APB News Exclusive: కోమటిరెడ్డి మార్క్.. రాష్ట్రానికి నల్లగొండే రహదారి..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లా మరోసారి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పటికే హుజూర్నగర్ వేదికగా రాష్ట్రంలో తొలి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పుడు తెలంగాణలోనే తొలి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రహదారుల నిర్మాణ పనులకు నల్లగొండ జిల్లా కనగల్ మండలాన్ని వేదికగా ఎంచుకుంది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రూ.13 వేల కోట్ల రహదారుల అభివృద్ధి కార్యక్రమానికి ఈ నెల 17న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

తెలంగాణలో రహదారుల రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) ప్రాజెక్టు కనగల్ నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ విధానంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులకు సీఎం ఈ నెల 17న శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ బహిరంగ సభగా నిర్వహించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశ పెట్టిన హ్యామ్ విధానంలో ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం ప్రభుత్వాలు భరిస్తే, మిగతా 60 శాతం మొత్తాన్ని ప్రైవేట్ సంస్థలు సమకూర్చి దీర్ఘకాలిక నిర్వహణ బాధ్యతలు చేపడతాయి. ఈ విధానం ద్వారా నాణ్యమైన రహదారులు నిర్మించడంతో పాటు వాటి నిర్వహణకు కూడా హామీ లభిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ విధానంలో రూ.13,006 కోట్ల వ్యయంతో మొత్తం 34 ప్యాకేజీలుగా 6,092 కిలోమీటర్ల మేర 441 ప్రధాన రహదారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అదనంగా 7,450 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను కూడా ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటి దశలో కనగల్ ప్రాంతం నుంచి ప్రారంభమయ్యే ప్యాకేజీలో దర్వేశిపురం-గుర్రంపోడు-మల్లేపల్లి-దేవరకొండ-డిండి ప్రాంతాలను అనుసంధానించే రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే సీఆర్ ఎఫ్(CRF) కింద దర్వేశిపురం వరకు డబుల్ రోడ్డు, డివైడర్లు నిర్మించారు. హ్యామ్ రోడ్ల పనులు దర్వేశిపురం నుంచి మొదలు పెడ్తారు. ఈ పనుల కోసం సుమారు రూ.300 కోట్ల వ్యయం చేయనున్నారు. రెండో ప్యాకేజీలో చిట్యాల-రామన్నపేట-వలిగొండ-భువనగిరి-జగదేవ్పూర్ మార్గాలను అభివృద్ధి చేయనుండగా, ఆలేరు ప్రాంతంలోనూ మరో రూ.300 కోట్లతో పనులు చేపట్టనున్నారు. పంచాయతీరాజ్ రోడ్లకు మంత్రి సీతక్క ములుగు నియోజక వర్గంలో శంకుస్థాపన చేస్తారు.

హ్యామ్ రహదారుల నిర్మాణం పూర్తయితే తెలంగాణలో రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు మెరుగైన రోడ్లతో అనుసంధానం కావడం వల్ల వ్యవసాయం, వ్యాపారం, ఉపాధి రంగాలకు గణనీయమైన ఊతం లభించనుంది. రాష్ట్ర రహదారుల ముఖచిత్రాన్ని మార్చే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి కనగల్ వేదిక కావడం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరో గుర్తింపుగా నిలవనుంది. రోడ్ల ప్రమాదాలు జరగకుండా హ్యామ్ రోడ్లు రక్షణ, భద్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేస్తాయి.

గతంలో హుజూర్నగర్ వేదికగా రాష్ట్రంలో తొలి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు రోడ్ల రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హ్యామ్ ప్రాజెక్టును కూడా నల్లగొండ జిల్లా నుంచే ప్రారంభించడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ శాఖలకు సంబంధించిన తొలి ప్రధాన కార్యక్రమాలను జిల్లాకు తీసుకురావడంలో సీనియర్ మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక పాత్ర పోషించడం గర్వకారణమని పార్టీ కేడర్ భావిస్తోంది. రేషన్ కార్డు ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా సీఎం, తిరుమలగిరిలో ప్రారంభించారు. అంతేగాక ప్రజాపాలన విజయోత్సవ వేడుకలను నల్లగొండలోనే నిర్వహించారు. ఈనెల 17న నిర్వహించే బహిరంగ సభ తెలంగాణలో ఈ రెండున్నరళ్లలో కనీవినీ ఎరుగుని రీతిలో రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి వెంకటరెడ్డి చెప్పారు.

హ్యామ్ రోడ్ల స్కీంను పట్టాలెక్కించేందుకు మంత్రి వెంకటరెడ్డి ఏడాది నుంచి తీవ్రంగానే శ్రమించారు. 60 శాతం వాటాను భరించేందుకు ఆర్బీఐ(RBI)ని ఒప్పించడంలో తీవ్రంగా శ్రమించారు. ఇతర రాష్ట్రాల్లో హ్యామ్ మోడల్ రోడ్ల గురించి అధ్యయనం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల ప్రమాదాల నివారణకు హ్యామ్ రోడ్లు అత్యంత కీలకమని భావించిన మంత్రి అనేక సార్లు అధికారులతో రివ్యూలు, సీఎంతో చర్చలు జరిపారు. టెండర్ల దశకు చేరుకున్న క్రమంలో కాంట్రాక్టు ఏజెన్సీలు పెట్టిన కొర్రీలను పరిష్కరించి, అందరిని మెప్పించేందుకు తీవ్రంగానే కృషి చేశారు. టెండర్లలో లెస్, ఎక్సెస్ అనే పంచాయితీని కూడా తేలిగ్గానే పరిష్కరించారు. టెండర్లలో ఐదుశాతానికి మించి ఎక్సెస్ వేయోద్దని కండీషన్ అమలు చేయడం, బిల్లులు చెల్లింపులో ఆలస్యం చేయకుండా ముందు నుంచీ అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు.

Share
Share