APB News Exclusive: ఎపిసోడ్ -10: కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. కతాలగూడలో తేలని అక్రమాలు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కతాలగూడ భూముల అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అక్రమాలపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే రెండుసార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆర్డీఓ(RDO), తహశీల్దార్ స్థాయి అధికారులు ఇప్పటికీ భూముల సర్వే చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి భూములు లేకపోయినా ఉన్నట్లుగా చూపిస్తూ నకిలీ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన దళారులు, వారికి సహకరించిన వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అధికారులు అడుగు ముందుకు వేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కలెక్టర్ మొదటి సారి విచారణకు ఆదేశించిన ఉత్తర్వులు

కతాలగూడలో వివిధ సర్వే నంబర్లలో భూములకు డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగాయని స్థానిక రైతులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. వీటిని సరి చేయాలని అక్రమార్కుల పైన చర్యలు తీసుకోవాలని గత మూడు నెలల నుంచి అటు కలెక్టరేట్, ఇటు తహాశీల్దార్ ఆఫీసు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ధరణిలో లొసుగులను అడ్డంపెట్టుకుని అసలు భూములు లేని రైతులు కొత్తగా పట్టా పాసుపుస్తకాలు పొందారని, దీంతో క్షేత్రస్థాయిలో దళారులు రంగం ప్రవేశం చేసి, రైతుల మీద దాడులకు పాల్పడుతున్నారని మార్చిలో కలెక్టర్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో మార్చి 30న కలెక్టర్ విచారణకు ఆదేశిస్తూ తహాశీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ విచారణ ముందుకు సాగలేదు. ఫేక్ రిజిస్ట్రేషన్ల వెనక అసలు సూత్రదారులు ఆఫీసులోనే ఉన్నారని కనిపెట్టిన అధికారులు బయటకు రాని వ్వకుండా జాగ్రత్తపడ్డారు. కానీ బాధితులు అంతటితో ఆగకుండా మళ్లీ ఈ నెల 15న కలెక్టర్ కు గ్రీవెన్స్ లో ఆర్జీపెట్టుకున్నారు. దీంతో ఈసారి కలెక్టర్ ఆర్డీఓకు విచారణ బాధ్యతలు అప్పగించారు. ఇంకోవైపు 499 సర్వే నంబర్ కు సంబంధించి ప్రత్యేకంగా తహాశీల్దార్ కు మరికొంత మంది ఫిర్యాదు చేశారు. కానీ విచారణ మాత్రం అడుగు కూడా ముందుకు కదల్లేదు. కొద్దిరోజుల క్రితం 524,525 సర్వే నంబర్లలో సర్వే చేసేందుకు వస్తున్నామని రైతులకు సమాచారం పంపారు. కానీ రాజకీయ ఒత్తిళ్లు రావడంతో మళ్లీ సర్వే చేయకుండా ఆపేశారు.

30 ఫీట్ల బాటను 20 ఫీట్లకు కుదించిన రియల్టర్లు

జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మొదటి సారి విచారణకు ఆదేశించి నాలుగు నెలలు కావొస్తోంది. రెండోసారి విచారణకు ఇచ్చిన గడువు కేవలం వారం రోజులు మాత్రమే. కానీ రెండు వారాలు అయినప్పటికీ విచారణ మాత్రం ముందుకు సాగలేదు. భూముల అక్రమాలు తేల్చలేదు. అదేమంటే సర్(SIR) బిజీలో ఉన్నామని, సాదాబైనామా, సెన్సస్ బిజీలో ఉన్నామనే సాకులతో రెవిన్యూ సిబ్బంది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్పా విచారణ ముందుకు సాగనివ్వడం లేదు. అక్రమార్కులను కాపాడేందుకే అధికారుల విచారణ తాత్సారం చేస్తున్నారని, దీన్ని అడ్డంపెట్టుకుని రియల్టర్లు అక్రమంగా వెంచర్ పనులు చేస్తున్నారని స్థానికులు చెపుతున్నారు.

గ్రీన్ సిటీ నుంచి 20 ఫీట్ల బాట మీదకు వదిలిపెట్టిన మురుగు నీరు

కతాలగూడ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు 499, 503, 504, 505, 5 06, 507, 508, 509, 510, 512, 51 3, 523, 524లో డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ మ్యూటేషన్ పూర్తికాకపోయినా, గతంలో విక్రయించిన భూములకే మళ్లీ డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి, కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు జారీ చేశారని ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదుపై విచారణ మాత్రం ఇప్పటికీ ముందుకు సాగడం లేదని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా, వివాదాస్పద భూముల్లో మాత్రం నిర్మాణ పనులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. నాలా (NALA) అనుమతులు లేకుండానే దాదాపు 24 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వైపులా ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు, జేసీబీలు, రోడ్ రోలర్లతో అంతర్గత రహదారులు వేసి, భూమిని చదును చేసినట్లు రైతులు చెబుతున్నారు. ఈ పనులను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించగా, దళారులు దాడులకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. ప్రారంభంలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నిలిపివేసినప్పటికీ, అనంతరం చర్యలు నిలిచిపోయాయని రైతులు అంటున్నారు.

నాలా పర్మిషన్ లేకుండా నిర్మించిన ప్రహారిగోడ

ఈ వెంచర్కు రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో అధికారులు వెనక్కి తగ్గారని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, రైతులు పొలాలకు వెళ్లేందుకు వదిలిపెట్టిన 30 అడుగుల పొలం బాటను కూడా ఆక్రమించి, దాని చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారని ఆరోపిస్తున్నారు. మిగిలిన 20 అడుగుల రహదారిని కూడా ఉపయోగించకుండా చేయాలనే ఉద్దేశంతో సమీపంలోని గ్రీన్సిటీ వెంచర్ నుంచి వచ్చే మురుగు నీటిని ఆ మార్గంలోకి మళ్లించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు పొలాలకు, ముత్యాలమ్మ దేవాలయానికి, అలాగే శ్మశాన వాటికకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. వెంటనే అక్రమ నిర్మాణాలను నిలిపివేసి, ఆక్రమణలను తొలగించి, వివాదాస్పద భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలని రైతులు జిల్లా అధికారులను కోరుతున్నారు.

Share
Share