Breaking News: కోట్లతో కొన్న ‘స్టెమ్ ల్యాబ్ ఆన్ వీల్స్’ కు బ్రేక్ ..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ప్రవేశపెట్టిన “స్టెమ్ ల్యాబ్ ఆన్ వీల్స్(STEM Lab on Wheels)” బస్సులు ఆశించిన స్థాయిలో వినియోగంలో ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, రోబోటిక్స్, కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలను ప్రాక్టికల్గా నేర్పేందుకు రూపొందించిన ఈ మొబైల్ ల్యాబ్లు పాఠశాలల చుట్టూ తిరగాల్సి ఉండగా, నల్లగొండలో మాత్రం ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ బస్సులు గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ ఇవ్వడం, ప్రయోగాల ద్వారా శాస్త్రీయ అవగాహన పెంచడం ప్రధాన లక్ష్యం.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్టెమ్ ల్యాబ్ ఆన్ వీల్స్’ బస్సు నల్లగొండలో ఏడాదికి పైగా వినియోగం లోకి రాకుండా పానగల్లులోని మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో  నిలిచిపోయింది. విద్యార్థుల వద్దకు వెళ్లాల్సిన మొబైల్ ల్యాబ్ మూలన పడి ఉండటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు కోటి రూపాయాల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ మొబైల్ ల్యాబ్ల ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా శిక్షణ ఇవ్వడం, కానీ నల్లగొండలో మాత్రం ఈ బస్సు లక్ష్యానికి విరుద్ధంగా కార్యాలయానికే పరిమితమైనట్లు కనిపిస్తోంది. ఏడాదిగా ఈ బస్సు ద్వారా ఎన్ని పాఠశాలలను సందర్శించారు? ఎంతమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు? ప్రస్తుతం ఎందుకు వినియోగంలో లేదు? నిర్వహణలో లోపమా? సిబ్బంది కొరతా? లేక ఇతర కారణాలా? అనే ప్రశ్నలకు అధికారులే బదులు చెప్పాల్సి ఉంది.

Share
Share