- “మునుగోడులో రాజగోపాల్‌ను గెలిపించినందుకు నా క్యాడర్ బాధపడుతోంది..
- నా నియోజకవర్గానికి వచ్చి మంత్రి కనీసం సమాచారం ఇవ్వరా?”
- అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్‌పై తుంగతుర్తి ఎమ్మెల్యే ధ్వజం.
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం మరింత ఉత్కంఠగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన మార్క్ ఆవేశంతో కోమటిరెడ్డి బ్రదర్స్ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎదురుదాడికి దిగారు.
రాజగోపాల్ కంటే నేనే సీనియర్ని!
“రాజగోపాల్ రెడ్డి పార్టీలు మారి కాంగ్రెస్లోకి వచ్చారు. ఆయనకంటే ముందే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను” అని మందుల సామేలు స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో తనకు కూడా సొంత క్యాడర్ ఉందని, గత ఎన్నికల్లో మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించినందుకు తన వర్గం కార్యకర్తలు తీవ్రంగా బాధపడుతున్నారని తెలిపారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం (AICC) అని, రాజగోపాల్ రెడ్డి ఎంతమాత్రం కాదని తేల్చి చెప్పారు.
ఎమ్మెల్యే మందుల సామేలు వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు:
- టికెట్పై స్పష్టత: నాకు టికెట్ ఇచ్చింది ఏఐసీసీ, రాజగోపాల్ రెడ్డి కాదు.
- పార్టీ సీనియారిటీ: రాజగోపాల్ రెడ్డి కంటే ముందే నేను కాంగ్రెస్లోకి వచ్చాను.
- సామాజిక సమీకరణలు: నాకు రెడ్లు ఓటేశారు, రాజగోపాల్ రెడ్డికి మాదిగలు ఓటేశారు.. కేవలం రెడ్లు, దళితులతోనే రాజ్యం నడవదు.
- మంత్రి తీరుపై అసంతృప్తి: నా నియోజకవర్గానికి వచ్చి రోడ్లను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు.
ఒక్క మాట చెప్పకపోవడం ఏంటి?
ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరిపైనా సామేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గానికి వచ్చి రోడ్లను పరిశీలించిన మంత్రి, స్థానిక శాసనసభ్యుడినైన తనకు కనీసం ఒక్క మాటైనా సమాచారం ఇవ్వకపోవడం ఏంటని నిలదీశారు. ఇదే సమయంలో సామాజిక సమీకరణలను ప్రస్తావిస్తూ, “నాకు రెడ్లు ఓటేశారు, మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి మాదిగలు ఓటేశారు.. కేవలం రెడ్లు, దళితులతోనే ప్రభుత్వం లేదా రాజ్యం నడవదు” అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులను గౌరవించకుండా పెత్తనం చెలాయించాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.