APB News Exclusive: బీఆర్ఎస్ లో ‘డిజిటల్‌ దండోరా’

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: బీఆర్ఎస్ ను మళ్లీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ హైకమాండ్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ సారి పాత తరహా ఇంటింటి సభ్యత్వ నమోదు విధానానికి గుడ్బై చెప్పింది. పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే సభ్యత్వాలను నమోదు చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. గతంలో సభ్యత్వ నమోదు సమయంలో చోటు చేసుకున్న గ్రూపు రాజకీయాలు, పుస్తకాల పంపిణీ వివాదాలు, తప్పుడు లెక్కల వ్యవహారాల నేపథ్యంలో హైకమాండ్ ఈసారి కొత్త ఫార్ములాను అమల్లోకి తీసుకొచ్చింది. గత సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో నియోజకవర్గాల వారీగా సభ్యత్వ పుస్తకాలను పంపిణీ చేయడం తీవ్ర వివాదాలకు దారి తీసింది. గ్రూపు రాజకీయాలు ఉన్న చోట్ల ఒక వర్గానికి ఎక్కువ పుస్తకాలు, మరో వర్గానికి తక్కువ పుస్తకాలు ఇచ్చారని ఇరువర్గాల మధ్య జరిగిన గొడవలు పార్టీకి తీరని నష్టాన్ని కలిగించాయి. కొన్నిచోట్ల సభ్యత్వాల సంఖ్య పెంచి చూపించడం, ఒకే వ్యక్తి పేరు మీదనే పదుల సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయడం వంటి అంశాలు కూడా పార్టీకి తలనొప్పిని తెచ్చాయి. దీంతో పాత విధానానికి స్వస్తి చెప్పి, పూర్తిగా డిజిటల్ విధానంలోనే మెంబర్ షిప్ డ్రైవ్ చేయాలని నిర్ణయించింది.

పార్టీ సభ్యత్వ నమోదును పకడ్బందీ చేసేందుకు ప్రత్యేక యాప్ ను రూపొందిస్తున్నారు. ఆన్లైన్ వ్యవస్థ ద్వారా నేరుగా సభ్యత్వాలు నమోదు చేస్తారు. దీనికోసం ప్రతి బూత్ కు ఇద్దరు ఇన్ చార్జిలను నియమించి సభ్యత్వ నమోదు బాధ్యతలు అప్పగిస్తున్నారు. వీరు ఇంటింటికి వెళ్లి సేకరించిన వివరాలన్నీ మొబైల్ యాప్ లో ఎంట్రీ చేస్తారు. దీనికోసం ప్రతి బూత్ ఇన్ చార్జి కచ్చితంగా ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉండాలి. దీంతో సభ్యత్వాల సంఖ్య, డేటా, యాక్టివ్ కేడర్ వివరాలు నేరుగా హైకమాండ్ పర్యవేక్షణలోకి వెళ్లనున్నాయి. సాధారణ సభ్యత్వం రూ.10లు, క్రియాశీలక సభ్యత్వం రూ. 50లు. ఎస్సీ, ఎస్టీలకు క్రియాశీలక సభ్యత్వం రూ.25లు అని నిర్ణయించారు. జూన్ మొదటి వారం నుంచి మెంబర్ షిప్ డ్రైవ్ మొదలు కానుంది. అప్పటిలోగా బూత్ ఇన్ చార్జి లకు డిజిటల్ మెంబర్ షిప్ గురించి శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ప్రస్తుతం డిజిటల్ యాప్ రూపుదిద్దుకుంటోంది. దీన్ని ఏవిధంగా ఆపరేట్ చేయాలనే దాని పైన టెక్నికల్ సిబ్బందితో రాష్ట్ర, జిల్లా స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.

ప్రతి నియోజకవర్గానికి 20 వేల మందితో సభ్యత్వం చేయించాలి. నియోజకవర్గ స్థాయిలో సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షించేందుకు హైకమాండ్ ఇన్ చార్జి లను నియమించింది. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు సీనియర్లను ఇన్ చార్జి లను పెట్టింది. వీరు బూత్ ఇన్ చార్జి లను సమన్వయం చేయాలి. అందరు కలిసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.40లక్షల సభ్యత్వం చేయించాల్సి ఉంటుంది. సభ్యత్వ నమోదును కేవలం సంఖ్యల పరంగానే కాకుండా, పార్టీ యాక్టివ్ నిర్మాణాన్ని అంచనా వేసే ప్రక్రియగా అధిస్టానం చూస్తోంది. పార్టీలో గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టడం, బూత్ స్థాయిలో పార్టీని మళ్లీ యాక్టివ్ చేయడం, కేడర్పై నేరుగా పట్టు సాధించడం లక్ష్యంగా ఈ కొత్త డిజిటల్ సభ్యత్వ వ్యవస్థను బీఆర్ఎస్ అమలు చేస్తోందనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.

నల్లగొండకు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మునుగోడు వెంకటనారాయాణ గౌడ్, నకిరేకల్ గుజ్జా దీపిక యుగంధర్ రావు, భువనగిరి క్యామ మల్లేష్, మిర్యాలగూడ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, భువనగిరి చింతల వెంకటేశ్వరరెడ్డి, నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, కోదాడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, ఆలేరు జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, హుజూర్ నగర్ కంచర్ల కృష్ణారెడ్డి, సూర్యాపేట ఇస్లావత్ రామచంద్ర నాయక్, తుంగతుర్తి యలంగందుల వెంకటేశ్వర్లు ను నియమించారు.

Share
Share