నిరసన తెలిపితే ఇళ్లపై దాడులా? మంత్రి కోమటిరెడ్డిపై బీజేపీ నేతల ఆగ్రహం

నల్లగొండ, ఏపీబీ న్యూస్: హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట తాము శాంతియుతంగా నిరసన తెలిపితే, దానికి ప్రతిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపైకి వెళ్లి దాడి చేయడం ఏంటని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి ప్రశ్నించారు.

మంగళవారం నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షిత్ రెడ్డి నివాసంపై, ఆయన తల్లి శ్రీదేవిపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే ఇలా దాడులను ప్రోత్సహించడం సిగ్గుచేటని విమర్శించారు.

దాడికి పాల్పడిన వారందరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని, నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కోమటిరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ పోలీస్ యంత్రాంగం పూర్తిగా మంత్రి చెప్పు చేతల్లో ఉందని, కళ్లెదుటే కాంగ్రెస్ కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నా పోలీసులు చోద్యం చూశారని ఆరోపించారు. జిల్లా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముందస్తు ప్రణాళికతోనే పాతబస్తీకి చెందిన కార్పొరేటర్లను, వారి అనుచరులను తీసుకొచ్చి దాడులు చేయించారని ఆయన ఆరోపించారు.

అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, తాము కేవలం నిరసన మాత్రమే తెలిపామని, కానీ మంత్రి అనుచరులు నేరుగా తన ఇంటిపైకి వచ్చి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకే తన ఇంటిపై దాడి జరిగిందని, తన తల్లిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. తన కుటుంబాన్ని అంతం చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగారన్నారు. ఈ దాడితో తన తల్లికి గుండెపోటు వచ్చిందని, ఆమెకు ఏమైనా జరిగితే మంత్రి కోమటిరెడ్డిదే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు. భౌతిక దాడులకు దిగిన కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలని, త్వరలోనే వారి భరతం పడతామని అన్నారు. మంత్రిని మెప్పించేందుకే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ అరాచకం శృతి మించిందని, రాష్ట్రంలో అటవిక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.

Share
Share