- ప్రభుత్వ భూమితో సహా, గుళ్లకు కేటాయించిన స్థలాలు ఆక్రమణ
- పాత భూములకు కొత్త రిజిస్ట్రేషన్లు.. రైతుల మధ్య చిచ్చు
- భూభారతి వచ్చినా.. ఆగని ధరణి దందా
- పాత పాసుపుస్తకాలే ఆధారం.. కతాలగూడలో కొత్త వివాదాలు
- రికార్డుల్లో మ్యూటేషన్ చేయకపోవడంతో డబుల్ రిజిస్ట్రేషన్లు
- 523, 524 సర్వే నంబర్లను అడ్డంపెట్టుకుని రియల్టర్ల మాయాజాలం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని కతాలగూడ డివిజన్లో భూముల దందా కొత్త మలుపులు తిరుగుతోంది. ధరణి వెబ్సైట్లోని లొసుగులను అడ్డంపెట్టుకుని రియల్టర్లు భారీ అక్రమాలకు తెరలేపారు. ఇప్పటికే విక్రయించిన భూములకే మళ్లీ రిజిస్ట్రేషన్ లు చేస్తూ రైతుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారు. స్లాట్బుక్ అయిన భూములకు రిజిస్ట్రేషన్ చేయడం వరకే మావంతు అని నల్లగొండ రెవిన్యూ ఆఫీసర్లు చేతులు దులుపుకుంటున్నారే గానీ వాస్తవ పరిస్థితుల జోలికి వెళ్లడం లేదు. ధరణి కారణంగా భూముల వివాదాలు పెరిగిపోతున్నాయన్న విమర్శల నడుమ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. పాత ధరణి పాసు బుక్కులనే ఆధారంగా తీసుకుని రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండటంతో కతాలగూడలో రైతుల మధ్య గొడవలు ముదురుతున్నాయి.
523, 524 సర్వే నంబర్లతోనే డబుల్ గేమ్..
కతాలగూడ లో మహాలక్ష్మీ వెంచర్ తో మొదలైన దందా, గ్రీన్ సిటీ మీదుగా ఎగబాకి తాజాగా కొత్త వెంచర్ వరకు విస్తరించింది. కతాలగూడ భూములు అంటేనే భయపడేలా ఇక్కడ రియల్ మాఫియా వేళ్లూనుకుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం మహాలక్ష్మీ వెంచర్ లో పార్టనర్లుగా ఉన్న అప్పటి రియల్టర్లు, తాజాగా కొత్త వెంచర్ రియల్టర్లతో కలిసి భూఆక్రమణలకు తెరలేపారు. కతాలగూడ గ్రామపంచాయతీగా ఉన్న కాలంలోనే సర్వే నంబర్లు 523, 524లో మహాలక్ష్మీ వెంచర్ ఏర్పాటైంది. ఈ వెంచర్ కు నాలా పర్మిషన్లు, డీటీసీపీ(DTCP) లేఅవుట్ లేదు. రియల్ ఎస్టేట్ భాష లో వీటిని ‘కచ్చా వెంచర్లు’ అని పిలుస్తారు. అయితే మహాలక్ష్మీ వెంచర్ డెవలప్మెంట్ లో భాగంగా కొందరు రైతులు రియల్టర్లకు భూములు విక్రయించారు. ఈ వెంచర్ లో ఓపెన్ ప్లాట్లు అమ్మే క్రమంలో రోడ్లు, పార్కుల కోసం కేటాయించిన మిగులు భూమి దాదాపు రెండు ఎకరాలు పట్టేదారుల పైనే ఉన్నది. రెవిన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ జరగలేదు. దీంతో సర్వే నంబర్ 523, 524 లో ఉన్న రెండు ఎకరాల భూమి అప్పటి నుంచి రెవిన్యూ రికార్డుల్లో తొలగించకపోవడం వల్ల ధరణి పాసు పుస్తకాల్లో కూడా 524/1/1లో 06 గుంటలు, 524/13 /1/1లో 6 గుంటలు, 524/4లో 34.50గుంటల భూమి ధరణి పాసు పుస్తకాల్లోకి ఎక్కింది. నిజానికి భూమి లేకపోయినప్పటికీ రికార్డులో భూమి ఉన్నందున ఇదే అధునుగా భావించిన అక్రమార్కులు 524/4 నుండి 22 గుంటలు తప్పుడు సరిహద్దులు చూపించి నల్లగొండ తహాశీల్దార్ ఆఫీసులో గతేడాది అక్టోబర్ లో (డాక్యుమెంట్ నంబరు 1969/2025) మరొకరికి డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. మళ్లీ ఇదే సర్వే నంబరు 524/4లో 12.5 0 గుంటల భూమిని వారసత్వ ఆస్తిగా పేర్కొంటూ మరోచోట సరిహద్దులు చూపించి కొత్త వెంచర్లోని పార్టనర్లకు ఇటీవలే విక్రయించారు.
ప్రభుత్వ భూమి కోసం పక్కా స్కెచ్..
ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మహాలక్ష్మీ వెంచర్ లో విక్రయించిన 524, 523 సర్వే నంబర్లలోని భూములను అడ్డంపెట్టుకుని ఉన్నపళంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాని వల్ల ఎవరికి లాభం? అని ఆరా తీయగా రియల్టర్ల నిజస్వరూపం బయట పడింది. ఇన్నాళ్లు పట్టేదారుల పైన ఉందని చెప్తున్న ఈ భూమి ఈ ఏడాది మార్చి 28న కొత్త వెంచర్లోని పార్టనర్ల పేరు మీద రిజిస్ట్రేషన్ (డాక్యుమెంట్ నంబరు 363/ 2026) చేశారు. ఇన్నేళ్లుగా ఎవరూ పట్టించుకోని సర్వే నంబరు 524 ఇప్పుడు వివాదస్పదంగా మారడానికి ప్రధాన కారణం ఇదే సర్వే నంబర్ లో దేవరకొండ ప్రధాన రహాదారిని ఆనుకుని ఉన్న ఎకరం భూమిని ఆక్రమించేందుకే అని రైతులు ఆలస్యంగా పసిగట్టారు. ఈ భూమిని ఏదోవిధంగా కబ్జా చేయాలంటే 524 సర్వే నంబర్ తో డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన భూమి ఇదేనని, ఈ సర్వే నంబర్ లో ఎక్కడా ప్రభుత్వ జాగ లేదని అధికారులను నమ్మించడం కోసమే ఇదంతా చేశారని తెలుస్తోంది. దీనికి భిన్నంగా స్థానిక రైతులు మరోవిధంగా వాధిస్తున్నారు. 524 నంబర్ లో ముత్యాలమ్మ గుడి ఉన్నదని, గుడి నిర్మించేందుకు, దారికోసం రైతులు ఉమ్మడి ఆస్తిగా ఎకరం జాగను ఖాళీగా ఉంచారని, ఈ జాగను ఏదోవిధంగా కబ్జా చేసేందుకే 524 సర్వే నంబర్ను అడ్డంపెట్టుకుని డబుల్ రిజిస్ట్రేషన్లు చేశారనే వాధన వినిపిస్తున్నారు. ఈ ఎకరం భూమిని ఆక్రమిస్తే తప్పా, కొత్త వెంచర్లోకి వెళ్లేందుకు బాటలేదు, కానీ ఈ ఎకరం ఎవరిదో తేలక ముందే రియల్టర్లు 40 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మించారు. ఈ భూమిలో ఉన్న పెద్దపెద్ద ఏన రాళ్లను తొలగించారు. వ్యవసాయ భావిని పూడ్చేశారు. నిజంగానే ఇది ప్రభుత్వ భూమి..? లేదా రైతుల ఉమ్మడి ఆస్థి..? అనేది నిర్ధారణ చేయాలంటే రెవిన్యూ సర్వే అనివార్యం. సర్వే చేస్తే డబుల్ రిజిస్ట్రేషన్ల బండారం కూడా బయట పడుతుందని రైతులు చెప్తున్నారు.

రిజిస్ట్రేషన్లు అయ్యాక ఫిర్యాదులు వచ్చాయి: పరుశురాం, తహాశీల్దారు, నల్లగొండ.
కతాలగూడ లోని సర్వే నంబరు 524, 523 గురించి భూములు రిజిస్ట్రేషన్ అయ్యాక మాకు ఫిర్యాదులు అందాయి. స్లాట్ బుక్ అయిన భూములకు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. ఎవరైనా ముందుగానే అభ్యంతరం చెబితే విచార స్తాం. కాకపోతే కతాలగూడ లో దాదాపు వివాదస్పదంగా ఉన్న భూములే. మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు సర్వే చేయడానికి సర్వేయర్ కు నోటీసు ఇచ్చాం. డబుల్ రిజిస్ట్రేషన్ అని తేలితే చర్యలు తీసుకుంటాం.