- మంత్రి సీతక్కతో కలిసి సీఎం నివాసంలో రాఖీ వేడుకలు..
- రేవంత్ రెడ్డితో పాటు ఆయన అల్లుడు, మనవడికి కూడా రాఖీ కట్టిన కొండా సురేఖ
హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్) వేడుకలు కోలాహలంగా సాగాయి. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) కలిసి సీఎం రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు రాఖీ ని కట్టడం విశేషం.
ప్రతి ఏడాదిలాగే సీఎంకు రాఖీ కట్టాను: మంత్రి కొండా సురేఖ
రాఖీ కట్టిన అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
మంత్రి కొండా సురేఖ కామెంట్స్:
మూడోసారి బంగారు రాఖీ: “సీఎం రేవంత్ రెడ్డికి ఇది వరుసగా మూడోసారి రాఖీ కట్టడం. ఆయన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బంగారు రాఖీని ఈ రోజు కట్టాను. సీఎంతో పాటు ఆయన అల్లుడికి, మనవడికి కూడా రాఖీలు కట్టాను” అని వెల్లడించారు.
నన్ను వేరు చేసి చూడకండి:
“నేను రాష్ట్రంలోని అందరి ఆడపడుచును. నన్ను ఎవరూ వేరు చేసి చూడకండి. తెలంగాణ ఆడపడుచులపై సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఆయనకు మహిళల అండ దండలు నిరంతరం ఉంటాయి” అని స్పష్టం చేశారు.
అభివృద్ధికి శక్తినివ్వాలి: సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు.రాజకీయ కామెంట్స్‌పై స్పందన: పండుగ వాతావరణంలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనని, పవిత్రమైన రోజున శుభాకాంక్షలు మాత్రమే తెలుపుతున్నానని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.