భారీ వర్షాల హెచ్చరికలు: అధికారులకు సెలవులు రద్దు: సీఎస్ సంజయ్ జాజు ఆదేశం

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండడం, మరికొన్ని ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. వర్షాల తీవ్రతను దృష్ట్యా అన్ని జిల్లాల పాలనా యంత్రాంగాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు ఆదేశించారు.

గురువారం హైదరాబాద్ నుంచి సీఎస్ సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మరియు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షించారు.

రాష్ట్రంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు.

నో సెలవులు: అత్యవసర పరిస్థితుల దృష్ట్యా అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవుపై వెళ్లకూడదని, అంతా తమ తమ హెడ్క్వార్టర్స్లోనే అందుబాటులో ఉండాలని సూచించారు.

24×7 కంట్రోల్ రూమ్లు: అన్ని జిల్లాల్లో నిరంతరం పనిచేసేలా వర్షాల అత్యవసర కంట్రోల్ రూమ్లను వెంటనే ప్రారంభించాలి.

ప్రాజెక్టులు & చెరువుల పరిశీలన: నీటిపారుదల ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు మరియు ప్రధాన రహదారుల వద్ద ముందస్తు అప్రమత్తత అవసరం.

అత్యవసర బృందాలు: భారీ వర్ష బాధితులను ఆదుకోవడానికి ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.

వర్షాల వల్ల అంటువ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్త వహించాలని వైద్య ఆరోగ్య శాఖను సీఎస్ ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పాము కాటు, తేలు కాటుకు అవసరమైన విరుగుడు మందులను జిల్లా ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంచాలని తెలిపారు. విద్యుత్, తాగునీటి సరఫరాకు ఎక్కడా అంతరాయం కలగకుండా సంబంధిత శాఖలు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పాతబడిన, పడిపోయే ప్రమాదం ఉన్న భవనాలను గుర్తించి, అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలని పేర్కోన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందన్నారు. ప్రజల సౌకర్యార్థం మరియు అత్యవసర సహాయం కోసం కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని తెలిపారు.

వర్షాల వల్ల ఎలాంటి సమస్య ఎదురైనా లేదా అత్యవసర సహాయం కావాలన్నా ప్రజలు ఈ నంబర్కు సమాచారం అందించవచ్చని కలెక్టర్ కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డీఆర్ఓ ఆర్. దశరథ, సీపీఓ శ్రీనివాస్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి టి. శేఖర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share
Share