Breaking News: ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తాగునీటికే తొలి ప్రాధాన్యం

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా యంత్రాంగం తాగునీటి పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర మంత్రులు పిలుపునిచ్చారు. నల్లగొండ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, నీటిపారుదల–పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొని తాగునీరు, సాగునీరు, విద్యుత్, వ్యవసాయం, మిషన్ భగీరథ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వచ్చే ఏడాది జూన్ వరకు అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని, తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. పరిస్థితులు మరింత విషమిస్తే అత్యవసరంగా కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్రదించి కృష్ణా జలాలను తాగునీటి అవసరాల కోసం విడుదల చేయాలని కోరే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. నీటి వనరులు సంక్షోభ స్థాయికి చేరడానికి కనీసం 20–25 రోజుల ముందే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. సాగునీరు లేదా భూగర్భ జలాలపై హామీ లేని ప్రాంతాల్లో రైతులు వరి సాగుకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. నీటి లభ్యతను అంచనా వేసుకుని మాత్రమే పంటలు వేయాలని, లేకపోతే భారీ నష్టాలు తప్పవని హెచ్చరించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు గ్రామాలకే వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని అధిక నీటి అవసరమయ్యే వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. గ్రామస్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ సలహాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతు నష్టపోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదని, ముందస్తు జాగ్రత్తలతో రైతులను కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో తాగునీటి సరఫరా పరిస్థితిని అధికారులు మంత్రులకు వివరించారు. ఉదయ సముద్రం, పాలేరు, నాగార్జునసాగర్, మూసీ తదితర వనరులలో ఉన్న నీటి నిల్వలు, భవిష్యత్ అవసరాలపై చర్చించారు. గ్రిడ్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ట్యాంకర్లు, బోర్వెల్లు సిద్ధంగా ఉంచాలని, మిషన్ భగీరథ మౌలిక వసతులను నిరంతరం పనిచేసేలా చూడాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

Ministers Uttam Kumar Reddy And Komatireddy Venkat Reddy Meeting

ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జునసాగర్ నుంచి సాగునీటికి హామీ ఇవ్వలేమని అధికారులు సమావేశంలో వెల్లడించారు. చిన్న నీటి వనరుల్లోనూ నిల్వలు తగ్గుముఖం పట్టడంతో నీటి వినియోగంలో అత్యంత జాగ్రత్త అవసరమని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవడంలో అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ముందస్తు కార్యాచరణ చేపట్టి తాగునీటి సమస్యలు, రైతుల పంట నష్టాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఇద్దరు మంత్రులు అధికారులకు సూచించారు.

Share
Share