Breaking News: పర్సనల్, బాత్రూమ్ వీడియోలతో వేధింపులు.. న్యాయం కోరితే ఎస్ఐ అవమానం

మహబూబాబాద్, ఏపీబీ న్యూస్: రక్షణ కల్పించాల్సిన పోలీసులే వేధింపుల బాధితులను మరింత దారుణంగా అవమానించిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. తమ పర్సనల్, బాత్రూమ్ వీడియోలు తీసి మూడేళ్లుగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లిన అంగన్వాడీ టీచర్, హెల్పర్లపై స్థానిక ఎస్ఐ బూతులతో విరుచుకుపడటంతో పాటు బెదిరింపులకు పాల్పడిన దారుణ ఘటన దంతాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దొనకొండ గ్రామంలోని స్కూల్లో ఆవుల మంజుల అంగన్వాడీ టీచర్గా, వెంకటలక్ష్మి హెల్పర్గా విధులు నిర్వహిస్తున్నారు. నరేష్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా వారు స్కూల్లో పనిచేస్తున్న సమయంలో వారి పర్సనల్ వీడియోలను, బాత్రూమ్కు వెళ్తున్న దృశ్యాలను రహస్యంగా తీసి తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.

ఈ వేధింపులు తాళలేక బాధితులు ఈ నెల 1వ తేదీన దంతాలపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SI) రవికుమార్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఎస్ఐ ఘోర ప్రవర్తన: న్యాయం చేస్తానని నమ్మించి పోలీస్ స్టేషన్కు పిలిపించిన ఎస్ఐ రవికుమార్, తమను వేధిస్తున్న నిందితుడు నరేష్ ముందే మహిళలని కూడా చూడకుండా బూతులు తిడుతూ తీవ్రంగా దూషించాడు.

చంపేస్తామని బెదిరింపులు: ఎస్ఐ తన ఛాంబర్లోకి పిలిచి తమతో పాటు తమ భర్తలను అసభ్య పదజాలంతో నిందిస్తూ, ‘మిమ్మల్ని తొక్కి చంపుతా’ అంటూ బెదిరించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

స్పృహతప్పిన అంగన్వాడీ టీచర్: ఎస్ఐ ప్రవర్తించిన తీరుతో తీవ్ర మానసిక ఆవేదనకు, మనస్తాపానికి గురైన అంగన్వాడీ టీచర్ మంజుల స్టేషన్లోనే స్పృహ కోల్పోయి కిందపడిపోయింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోగా తమపైనే అక్రమంగా బూతులతో దాడికి దిగిన ఎస్ఐ రవికుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ (SP) కి ఫిర్యాదు చేశారు.

అలాగే తొర్రూరు సీఐ (CI) గణేష్కు కూడా వినతిపత్రం అందజేశారు. తమను తీవ్రంగా అవమానించిన దంతాలపల్లి ఎస్ఐను వెంటనే సస్పెండ్ చేయాలని, తమ వీడియోలు తీసి వేధిస్తున్న నరేష్పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఐను సస్పెండ్ చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు ఆవేదనతో స్పష్టం చేశారు.

Share
Share