Breaking News: గాంధీ జయంతి నాటికి చెత్తరహిత మిర్యాలగూడ: కలెక్టర్ కీలక ఆదేశాలు

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: రాబోయే అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి మిర్యాలగూడ మున్సిపాలిటీని పూర్తిస్థాయి ‘చెత్తరహిత మున్సిపాలిటీ’గా తీర్చిదిద్దాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడ మున్సిపల్ సమావేశ మందిరంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (BLR) తో కలిసి మున్సిపాలిటీ పరిధిలో అమలు జరుగుతున్న పారిశుధ్యం, తాగునీరు, ‘నక్ష’ ప్రాజెక్ట్, ఆస్తి పన్ను వసూళ్లు, అభివృద్ధి పనులపై సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.

పట్టణంలో చెత్త పేరుకుపోవడం వల్ల వ్యాధులు, దోమలు, కుక్కల బెడద పెరుగుతుందని, పారిశుధ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని కలెక్టర్ సూచించారు. ఇకపై సిబ్బందికి ఆన్లైన్ అటెండెన్స్ తప్పనిసరి అని తేల్చి చెప్పారు.

చెత్తరహిత పట్టణం: మున్సిపాలిటీలో గుర్తించిన 30 గార్బేజ్ పాయింట్లను పూర్తిగా తొలగించాలి. అక్టోబర్ 2 నుండి ప్రతి ఇంటా 4 రకాల చెత్త సేకరించే బాక్సులు అందుబాటులోకి తేనున్నారు. ఎవరైనా బయట చెత్త వేస్తే పెనాల్టీలు విధిస్తారు.

ప్లాస్టిక్ నిషేధం & షాపుల సీజ్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై కఠినంగా ఉండాలి. బయోడిగ్రేడబుల్ కవర్లు, బట్ట సంచులు వాడని షాపులకు నోటీసులిచ్చి, వినకపోతే వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు.

నక్ష (NAKSHA) సర్వే వేగవంతం: పైలట్ ప్రాజెక్ట్ నక్షలో 32 వార్డులకు గాను 25 వార్డుల సర్వే పూర్తయింది. రోజుకు 30 డేటా ఎంట్రీలు పూర్తి చేస్తూ వారంలోపు ROR ఎంట్రీల ప్రక్రియ ముగించాలి.

తాగునీటి ప్రాజెక్టులు: డిసెంబర్ నాటికి అమృత్ (AMRUT) పథకం కింద నిర్మిస్తున్న OHSR ట్యాంకుల పనులను పూర్తి చేయాలని పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు. వార్దు అధికారుల వద్ద ప్రొఫైల్ లేకుంటే చర్యలు తప్పవు.

పన్నుల వసూళ్లు: ₹16 కోట్ల ఆస్తి పన్ను లక్ష్యానికి గాను కేవలం 20 శాతం మాత్రమే వసూలవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వసూళ్లు వేగవంతం చేయాలన్నారు.

ఆస్పత్రిలో ప్రారంభోత్సవాలు: సమావేశానికి ముందు కలెక్టర్, ఎమ్మెల్యే కలిసి మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో వికలాంగుల వైకల్య నిర్ధారణ కేంద్రం, ఊయల కేంద్రం, డేటా ఎంట్రీ కేంద్రాలను ప్రారంభించారు.

సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలో తాగునీటి ఎన్ఎస్పి క్యాంప్, చింతపల్లి, అడవిదేవులపల్లి ప్రాంతాల్లో సబ్స్టేషన్ల మంజూరుకు కలెక్టర్ సహకరించాలని కోరారు. అలాగే జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు 4 చోట్ల వై-జంక్షన్లు (Y-Junctions) ఏర్పాటు చేయాలని, రహదారులపై తోపుడు బండ్ల ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష, అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్, డిసిహెచ్ఎస్ మాతృ, ఆర్డీఓ రమణారెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share
Share