- సూర్యాపేట జిల్లాలో కలకలం
- మామూళ్లు ఇవ్వలేదని రాత్రికి రాత్రి షాపుల తొలగింపు..
- న్యాయం చేయాలని నిరసనకు దిగితే మహిళలని కూడా చూడకుండా నెట్టేసిన మున్సిపల్, పోలీస్ అధికారులు
సూర్యాపేట ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మున్సిపల్ అధికారులు, పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర తీవ్ర కలకలం రేపింది. న్యాయం చేయాలంటూ నిరసన తెలిపిన బాధితులపై కోదాడ టౌన్ సీఐ (CI) నడిరోడ్డుపై దాష్టీకానికి పాల్పడటం, కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.
బాధితులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని 32వ వార్డులో ఉన్న పలు వ్యాపార షాపులను మున్సిపల్ అధికారులు రాత్రికి రాత్రి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆకస్మికంగా తొలగించారు.
మామూళ్లు ఇవ్వలేదనే కక్షసాధింపు!
సంఘటన ముఖ్యాంశాలు & ఆరోపణలు:
బాధితుల ఆరోపణలు: మున్సిపల్ కమిషనర్కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే కక్షగట్టి తమ షాపులను రాత్రికి రాత్రి అక్రమంగా తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డుపై నిరసన: మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారుల ఏకపక్ష తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులు రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు.
సీఐ వీరంగం: నిరసన తెలుపుతున్న బాధితుల వద్దకు వచ్చిన కోదాడ టౌన్ సీఐ, వారిపై దాడి చేసి, కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లారు.
మహిళలపై దాడి:
సీఐ చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్తున్న సమయంలో అడ్డొచ్చిన బాధితుల కుటుంబ సభ్యులైన మహిళలను కూడా చూడకుండా పక్కకు నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. అనంతరం బాధితులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే మహిళల పట్ల, వ్యాపారుల పట్ల ఇలా దౌర్జన్యంగా ప్రవర్తించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు కారణమైన మున్సిపల్ కమిషనర్ మరియు బాధితులపై దాడి చేసిన టౌన్ సీఐపై ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.