల్లగొండ, భువనగిరి, యాదగిరిగుట్ట సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సుమారు 30 మంది స్టాఫ్ ను ఇంకా కొనసాగించడం అనుమానాలకు తావిస్తోంది.
ఉద్యోగాలు అమ్ముకున్నారనే ప్రచారం..
సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోందని ఎస్ఆర్(SR) లు చెప్తున్నారు. ఈకేవైసీ, వేలిముద్రలు, డేటా ఎంట్రీ వంటి పనులు చేసేందుకు సిబ్బంది లేరని, దాంతోనే పాతవాళ్లనే కొనసాగించాల్సి వస్తోందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ ఏజెన్సీల కాంట్రాక్టు రెన్యువల్ చేస్తారని, దానికి సంబంధించిన ఫైల్ ఉన్నతాధికారుల పరిశీలనలో ఉందని బుకాయిస్తున్నారు. నిజానికి ఏజెన్సీల రెన్యువల్ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే రద్దు చేయదనే వాధన కూడా వినిపిస్తోంది. దీన్ని అడ్డం పెట్టుకుని ఏజెన్సీలు ఉద్యోగుల నుంచి లక్షల వసూళ్లు చేశారని, ఇటీవల కాలంలో ఇంకొంత మందిని కొత్తగా తీసుకున్నారని, దాంతోనే నల్లగొండ ఆఫీసు పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయని ప్రచారం జరుగుతోంది.
వివిధ శాఖల్లో అడ్డదారిలో ఉద్యోగాలు..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. పదో తరగతి, డిగ్రీ, పీజీ చేసిన నిరుద్యోగులు 10,15 వేల ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. దీన్ని అదునుగా భావించిన ఏజెన్సీలు నిరుద్యోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా జిల్లా కేంద్ర ఆసుపత్రి, నల్లగొండ సబ్ రిజిస్ట్రార్, మున్సిపాల్టీలతో పాటు, కలెక్టరేట్, డీఎంహెచ్ఓ(DMHO) ఆఫీసు, పీహెచ్సీ(PHC)ల్లో అనధికారిక నియామకాలు జరిగాయని, వీటి వెనక రాజకీయ అనుచరుల హస్తం ఉందని తెలిసింది. నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు బాగోతం బయటపడటంతో ఇతర ఆఫీసుల్లో అలజడి మొదలైంది.