Breaking News: నల్గొండ మేయర్ భర్త బుర్రి శ్రీనివాస్ రెడ్డిపై, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై రెండు కేసులు నమోదు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్గొండలో బీజేపీ-కాంగ్రెస్ శ్రేణుల మధ్య చోటుచేసుకున్న పరస్పర దాడులు, ఘర్షణల వ్యవహారంలో పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు మొత్తం మూడు కేసులు నమోదు చేశారు.

నల్గొండలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంపై బీజేపీ నేతలు రాళ్లు, టమాటాలు విసిరి దాడికి పాల్పడ్డారని, అనంతరం మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, కంబాలపల్లి సతీష్ తో పాటు మరో పది మందిని నిందితులుగా చేర్చారు. అలాగే బీజేపీ కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులపైకి బీజేపీ కార్యాలయం నుంచి రాళ్లు విసిరారనే ఆరోపణపై వర్షిత్ రెడ్డిపై టూటౌన్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో వర్షిత్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారని, తన తల్లిపై దాడికి యత్నించారని వర్షిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రస్తుత మేయర్ భర్త అయిన బుర్రి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులు సుమారు 40 మందితో కలిసి వచ్చి ఈ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరులపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నమోదైన మూడు కేసులపై వన్ టౌన్, టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share
Share