- మధు ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే.. పోలీసుల భాగస్వామ్యంపై జగదీష్ రెడ్డి నిఘా
- కేసును తప్పుదోవ పట్టిస్తే ఐజీ స్థాయి అధికారినైనా వదిలిపెట్టం.. బీఆర్ఎస్ హెచ్చరిక
- రంగంలోకి ప్రత్యేక బృందాలు.. నిందితులను కఠినంగా శిక్షిస్తాం: ఎస్పీ హామీ!
సూర్యాపేట బ్యూరో, ఏపీబీ న్యూస్: యర్కారంలో అర్ధరాత్రి వేళ జరిగిన మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు హత్యపై సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం మధు భౌతికకాయానికి నివాళులర్పించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గారు కేసు దర్యాప్తు పురోగతిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు.
రాజకీయ పగలకు కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులే బాధ్యులు: జగదీష్ రెడ్డి
మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అధికార పక్షం, స్థానిక పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ రౌడీల చేతుల్లో పోలీస్ స్టేషన్లు: “మధు ది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న నల్లగొండ జిల్లాను, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో మళ్లీ అరాచకాలకు వేదికగా మార్చారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా మారి, బీఆర్ఎస్ కేడర్‌ను స్టేషన్లకు పిలిపించి మరీ అవమానపరుస్తున్నారు. ఈ హత్యలో స్థానిక పోలీసుల భాగస్వామ్యం కూడా ఉందనే అనుమానం మాకుంది.” అని మండిపడ్డారు.
సాక్షులను భయపెట్టే కుట్ర: “గతంలో మా పార్టీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నను దారుణంగా హత్య చేసిన కాంగ్రెస్ గుండాలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వెంకన్న కేసు కోర్టు విచారణ తుది దశకు చేరిన తరుణంలో, ప్రధాన సాక్షిగా ఉన్న మధు సాక్ష్యం చెప్తే తమకు యావజ్జీవ శిక్ష పడుతుందనే భయంతోనే నమ్మించి తీసుకెళ్లి కిరాతకంగా చంపేశారు. కేసును బలహీనం చేయడం కోసమే కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) ని సడన్‌గా మార్చడం దుర్మార్గం. ‘నువ్వు ఎగిరిపోతావ్’ అని స్వయంగా మధుతో అన్న ఎస్ఐకి అతడిని కాపాడాల్సిన బాధ్యత లేదా?” అని నిలదీశారు.
కేసు తిరగదోడుతాం – ఐజీలైనా జైలుకే: “కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో, రిమాండ్ రిపోర్టులో ఏం చూపిస్తారో నిమిషం నిమిషం పరిశీలిస్తాం. తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఏ అధికారినైనా వదిలిపెట్టం. తప్పుడు విచారణ చేస్తే ఐజీ స్థాయి అధికారులను సైతం పదేళ్ల తర్వాత జైలుకు పంపిన ఘటనలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి.” అని హెచ్చరిస్తూ.. మధు ఇద్దరు ఆడపిల్లల చదువుల బాధ్యతను, కుటుంబ పోషణను బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ప్రత్యేక బృందాలతో గాలింపు – ఎస్పీ నరసింహ:
మరోవైపు, యర్కారం గ్రామంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గారు స్పందించారు.
వేగంగా దర్యాప్తు: “చింతలపాటి మధు హత్య కేసు దర్యాప్తు అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ మరియు సాంకేతిక ఆధారాల సహాయంతో ఇప్పటికే కీలక లూప్‌హోల్స్‌ను సేకరించాం. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించాం.” అని ఎస్పీ వెల్లడించారు.
కఠిన శిక్ష తప్పదు: చట్టాన్ని అతిక్రమించి ఇటువంటి కిరాతకానికి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా త్వరలోనే అరెస్టు చేస్తామని, వారికి కోర్టు ద్వారా కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
విశ్లేషణ: “వ్యవస్థ నిష్పాక్షికతకు ఇది పరీక్షా సమయం”
హత్య కేసుల్లో ప్రధాన సాక్షులకే రక్షణ లేకపోతే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం సడలిపోతుంది. ఒకవైపు రాజకీయ వేధింపులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మార్పుపై మాజీ మంత్రి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తుండటంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ అయింది. ఎస్పీ నరసింహ గారు ప్రకటించినట్లుగా, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా విచారణ జరిపి, అసలైన సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ‘ఏపీబీ న్యూస్’ అభిప్రాయపడుతోంది.