- ఘాట్‌రోడ్డు తవ్వకాల శబ్దాలతో భయాందోళనకు గురవుతున్న జాతీయ పక్షులు
- ఆవాసాలను వీడి జనావాసాల బాటపడుతున్న నెమళ్లు
- ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నాయని స్థానికుల ఆవేదన
- అటవీశాఖ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ పట్టణంలోని లతీఫ్సాబ్ గుట్టపై చేపడుతున్న ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు జాతీయపక్షి నెమళ్ల మనుగడకు ముప్పుగా మారాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. భారీ యంత్రాలతో జరుగుతున్న తవ్వకాల కారణంగా రోజంతా మారుమోగుతున్న శబ్దాలతో నెమళ్లు తీవ్ర భయాందోళనకు గురై తమ సహజ ఆవాసాలను విడిచి జనావాసాల వైపు పరుగులు తీస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. గుట్టపై నుంచి కిలోమీటర్ మేర వరకు నెమళ్ల ఆర్తనాదాలు వినిపిస్తున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. లతీఫ్సాబ్ గుట్ట ఎన్నో ఏళ్లుగా నెమళ్లకు సహజ ఆవాసంగా ఉంది. ప్రతి ఉదయం, సాయంత్రం గుట్టపై నెమళ్ల సంచారం స్థానికులకు కనువిందు చేసేది. అయితే ప్రస్తుతం ఘాట్‌రోడ్డు నిర్మాణం కోసం జేసీబీ(JCB)లు, ఇతర భారీ యంత్రాలతో విస్తృతంగా తవ్వకాలు కొనసాగుతుండటంతో గుట్ట అంతా దద్దరిల్లే శబ్దాలతో మారుమోగుతోంది. ఈ పరిస్థితుల్లో నెమళ్లు భయంతో గుట్టను విడిచి సమీప కాలనీలు, గ్రామాలు, వ్యవసాయ పొలాల వైపు వెళ్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ప్రమాదాలకు గురివుతున్న నెమళ్లు..
జనావాసాల్లోకి వచ్చిన నెమళ్లు వాహనాలు ఢీకొనడం, కుక్కల దాడులు, విద్యుత్ తీగలు వంటి ప్రమాదాలకు గురై మృతి చెందుతున్న ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అటవీశాఖ అధికారులు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు చేపట్టడం లేదని విమర్శిస్తున్నారు.వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం జాతీయ పక్షి నెమళ్ల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ, గుట్టపై జరుగుతున్న పనుల ప్రభావంపై సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిర్మాణ పనులు కొనసాగినా, నెమళ్ల జీవనానికి ఇబ్బంది కలగకుండా శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం, వాటి సంచార ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టడం, అవసరమైతే పనుల సమయాల్లో మార్పులు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

గుట్టపై నెమళ్ల ఆర్తనాదాలు..
లతీఫ్సాబ్ గుట్టకు ఆనుకునే అటవీశాఖ కార్యాలయం ఉన్నప్పటికీ, నెమళ్ల సంరక్షణ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా అటవీ ప్రాంతాల్లో నివసించే వన్యప్రాణులు, పక్షులకు మాత్రమే ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టడం జరుగుతోందని, జనసంచారం ఉన్న ప్రాంతాల్లో నెమళ్లు, కుందేళ్లు సంచరించడం సహజమేనని, అలాంటి ప్రతి ఘటనలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే, గుట్టకు ఆనుకుని ఉన్న శ్రీనగర్ కాలనీతో పాటు పరిసర ప్రాంతాల ఇళ్లలోకి తరచూ నెమళ్లు వస్తుండటంతో, వాటిని సురక్షితంగా పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు అప్పగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. అక్కడి నుంచి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి వాటిని తిరిగి వదిలే చర్యలు తీసుకుంటారని వారు తెలిపారు.
వానాకాలంలో నెమళ్ల సందడి..
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో లతీఫ్సాబ్ గుట్టపై నెమళ్ల సందడి మరింత పెరిగింది. ఉదయం, సాయంత్రం వాతావరణం చల్లబడగానే గుట్టంతా నెమళ్ల అరుపులు, కేకలతో మారుమోగుతోంది. గుట్టకు ఆనుకుని నివసించే ప్రజలు నెమళ్లు పురివిప్పి నాట్యమాడే దృశ్యాలను ప్రతిరోజూ ఆస్వాదిస్తున్నామని చెబుతున్నారు. ఇలాంటి సహజ ఆవాసంలోనే ఘాట్ రోడ్డు నిర్మాణ పనుల ప్రభావంతో నెమళ్లు భయాందోళనకు గురవుతున్నాయనే స్థానికుల ఆందోళన మధ్య, అటవీశాఖ స్పందన మాత్రం విమర్శలకు తావిస్తోంది. నెమళ్ల ఆర్తనాదాలు మరింత పెరగకముందే అధికారులు స్పందించి, లతీఫ్సాబ్ గుట్టలో జాతీయ పక్షి సహజ ఆవాసాన్ని కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.