- వెయ్యి రోజుల విఫల పాలనపై ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ
- సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు నిరసనలు.. నల్లగొండలో పార్టీ శ్రేణులకు కంచర్ల భూపాల్‌రెడ్డి పిలుపు
- సెప్టెంబర్ 3న మిర్యాలగూడకు కేటీఆర్.. భారీగా తరలిరావాలని నల్లమోతు భాస్కర్‌రావు విజ్ఞప్తి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళనలకు సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపిస్తూ రాష్ట్ర పార్టీ ప్రకటించిన ఎనిమిది రోజుల నిరసన కార్యక్రమాలను నియోజకవర్గంలో విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకత్వం పిలుపునిచ్చింది.
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన కేబీఆర్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల విఫల పాలనపై రాష్ట్ర పార్టీ ప్రకటించిన నిరసన కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. సెప్టెంబర్ 1న ప్రెస్‌మీట్, 2న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, బాకీ కార్డుల పంపిణీ, ప్లెక్సీల ప్రదర్శన, 3న రైతు సదస్సులు, 4న మహిళలు, వికలాంగులతో వంటావార్పు, 5న ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్ కోసం యువత ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 7న మండల, జిల్లా ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేయడంతో పాటు, 8న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మరో ఏడాది మాత్రమే పరిపాలన సాగించి, ఆ తర్వాత ఎన్నికల సంవత్సరం రానుందని అన్నారు. ఇప్పటివరకు ప్రజలకు చేసిందేమీ లేకపోవడంతో కేసీఆర్‌ను బదనాం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ వాస్తవాలను ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సెప్టెంబర్ 3న మిర్యాలగూడకు రానున్న నేపథ్యంలో నల్లగొండ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ కటికం సత్తయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ కరీం పాషా, బొజ్జ వెంకటయ్య, మాజీ జడ్పీటీసీలు తండు సైదులుగౌడ్, తుమ్మల లింగస్వామి, నగర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, నల్లగొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు, నగర, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.