- పార్టీ పదవుల నుంచి పోలీసు పోస్టింగ్‌ల వరకు ‘రేట్ల’ రాజకీయం..!
- గాంధీభవన్లో ఎమ్మెల్యేపై కాంగ్రెస్ కేడర్ తీవ్ర ఆరోపణలు
- పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు అన్యాయం.. డబ్బులు ఇచ్చిన వాళ్లకే పదవులు
- గాంధీభవన్లో పరిశీలకుల ఎదుట రెండు గంటలపాటు ఫిర్యాదుల వెల్లువ
- ఎమ్మెల్యేతో భేటీకి పీసీసీ అధ్యక్షుడు నిరాకరణ
- శాశ్వత పరిష్కారానికి స్టీరింగ్ కమిటీనే దిక్కు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: తంగుతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు వ్యవహార శైలిపై అదే పార్టీ నాయకులు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. పార్టీ పదవుల నుంచి మున్సిపల్, పంచాయతీ ఎన్నికల టికెట్లు, నామినేటెడ్ పోస్టులు, పోలీసు పోస్టింగ్లు, కాంట్రాక్టుల వరకు అన్నింటినీ డబ్బులకు కట్టబెడుతున్నారని ఆరోపిస్తూ శనివారం గాంధీభవన్లో పీసీసీ(PCC) నియమించిన పరిశీలకుడు సీనియర్ నేత జగ్గారెడ్డి ఎదుట తమ గోడును వెల్లగక్కారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పలువురు సీనియర్ నేతలు ఏకమై ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది.
ఎమ్మెల్యే వైఖరిపైన తీవ్ర అభియోగాలు..
తంగుతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే మందుల సామేలు వైఖరిపై తొమ్మిది మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్లో ఏకంగా ఫిర్యాదుల పరంపరనే వినిపించారు. పార్టీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బస్వరాజు సారయ్య, కొండేటి మల్లయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తూ పార్టీ పదవులు కట్టబెట్టారని, కాంగ్రెస్ను గెలిపించిన సీనియర్ నాయకులు, కార్యకర్తలను పూర్తిగా పక్కన పెట్టారని నేతలు ఆరోపించారు. పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు మార్కెట్ కమిటీలు, మండల పార్టీ బాధ్యతలు, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. పార్టీ పదవుల కేటాయింపులో భారీగా డబ్బులు చేతులు మారాయని, నామినేటెడ్ పోస్టుల నుంచి స్థానిక సంస్థల టికెట్ల వరకు ప్రతిదానికి ‘రేట్లు’ నిర్ణయించారని ఫిర్యాదు చేశారు. మార్కెట్ కమిటీ పదవులకు ఇద్దరు, ముగ్గురు పేర్లను ప్రతిపాధిస్తే, వాళ్లందరిని పక్కన పెట్టేసి, పైసలు ఇచ్చిన వ్యక్తుల పేర్లనే ఎమ్మెల్యే ప్రతి పాధించి పదవులు అమ్ముకుండని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పోలీసు పోస్టింగ్ లో సైతం ఐదు నుంచి పది లక్షల రూపాయలు తీసుకుని అనుకూల స్టేషన్లలో పోస్టింగ్ లు ఇప్పించారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు, హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కొడుకు పైన ఆరోపణలు..
మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా, వారికే వ్యతిరేకంగా మరో వర్గాన్ని నిలబెట్టి కాంగ్రెస్ను బలహీనపరిచారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాల వల్లే తిరుమలగిరి మున్సిపాలిటీ కాంగ్రెస్ చేజారిపోయిందని, మోత్కూరు మున్సిపాలిటీలో కూడా ఇద్దరు కౌన్సిలర్లు మినహా మిగతా వారంతా ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కుమారుడి జోక్యంపైనా కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి కాంట్రాక్టు పనిలో ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉందని, బినామీ కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. మోత్కూరులో రూ.15 కోట్ల విలువైన కాంట్రాక్టును ఎమ్మెల్యే కుమారుడికి కట్టబెట్టే ప్రయత్నాన్ని స్థానిక నాయకులు వ్యతిరేకించడంతో టెండర్ను రద్దు చేసి, మళ్లీ కొత్త టెండర్ పిలిచారని, అయినప్పటికీ అదే పనులను బినామీల ద్వారా దక్కించుకున్నారని ఆరోపించారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో ఎవరికి పనులు వస్తే వాళ్లు చేసుకోవాలన్న సంప్రదాయాన్ని తుంగలో తొక్కేసి, వచ్చిన ప్రతి పనిలో ఎమ్మెల్యే కొడుకు తలదూరుస్తుండని ఆవేధన వ్యక్తం చేశారు.
పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా పదవులు..
పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా మండల పార్టీ అధ్యక్షులను నియమించడం జరిగిందని, పైసలు ఇచ్చినోళ్లకే పార్టీ పదవులు కట్టబెట్టిండని ఆరోపించారు. కనీసం మూడేళ్ల పాటు పార్టీలో పనిచేసిన వాళ్లనే మండల పార్టీ అధ్యక్షులుగా నియమించాలనే నిబంధనకు వ్యతిరేకంగా అసలు పార్టీలో సభ్యత్వం లేని వాళ్లను మండల పార్టీ అధ్యక్షులుగా నియమించిండని తెలిపారు. అందరి వాధనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నక స్టీరింగ్ కమిటీ వేయాలనే అభిప్రాయానికి సభ్యులు వచ్చారు. జగ్గారెడ్డి, ఎంపీ కిరణ్, బస్వరాజు సారయ్య, గుడిపాటి నర్సయ్య, ఎమ్మెల్యే సామేలు, కొండేటి మల్లయ్య తదితరులతో కమిటీ వేస్తే బాగుంటదనే అభిప్రాయానికి వచ్చారు. అయితే శనివారం జరిగిన మీటింగ్ కు ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు. తొమ్మిది మండలాల అధ్యక్షులను వెంటబెట్టుకుని పీసీసీ అధ్యక్షుడిని కలిసేందుకు ప్రయత్నిస్తే, అందుకు ఆయన నిరాకరించారు. ఏదైనా కమిటీ ముందే చెప్పాలని సూచించారు.
ఇక తుంగతుర్తిలో ‘స్టీరింగ్’ రాజకీయం
జగ్గారెడ్డి కమిటీ సూచన మేరకు పీసీసీ అధ్యక్షుడు స్టీరింగ్ కమిటీ నియామకానికి అంగీకరిస్తే చేయాల్సిన కార్యచరణ గురించి కూడా భేటీలో చర్చించారు. పార్టీ నిబంధనల మేరకు మూడేళ్ల కండీషన్ అమలు చేసినట్లయితే ఎమ్మెల్యే నియమించిన 9 మండల కమిటీల్లో నలుగురిని మార్చాల్సి ఉంటది. ఈ మండలాల్లో కాంగ్రెస్ సీనియర్లను మండల పార్టీ అధ్యక్షులుగా నియమించి, ఎమ్మెల్యే ప్రతిపాధించిన వాళ్లను వర్కింగ్ ప్రెసిడెంట్లు అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా మిగతా ఐదు మండలాల్లో కూడా సీనియర్లకు ప్రాధాన్యత కల్పిస్తారు. తర్వాతి స్థానాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించాలనే అభిప్రాయానికి వచ్చారు. ఇక మార్కె ట్ కమిటీలు, సొసైటీ నామినేటెడ్ పోస్టుల్లో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే దాని పైన స్టీరింగ్ కమిటీ పరిశీలించి డిసైడ్ చేస్తుంది. ఆదివారం ఎమ్మెల్యే తన అనచరులను వెంటబెట్టుకుని గాంధీభవన్ కు వెళ్లినట్టు తెలిసింది. తుది చర్చల అనంతరం పీసీసీ నిర్ణయం ప్రకటిస్తుంది.