APB News Exclusive: సీఎం పర్యటనపై సస్పెన్స్‌.!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై నెలకొన్న అనిశ్చితి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరవుతారని ఇద్దరు సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగా ప్రకటించినప్పటికీ, చివరి నిమిషంలో పర్యటనలు వాయిదా పడటం వెనక కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి ఈ నెల 17న నల్లగొండలో హ్యామ్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం హాజరవుతారని ప్రకటించారు. ఇందుకోసం కనగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే సభా ప్రాంగణం వర్షాల కారణంగా అనుకూలంగా లేదనే కారణంతో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు. కానీ గత కొన్ని రోజులుగా జిల్లాలో వర్షాల జాడ లేకపోవడంతో ఆఫీసర్లు చేసిన ప్రకటన పైన రాజకీయ వర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హుజూర్నగర్లో ఇందిరమ్మ ఇళ్ల కాలనీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారని ప్రకటించారు. అయితే ఆ కార్యక్రమం కూడా జరగకపోవడంతో సీఎం పర్యటనపై మరింత గందరగోళం నెలకొంది. జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులు వేర్వేరు సందర్భాల్లో సీఎం రాకపై ప్రకటించినప్పటికీ, ఆ పర్యటనలు కార్యరూపం దాల్చకపోవడం రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. దీన్నే అదునుగా భావించిన ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి పైన మాజీ మంత్రి జగదీశ్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పదవి భవిష్యత్తుపై ఆందోళనతోనే హ్యామ్ రోడ్ల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. దీంతో ఇప్పటికే ప్రచారంలో ఉన్న కేబినెట్ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నెలలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని, రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి లభించవచ్చనే ప్రచారం జరుగుతున్న క్రమంలోనే వెంకటరెడ్డి పదవిపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హ్యామ్(HAM) రోడ్ల కార్యక్రమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రచారాన్ని ప్రతిపక్షాలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని నల్లగొండ లీడర్లు ఇప్పటివరకు ఎవరూ బహిరంగంగా ఖండించకపోవడం కూడా చర్చకు దారితీసింది. ఈ పరిణామాల మధ్య బుధవారం నల్లగొండకు వచ్చిన మంత్రి వెంకటరెడ్డి మరోసారి ముఖ్యమంత్రి పర్యటనపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. త్వరలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, తెలంగాణలో ఎవరూ ఊహించని స్థాయిలో కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. దీంతో సీఎం పర్యటన ఖాయమేనా? అయితే ఎప్పుడు? నల్లగొండ, హుజూర్నగర్ కార్యక్రమాలను కలిపి ఒకేసారి నిర్వహిస్తారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మొత్తంగా జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులు ఆహ్వానించినప్పటికీ ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడటం, దానికి స్పష్టమైన కారణాలు వెల్లడికాకపోవడం, దాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలను మరింత తీవ్రతరం చేయడం వంటి పరిణామాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ప్రస్తుతం అందరి దృష్టి ముఖ్యమంత్రి తదుపరి పర్యటన ఎప్పుడు అనేదాని పైన నెలకొంది.

Share
Share