- కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం
- సాయంత్రంలోగా రాజీనామా చేయాలని ఆదేశం! బర్తరఫ్ లేఖ సిద్ధం?
- మంత్రి పదవికి రాజీనామా చేయకపోతే లోక్‌భవన్‌కు బర్తరఫ్ ఆదేశాలు..
- సీఎంతో పాటు ఏఐసీసీ తీరుపై తీవ్ర అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్‌బై చెప్పే యోచనలో సురేఖ!
హైదరాబాద్ ఏపీబీ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ సర్కారులో గత కొన్ని రోజులుగా రాజుకున్న అంతర్గత విభేదాలు, రాజకీయ రచ్చ చివరకు క్లైమాక్స్కు చేరుకున్నాయి. మంత్రి కొండా సురేఖను తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర అల్టిమేటం జారీ చేసినట్లు పార్టీ వర్గాల్లో విశ్వసనీయ సమచారం వెలువడుతోంది.
సాయంత్రంలోగా రాజీనామా లేఖను సమర్పించకపోతే, ఆమెను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ రాజ్భవన్ (లోక్భవన్)కు సిఫార్సు లేఖ పంపిస్తామని అధిష్ఠానం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
తాజా పరిణామాల ముఖ్యాంశాలు:
ఖర్గే ఆదేశం: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంత్రి సురేఖతో మాట్లాడి, స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, బర్తరఫ్ స్థాయి వరకు పరిస్థితిని తెచ్చుకోవద్దని సూచించినట్లు భోగట్టా.
పునరాలోచనకు నిరాకరణ: తాను మంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తున్నానని, ఈ విషయంలో పునరాలోచించాలని సురేఖ విజ్ఞప్తి చేసినప్పటికీ అధిష్ఠానం ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదని సమాచారం.
రేవంత్ రాకముందే ప్రక్రియ?: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకునేలోపే రాజీనామా ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజీనామాయే ఉత్తమమని నిర్ణయం: స్వయంగా బర్తరఫ్ అవ్వడం కంటే, రాజీనామా చేయడమే గౌరవప్రదమని కొండా సురేఖ తన అనుచరులు, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పార్టీకి కూడా గుడ్‌బై చెప్పే యోచన!
వరంగల్ వేదికగా కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా అధిష్ఠానం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే, తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, బీసీ మహిళా నాయకురాలిని టార్గెట్ చేశారని సురేఖ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి నుంచి తొలగించాక లేదా రాజీనామా చేశాక కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆమె భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేవలం మంత్రి పదవికే కాకుండా, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే యోచనలో కొండా సురేఖ దంపతులు ఉన్నట్లు సమాచారం.