నాపై కక్షతోనే ఎస్‌ఎల్‌బీసీ పనులు పక్కనపెట్టారు: కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం

నల్లగొండ,ఏపీబీ న్యూస్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ తనపై ఉన్న వ్యక్తిగత కక్షతోనే శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగం పనులను పదేళ్ల పాటు పక్కన పెట్టారని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవేళ ఎస్ఎల్బీసీ పనులు గతంలోనే పూర్తయి ఉంటే ఈరోజు నల్లగొండ జిల్లాలో కరువు అనేదే ఉండేది కాదని స్పష్టం చేశారు.

రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శనివారం నల్లగొండ, తిప్పర్తి మండలాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు.

తిప్పర్తి మండలం పజ్జూరు, ఎర్రగండ్లగూడెం, ఇండ్లూరు, మామిడాల గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, రైతులతో జరిగిన ఆత్మీయ సమావేశాల్లోనూ, అనంతరం మీడియా సమావేశంలోనూ మంత్రి మాట్లాడారు.

ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగం: 2007లో ప్రారంభించిన ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదవశాత్తు కూలిపోవడంతో అమెరికా నుంచి అత్యాధునిక బేరింగ్లను తెప్పించి పనులను పునఃప్రారంభించామని, 2028 ఆగస్టు నాటికి పనులు పూర్తిచేసి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. నిర్మాణం పూర్తయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గంగా నిలుస్తుందన్నారు.

రూ.30 కోట్లతో సబ్స్టేషన్: పజ్జూరు – ఎర్రగండ్లగూడెం మధ్య రూ.30 కోట్లతో 132 కేవీ సబ్స్టేషన్ మరియు పజ్జూరుకు 8 MVA ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల చుట్టుపక్కల 10 గ్రామాలకు విద్యుత్ సమస్య తీరడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది.

రూ.20,000 కోట్ల రహదారుల విప్లవం: రాష్ట్రవ్యాప్తంగా రూ.13,000 కోట్లతో హ్యామ్ (HAM) రోడ్లు, మరో రూ.7,000 కోట్లతో ఆర్అండ్ బి (R&B) రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని, రాబోయే 2-3 నెలల్లో ప్రతి గూడేనికి బీటీ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు.

అభివృద్ధి నిధుల పంపిణీ: ఎర్రగండ్లగూడెంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కోసం రూ.20 లక్షలు, ఇండ్లూరులో రూ.50 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు.

రాజకీయ అంశాలపై స్పందిస్తూ కేటీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని మంత్రి విమర్శించారు. “రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. జీతభత్యాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాని కేసీఆర్ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను సీనియర్ మంత్రిగా గౌరవిస్తారు, నేను అడిగితే కాదనరు. కేసీఆర్ వల్ల కానిది మేము చేసి చూపిస్తాం. రాబోయే ఎన్నికల్లో మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంది” అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ఈ పర్యటనలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్డీవో శేఖర్ రెడ్డి, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, ఆర్అండ్ బి మరియు పంచాయతీరాజ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి వెంట పాల్గొన్నారు.

Share
Share