Breaking News: కాంగ్రెస్ కొట్లాట ఇస్తారాకుల దగ్గర కుక్కలు కోట్లాడుకున్నట్లు ఉంది: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడుతున్న రాజకీయ నాటకాలు, ద్రోహం సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) ఇచ్చిం రిపోర్ట్తో తేటతెల్లమయ్యాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి. జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బడుగుల లింగయ్య యాదవ్, ఎన్. భాస్కర్ రావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, పైళ్ల శేఖర్ రెడ్డి, నోముల భగత్లతో కలిసి ఆయన మాట్లాడారు.

మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా తక్షణమే కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేసి ఇతర జలాశయాలను నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే చెప్పినా, ఈ ప్రభుత్వం కావాలనే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. NDSA సాకు చూపిస్తూ, కమిషన్లకు అలవాటు పడి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించకుండా రైతులను వంచిస్తున్నారని ఆరోపించారు.

పోతిరెడ్డిపాడు ద్వారా నీటి దోపిడీ: పోతిరెడ్డిపాడు నుంచి కేవలం వరద జలాలను మాత్రమే తరలించాల్సి ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా 140 టీఎంసీల నీటిని తోడేసిందని విమర్శించారు. ఏపీ నీటిని దోచుకుపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం నోరు మెదపకపోవడం ద్రోహమేనని వ్యాఖ్యానించారు.

నాగార్జునసాగర్కు అన్యాయం: నాగార్జునసాగర్లో ప్రస్తుతం 175 టీఎంసీల నీరు ఉందని, మరో 110 టీఎంసీలు వచ్చి ఉంటే సాగర్ పూర్తిగా నిండేదని తెలిపారు. 510 నుండి 518 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎడమ కాల్వ కింద పంటలకు సాగునీరు అందించిందని గుర్తుచేశారు.

పంపులు ఆన్ చేయరా?: మహబూబ్నగర్ పరిధిలోని పంపులను ఇప్పటివరకు ఆన్ చేయలేదని, పెన్నా బేసిన్లో వరద రాకున్నా రాయలసీమకు నీళ్లు వెళ్తున్నా తెలంగాణ మంత్రులు స్పందించడం లేదన్నారు.

రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర: రైతులకు నీళ్లిస్తే కరెంట్ కొనాలని, పంటలు వేస్తే ఎరువులు ఇవ్వాలని, పండిన పంటకు బోనస్ చెల్లించాల్సి వస్తుందనే దుర్మార్గపు ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు ఇవ్వడం లేదని ఆరోపించారు.

‘ఎల్ నినో’ కాంగ్రెస్ పెట్టిన శాపం: అధికారులకు నీళ్లు ఇవ్వవద్దని ఆదేశాలు ఇస్తున్నారని.. ‘ఎల్ నినో’ వల్ల కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే తెలంగాణ రైతు పరిస్థితి ఉమ్మడి రాష్ట్రం కంటే అద్వాన్నంగా తయారైందని అన్నారు.

కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి: కన్నెపల్లి పంపులను ఆన్ చేసి మల్లన్న సాగర్, కొండ పోచమ్మ, రంగనాయక సాగర్లను నింపాలని, ప్రభుత్వం తక్షణమే కేసీఆర్కు క్షమాపణ చెప్పి పంపులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య నిత్యం పంచాయతీలు నడుస్తున్నాయని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. భూభారతి పై వివాదాలు, కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యేపై చేసిన కోట్లాది రూపాయల టికెట్ ఆరోపణలు, అలాగే ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి, మదన్ మోహన్లు సొంత ప్రభుత్వంపైనే చేసిన విమర్శలను ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకులు తమ అంతర్గత గొడవలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ కుట్రలు అని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, ఆ గొడవలు “ఇస్తరాకుల దగ్గర కుక్కలు కొట్లాడుకున్నట్లుగా” ఉన్నాయని ఘాటుగా విమర్శించారు.

రైతులకు వెంటనే సాగర్ ఎడమ కాలువ కింద సాగునీరు విడుదల చేయకపోతే, దేవరకొండ మరియు ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Share
Share