APB News Exclusive: రాజగోపాల్‌కు మంత్రి పదవి ఖాయమే..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దాదాపు ఖాయమైనట్లు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సంకేతాలు అందుతున్నాయి. గత రెండున్నరేళ్ల నుంచి మంత్రి పదవి విషయంలో అధిష్టానం కాలయాపన చేస్తూ వస్తుండగా, మరింత ఆలస్యం చేస్తే రాజకీయంగా ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఈసారి కేబినెట్ విస్తరణలో ఆయనకు చోటు కల్పించే దిశగా అధిష్టానం సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో అధిష్టానం ఇచ్చిన హామీలను నెరవేర్చింది. కేరళ ముఖ్యమంత్రి పదవి కేసీ వేణుగోపాల్ కే దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ కేరళలో పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డ వి.డీ. సతీషన్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. పొరుగు రాష్ట్రం కర్నాటకలో కూడా శివకుమార్ కు ఇచ్చిన హామీని అధిష్టానం నెరవేర్చింది. రెండున్నరేళ్ల ఒప్పందానికి కట్టుబడి సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయగా, కాస్తంత ఆలస్యమైనప్పటికీ శివకుమార్ సీఎం అయ్యారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన ఫార్మూలనే తెలంగాణలో కూడా అమలు చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలోనే అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించేలా వ్యవహరించిన పార్టీ నాయకత్వం, మంత్రి పదవుల పంపకాల్లోనూ అదే ఫార్మూలాను అనుసరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ప్రాంతీయ, సామాజిక సమీకరణాలతో పాటు పార్టీ కోసం పనిచేసిన నేతలకు ప్రాధాన్యం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని కాంగ్రెస్లోకి తేవడంలో రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ నేతలు కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వివేక్ వెంకటస్వామి, విజయశాంతి వంటి నేతలు కూడా కాంగ్రెస్లో చేరారు. వాళ్లకు ఇచ్చిన హామీ మేరకు విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి, వివేక్కు మంత్రి పదవి దక్కగా, అదే సమయంలో మంత్రి కావాల్సిన రాజగోపాల్రెడ్డి పేరు మాత్రం పెండింగ్లో పడ్డది. భువనగిరి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేస్తే మంత్రి పదవి కల్పిస్తామని రాష్ట్ర నాయకత్వం హామీ ఇచ్చినట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అంగీకరించారు.  సీఎం రేవంత్ సైతం కిరణ్ గెలుపు కోసం స్వయంగా రాజగోపాల్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అయితే ఎన్నికలు ముగిసినా ఆ హామీ అమలు కాకపోవడంతో రాజగోపాల్ అప్పటి నుంచి తన అసంతృప్తిని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. రాజగోపాల్ను కాంగ్రెస్లోకి తీసుకురావడంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చొరవ చూపినప్పటికీ, మంత్రి పదవి గురించి అధిష్టానం వద్ద గట్టిగా వాదించలేకపోయారనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది.

రాజగోపాల్రెడ్డి అంశంపై రాష్ట్ర నాయకత్వాన్ని కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగానే ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ గెలుపు కోసం మంత్రి పదవి హామీ ఇచ్చి, ఇప్పుడు ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఎలా ఇస్తామని చెప్పడం సమంజసం కాదనే అభిప్రాయానికి అధిష్టానం పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వక తప్పదనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజగోపాల్రెడ్డి మంత్రి పదవి అంశానికి ఆయన సోదరుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో ఎలాంటి సంబంధం లేదని, రాజగోపాల్రెడ్డిని పార్టీలో చేర్చుకునే ప్రక్రియలో గానీ, మంత్రి పదవి హామీ విషయంలో గానీ తన ప్రమేయం లేదని వెంకట్రెడ్డి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. దీంతో వెంకట్రెడ్డి పదవితో ముడి పెట్టకుండా, రాజకీయ హామీ అమలు కోణంలో రాజగోపాల్కు మంత్రి పదవి ఇవ్వొచ్చనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ నెల రెండో వారం లేదంటే ఈనెల చివర్లో కేబినెట్ విస్తరణ ఉండొచ్చని దాంట్లో రాజగోపాల్ బెర్త్ కన్ఫర్మ్ అనే సంకేతాలు ఇప్పటికే అందాయని తెలిసింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలోనూ మంత్రి పదవుల కేటాయింపులో అధిష్టానం రాజకీయ సమీకరణాలకే పెద్దపీట వేసింది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అప్పటి పరిస్థితులు, పార్టీ అవసరాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ కూర్పు చేపట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పార్టీ బలోపేతానికి కృషి చేసిన సీనియర్ నేతలకు అవకాశం కల్పించడమే కాకుండా, రాజకీయంగా ఎదుగుతున్న యువ నాయకత్వానికీ మంత్రి పదవులు అప్పగించడం కాంగ్రెస్ సంప్రదాయంగా కొనసాగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయ చరిత్రను పరిశీలిస్తే.. దాదాపు 14 ఏళ్లపాటు మంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించిన సీనియర్ నేత జానారెడ్డి, 2004లో దివంగత సీఎం వై ఎస్ రాజశేఖర్రెడ్డి తొలి మంత్రివర్గంలో హోం మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. అదే ఎన్నికల్లో గెలిచిన మరో సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డికి మాత్రం తొలి విడతలో మంత్రి పదవి దక్కలేదు. అనంతరం 2007లో జరిగిన కేబినెట్ విస్తరణలో ఆయనకు అవకాశం కల్పించి ఐటీ శాఖ బాధ్యతలు అప్పగించారు.

అయితే 2009లో వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. అప్పటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జానారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అదే సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రమే కేబినెట్ లో అవకాశం లభించింది. అప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా కాంగ్రెస్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకటరెడ్డి, వైఎస్తో ఉన్న సాన్నిహిత్యం, జిల్లాలో పెరుగుతున్న రాజకీయ ప్రభావం కారణంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరెడ్డి, అప్పటి కాంగ్రెస్లో ఎదుగుతున్న యువ నాయకత్వానికి ప్రతినిధిగా నిలిచారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సీనియారిటీ ఒక్కటే ప్రమాణం కాదని, పార్టీ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త నాయకత్వాన్ని కూడా ప్రోత్సహిస్తుందనే సందేశాన్ని అప్పుడే స్పష్టంగా ఇచ్చింది.

దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణానంతరం రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రోశయ్య, అనంతరం కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాల్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగారు. అయితే తెలంగాణ రాష్ట్ర సాధనకు మద్దతుగా ఉద్యమం వేగం పుంజుకోవడంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. ఇక కిరణ్కుమార్రెడ్డి సీఎం అయ్యాక తన సన్నిహితుడు ఉత్తమ్కుమార్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అదే సమయంలో సీనియర్ నేత జానారెడ్డిని కూడా కేబినెట్లోకి తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన నాయకత్వానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో చర్చ జరిగింది. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన నేతగా వెంకటరెడ్డి గుర్తింపు పొందగా, మంత్రి పదవిలో కొనసాగుతూనే తెలంగాణ రాష్ట్ర సాధనకు మద్దతు తెలిపిన నాయకుడిగా జానారెడ్డి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ అధికారానికి దూరమైనా, పదేళ్ల విరామం అనంతరం మళ్లీ అధికారంలోకి రావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరోసారి మంత్రి పదవుల్లో ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు. వీరిలో వెంకటరెడ్డి రాష్ట్ర కేబినెట్లో సీనియర్ మంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కూడా మంత్రి పదవి దక్కితే, ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయ చరిత్ర లో మరో కొత్త అధ్యాయం నమోదయ్యే అవకాశం ఉంది. ఒకే సమయంలో ముగ్గురు ప్రభావశీల నాయకులు కేబినెట్లో చోటు దక్కించుకోవడం ద్వారా జిల్లాకు మంత్రి ప్రాతినిధ్యం పరంగా కొత్త రికార్డు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Share
Share