- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కి వ్యతిరేకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలతో సమావేశాలు
- పార్టీలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు
- మీటింగ్ లకు మాజీ మంత్రి జగదీష్ దూరం
- పార్టీలో అంతర్గత విభేదాల పై హాట్ టాపిక్
- కేడర్ ను కట్టిపడేస్తున్న హారీష్ వ్యూహాం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్(BRS)లో మాజీ మంత్రి హారీష్ రావు వరుస పర్యటనలు కొత్త రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఆయన నిర్వహిస్తున్న సమావేశాలే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక నేతలతో హారీష్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆసక్తికర విషయం ఏమంటే ఆ నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి రాజకీయంగా వ్యతిరేక వర్గంగా గుర్తింపు పొందిన వారే కావడం. ఇప్పుడు అదే నేతలతో హారీష్ వరుసగా సమావేశాలు నిర్వహించడం.. వాటికి జగదీష్ రెడ్డి దూరంగా ఉండటం జిల్లాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.
హారీష్ సమావేశాలు.. దేనికి సంకేతాలు..
సాధారణ పార్టీ కార్యక్రమాల కంటే రాజకీయంగా ప్రత్యేక సంకేతాలివ్వడానికే ఈ పర్యటనలు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశాలు, కార్యకర్తల మీటింగ్‌లు కూడా ఉమ్మడి జిల్లా సీనియర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లేకుండానే జరగడం పార్టీలో గ్రూపు రాజకీయాలను మరోసారి బయటపెడుతోంది. మరోవైపు హారీష్ మాత్రం కేడర్‌ను యాక్టివ్ చేయడం, పార్టీకి కొత్త ఊపు తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్నా.. జిల్లాలో మాత్రం ‘ఆపరేషన్ హారీష్’ పై విభిన్న చర్చలు నడుస్తున్నాయి. భవిష్యత్‌లో జిల్లాలో పార్టీ నాయకత్వ సమీకరణాలు మారనున్నాయా..? లేక అసంతృప్త వర్గాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నమా..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక జగదీష్ రెడ్డి వర్గం మాత్రం ఈ పరిణామాలపై బహిరంగంగా స్పందించకపోయినా పార్టీ అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నల్లగొండ బీఆర్ఎస్ లో హారీష్ పర్యటనలు సాధారణ రాజకీయ కార్యక్రమాలా..? లేక భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు సంకేతాలా..? అన్న చర్చ మరింత వేడెక్కుతోంది.
మాజీ మంత్రి వ్యతిరేకవర్గం పైనే ఫోకస్
జగదీష్ రెడ్డి వ్యతిరేక వర్గీయులైన మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్, చిరుమర్తి లింగయ్య నియోజకవర్గాల్లో హారీష్ పర్యటించారు. నెల రోజుల క్రితం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చానని చెప్పిన హారీష్ గుర్రంపోడులో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు చిరుమర్తి లింగయ్య, మల్లయ్య యాదవ్, బడుగుల లింగయ్య యాదవ్ హాజరుకాగా, అదే రోజు రాత్రి నార్కట్ పల్లిలో చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. మళ్లీ గురువారం కోదాడ పర్యటనకు వెళ్లిన హారీష్ కు చిట్యాల, నార్కట్ పల్లిలో ఘనంగా స్వాగతం పలికారు. రామన్నపేట, చిట్యాల, నార్కట్ పల్లి కి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలను పలకరించారు. కోదాడలో మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంలో కొత్తగా నిర్మించిన దేవాలయ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన హారీష్, ఆ తర్వాత కోదాడలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడం కొత్త చర్చకు దారి తీసింది. ఈ సమావేశానికి కూడా నోముల భగత్, చిరుమర్తి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. సూర్యాపేట, హుజూర్ నగర్, తుంగతుర్తి కేడర్ పాల్గొనలేదు. అదే జిల్లాకు చెందిన గాదరి కిషోర్ కూడా దూరంగానే ఉన్నారు. కోదాడ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా జగదీష్ రెడ్డి ఫోటోలు కనిపించకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కోదాడలో మల్లయ్యను వ్యతిరేకించే వర్గాన్ని జగదీష్ రెడ్డి తెరవెనక ప్రోత్సహించే వారని, సాగర్ లో భగత్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కోటిరెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. నకిరేకల్ కూడా జగదీష్ రెడ్డి వర్గాన్ని చిరుమర్తి లింగయ్య దూరం పెట్టినప్పటి నుంచి వీరిద్దరి మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. ఇటీవల ఆలేరులో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య హరీష్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత వర్గం గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేని వర్గమంతా ఏకమైనట్టు తెలుస్తోంది.
జగదీష్ రెడ్డి ఇమేజ్ కు ఎదురుదెబ్బ..?
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి జిల్లాలో పార్టీని సింగిల్ హ్యాండ్ తో నడిపించిన జగదీష్ రెడ్డి.. 2018 ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలు, వరుసగా జరిగిన మూడు ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో జగదీష్ రెడ్డి పాత్ర కీలకం. అప్పుడు కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి జిల్లాలో తలదూర్చేందుకు చేసిన ప్రయత్నాలను జగదీష్ రెడ్డి మొదట్లోనే కట్టడి చేశారు. వేల కోట్ల నిధులతో నియోజకవర్గాలను అభివృద్ధి చేశారు. ఎంత చేసినప్పటికీ గత ఎన్నికల్లో జగదీష్ రెడ్డి తప్పా 11 చోట్ల పార్టీ ఓడిపోయింది. ఎన్నికల్లో ఓటమికి జగదీష్ రెడ్డి వైఖరి కూడా కారణమని ఆయన్ని వ్యతిరేకించే ఎమ్మెల్యేలు అధిష్టానం వద్ద ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కానీ గత పదేళ్లలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కేటీఆర్ ఎప్పుడూ సమన్వయంతోనే ముందుకెళ్లారన్న అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. పైగా హారీష్ తో పోలిస్తే జగదీష్ రెడ్డి ఏ మాత్రం తక్కువ కాదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. జిల్లాలో పార్టీ నిర్మాణం నుంచి ఉద్యమ రాజకీయాల వరకు ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందని ఈ నేపథ్యంలో కేటీఆర్, జగదీష్ రెడ్డి సారథ్యంలోనే నల్లగొండ జిల్లా పార్టీ ముందుకెళ్తే.. కేడర్‌లో మరింత క్రేజ్ పెరుగుతుందనే చర్చ కూడా సాగుతోంది.