- ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్
- అక్కడికక్కడే పరిష్కారానికి ఆదేశాలు.. పలు సంక్షేమ పథకాలకు మంజూరు
నల్లగొండ, ఏపీబీ న్యూస్: ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పల్లె బాట పట్టారు. శుక్రవారం త్రిపురారం మండలం లోక్యతండలో ఇంటింటికీ కాలినడకన తిరుగుతూ గ్రామస్థులను పలకరించిన ఆయన.. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలు చెప్పిన ప్రజలకు భరోసా కల్పించడంతోపాటు, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గ్రామంలో దాస్ అనే రైతును పలకరించిన కలెక్టర్.. ఎంత భూమిలో పంట సాగు చేస్తున్నావంటూ ఆరా తీశారు. ప్రస్తుతం ఎకరం భూమిలో సాగు చేస్తున్నట్లు రైతు చెప్పడంతో.. మరో ఎకరంలో కందులు వంటి తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలని సూచించారు.
పింఛన్ కోసం ఫిర్యాదు.. 13 మందికి మంజూరు
పింఛన్ రావడం లేదని ఓ గ్రామస్థుడు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన ఆయన.. వివరాలను పరిశీలించి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం గ్రామంలో 43 పింఛన్లు ఉండగా, అదనంగా మరో 13 పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.
40 కుటుంబాలకు నల్లా కనెక్షన్లు
గ్రామంలో మంచినీటి సమస్యను ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. సుమారు 40 కుటుంబాలకు నల్లా కనెక్షన్లు లేవని తెలిపారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్(RWS) అధికారులతో మాట్లాడిన కలెక్టర్ నీటి సరఫరా లైన్ను పరిశీలించి ఓహెచ్ఎస్ఆర్(OHRS)కు కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచిస్తూ.. గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టాలని ఎంపీడీవో(MPDO)ను ఆదేశించారు.
గుడిసెలో ఉన్న కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు
గుడిసెలో నివసిస్తున్న ధనావత్ కృష్ణకుమారి ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్కు తెలిపారు. వెంటనే ఆన్లైన్లో వివరాలను పరిశీలించిన కలెక్టర్.. ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు.
పాఠశాలకు కాంపౌండ్ వాల్.. యూనిఫారాలు
గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన సమావేశంలో గ్రామ అభివృద్ధి, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు కేటాయించామని కలెక్టర్ తెలిపారు. గ్రామంలో రెండు డ్రైనేజీ పనులు మంజూరు చేసినట్లు వెల్లడించి.. వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి గ్రామపంచాయతీలో తీర్మానం చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం నుంచి విద్యార్థులకు యూనిఫారాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీవో భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఆర్డీవో సర్వే చేసి పనులు ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు.
అనంతరం పాఠశాలను సందర్శించిన కలెక్టర్.. కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, పెయింటింగ్ పనులకు అంచనాలు సిద్ధం చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. ఆశా కార్యకర్తలను కలిసి చిన్నారులకు అన్ని రకాల టీకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ ఏ తరగతి చదువుతున్నారని, చదువు ఎలా సాగుతోందని ఆరా తీశారు.
పరిశుభ్రతపై అవగాహన
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కలెక్టర్ సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను డ్రైనేజీల్లో వేయొద్దని, పారిశుద్ధ్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు. గ్రామంలో ప్రస్తుతం పాటిస్తున్న పరిశుభ్రత భావితరాలకు కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రజల మధ్యకు వచ్చి ఇంటింటికీ తిరుగుతూ తమ సమస్యలను నేరుగా తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్న కలెక్టర్ తీరుపై లోక్యతండ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రమణారెడ్డి, తహసిల్దార్ జి. ప్రమీల, ఎంపీడీవో విజయకుమారి, సర్పంచ్ జ్యోతి కాంతారావు, కార్యదర్శి నాగరాజు, ఎస్టీ సంఘం శ్రీనివాస్ నాయక్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.