Breaking News: యాదాద్రిలో రూ.99.55 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన..

యాదాద్రి, ఏపీబీ న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఆలయ విస్తరణ, భక్తుల సౌకర్యాల మెరుగుదల లక్ష్యంగా చేపట్టనున్న పలు నిర్మాణ పనులకు సీఎం శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా రూ.43.79 కోట్లతో వేద పాఠశాల నిర్మాణానికి, రూ.9.86 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణానికి, రూ.1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణానికి, రూ.1.34 కోట్లతో రథశాల వైపు మాడవీధుల్లో మెట్ల నిర్మాణానికి, రూ.43.12 కోట్లతో దీక్షాపరుల సదనం నిర్మాణానికి శంకుస్థాపనలు నిర్వహించారు.

ముందుగా కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పర్యవేక్షణలో వేద మంత్రోచ్చారణల మధ్య వేద పాఠశాలకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు అధికారికంగా శంకుస్థాపనలు చేశారు.

15 ఎకరాల విస్తీర్ణంలో 1.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు దశల్లో వేద పాఠశాల నిర్మాణం చేపట్టనున్నారు. తొలి దశలో ప్రధాన విద్యా భవన నిర్మాణం జరగనుండగా, 500 మంది వేద విద్యార్థులు విద్యనభ్యసించేలా సౌకర్యాలు కల్పించనున్నారు. విద్యార్థుల కోసం వసతి గృహాలు, డైనింగ్ హాల్ నిర్మాణంతో పాటు యజ్ఞశాల, యాగశాలలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజ రామయ్యర్, దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ధార్మిక సలహాదారులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share
Share