Breaking News: R&B అధికారులు రోజూ ఫీల్డ్‌కు వెళ్లాల్సిందే: మంత్రి కోమటిరెడ్డి కఠిన ఆదేశాలు..

హైదరాబాద్ బ్యూరో, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రోడ్లు, భవనాల (R&B) శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తి అప్రమత్తంగా ఉంటూ ప్రజా రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన ఈ ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. వర్షాలకు వాగులు, వంకలు పొర్లి ప్రవహించే ప్రమాదకర రహదారులు, బ్రిడ్జిలను తక్షణమే గుర్తించి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

గత ఏడాది వానకాలం సీజన్లో లాగే ఈసారి కూడా ఎర్రమంజిల్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ‘కంట్రోల్ రూమ్ సెంటర్’ ఏర్పాటు చేసి, జిల్లాల వారీగా రోజువారీ పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రి స్పష్టం చేశారు.

కార్యాలయాల్లో కూర్చుంటే కుదరదు: రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు సీఈ, ఎస్ఈ, ఈఈ, డీఈ, ఏఈ స్థాయి అధికారులు ఖచ్చితంగా ప్రతి రోజు క్షేత్రస్థాయి పర్యటనలు (Field Visit) చేయాల్సిందేనని మంత్రి తేల్చి చెప్పారు. డివిజన్ల వారీగా రోజువారీ నివేదికను నేరుగా తనకు సమర్పించాలని ఆదేశించారు.

పెండింగ్ పనులపై ఆరా: ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రోడ్లు, ఆర్ఓబీ (ROB), ఆర్యూబీ (RUB)ల పురోగతిపై ఆరా తీస్తూ.. ఫినిషింగ్ స్టేజ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

రాష్ట్రంలో రోడ్డు నెట్వర్క్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని మంత్రి తెలిపారు. ‘2047 రైసింగ్ తెలంగాణ’ నినాదంతో, 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా గ్లోబల్ సమ్మిట్ వేదికగా సరికొత్త రోడ్ సెక్టార్ పాలసీని తెచ్చామని గుర్తుచేశారు. హ్యామ్ (HAM) పనులకు అతి త్వరలోనే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన ఉంటుందని, గ్రామీణ రహదారుల అభివృద్ధితో పల్లెల్లో పరిశ్రమలు, ఉపాధి పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

త్రిపుల్ ఆర్ ప్రాజెక్టు తెలంగాణకు గేమ్ చేంజర్ కానుందని మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.

₹626.87 కోట్లు జమ: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం (Northern Part) భూసేకరణలో రాష్ట్ర వాటా కింద రూ.626.87 కోట్లను ఇప్పటికే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఖాతాలో జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

రాజకీయాలకు అతీతంగా సహకరించాలి: సదరన్ పార్ట్ (దక్షిణ భాగం) పై ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తనకు రాసిన లేఖను సమీక్షలో ప్రస్తావించారు. కేంద్రం నుండి త్వరగా అనుమతులు తెచ్చేందుకు ఇక్కడి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ ఎంపీలు రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.

హైస్పీడ్ రైల్ కారిడార్లు: హైదరాబాద్-పూణే-ముంబై, భారత్ ఫ్యూచర్ సిటీ-చెన్నై, బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్లపై సీఎం రేవంత్ రెడ్డి తో త్వరలోనే ప్రత్యేకంగా చర్చిస్తానని చెప్పారు.

రూరల్ ఎకానమీ గ్రోత్ కోసం వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్ నుండి కార్గో సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు.

అదేవిధంగా.. న్యామ్ (NAM) రోడ్డులో మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని నందిపాడు (Nandipad) వద్ద తరచూ ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అక్కడ తక్షణమే అత్యవసర ‘వెహికల్ అండర్ పాస్’ (Vehicle Under Pass) నిర్మించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన పరిపాలన అనుమతులు మంజూరు చేసి, పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఈ కీలక సమీక్షా సమావేశంలో ఆర్అండ్బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సెక్రెటరీ ప్రావిణ్య, సీఈలు బి.వి. రావు, ధర్మారెడ్డి, వనజతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share
Share