Breaking News:లంచం తీసుకుంటూ ఏసీబీకీ పట్టుబడ్డ మహిళా ఎస్సై నందిత..

సికింద్రాబాద్, ఏపీబీ న్యూస్: శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ స్టేషనే అవినీతికి అడ్డాగా మారింది. ఓ కేసు విషయంలో సహాయం చేయడానికి బాధితుడి నుంచి భారీగా లంచం డిమాండ్ చేసిన బోయిన్పల్లి మహిళా ఎస్సై నందిత చివరకు ఏసీబీ వలలో చిక్కారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసు విషయమై బాధితుడు ఎస్సై నందితను ఆశ్రయించారు. అయితే, ఆ పని చేసి పెట్టడానికి ఆమె పెద్ద మొత్తంలో డబ్బులు ఆశించారు. అంతటితో ఆగకుండా, “ఈ డబ్బులు నా ఒక్కదానికే కాదు.. స్టేషన్లో ఉన్న అందరికీ వాటాలు పంపిణీ చేయాలి” అంటూ బాధితుడిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

అధికారుల వేధింపులు భరించలేక, లంచం ఇవ్వడం అస్సలు ఇష్టం లేని సదరు బాధితుడు రహస్యంగా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో నిఘా పెట్టారు.

బుధవారం నాడు బాధితుడి నుంచి ఎస్సై నందిత పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే నేరుగా లంచం డబ్బులు తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు ఆమెను అడ్డుకొని రసాయన పరీక్షలు నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితురాలి నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

కేసుల పేరుతో సామాన్య ప్రజలను పీడించి, స్టేషన్ అంతటికీ వాటాలంటూ బహిరంగంగానే లంచాలు డిమాండ్ చేయడం పోలీస్ శాఖ ప్రతిష్టను మసకబారుస్తోంది. కేవలం ఎస్సై నందితపైనే కాకుండా, ఆమె చెప్పినట్లుగా ఆ స్టేషన్లో ఇంకా ఎవరెవరికి ఈ అక్రమ వసూళ్లలో భాగస్వామ్యం ఉందనే కోణంలోనూ ఏసీబీ అధికారులు సమగ్ర విచారణ జరపాలని ‘ఏపీబీ న్యూస్’ డిమాండ్ చేస్తోంది.

Share
Share