APB News Exclusive: ఎపిసోడ్ -1: కతాలగూడలో… చెరువుకట్ట బాట పైన రియల్ గద్దలు!

 నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్ పరిధిలో కతాలగూడ (11 డివిజన్)లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తమ పూర్వీకుల నుంచి రైతులు కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తోన్న చెరువుకట్ట బాట భూముల పైన దౌర్జన్యం చేస్తున్నారు. బాట భూమిని ఆక్రమించేందుకు రైతుల మధ్యనే చిచ్చురాజేసి తమ పబ్బం గడుపుకుంటున్నారు. జిల్లా మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇలాకాలోనే రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం మొద్దునిద్ర పోతోంది.

నల్లగొండ బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో కతాలగూడ లో భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయి. దీంతో ఒక్కసారిగా రియల్టర్ల కన్ను కతాలగూడ పరిధిలో ఒకప్పుడు చెరువుని ఆనుకుని ఉన్న రైతుల భూముల పైన పడింది. ఈ భూముల్లో నాలా పర్మిషన్లు, డీటీసీపీ(DTCP) అనుమతి లేకుండానే సుమారు 50 ఎకరాల్లో వెంచర్ల పనులు రేయింబవళ్లు నడుస్తున్నాయి. నిబంధనల మేరకు వెంచర్ పనులు మొదలు పెట్టేందుకు నాలా పర్మిషన్ తప్పనిసరి, కానీ ఇక్కడ అవేమీ లేకుండానే 50 ఎకరాలకు నలువైపులా రక్షణ గోడ నిర్మిస్తున్నారు. భారీ బుల్డోజర్లు, జేసీబీ(JCB) లు, రోడ్డు రోల్లర్లతో పనులు జరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి లేబర్ ను దింపి ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నా నల్లగొండ సిటీ ప్లానింగ్ అధికారులు మాత్రం మొద్దునిద్ర పోతున్నారు.

కతాలగూడలో ఆంజనేయస్వామి గుడికి పక్కనే గ్రీన్ సిటీ ఉంది. 15 ఏళ్ల క్రితం గ్రీన్ సిటీ నిర్మాణం జరిగిన ప్రాంతంలోనే కతాలగూడ చెరువు ఉండేది. అప్పుడున్న అధికారులతో కుమ్మకై చెరువును కబ్జా చేసి గ్రీన్ సిటీ నిర్మించారు. దీంతో కతాల్ గూడ చెరువు ఆనవాళ్లు కనిపించకుండా పోయాయి. అప్పుడు గ్రీన్ సిటీ నిర్మించిన రియల్టర్లే, ఇప్పుడు అధికార పార్టీ లీడర్లతో చేతులు కలిపి మళ్లీ రియల్ దందా షురూ చేశారు. ఈ చెరువు పైన 30ఫీట్ల వెడల్పుతో చెరువు కట్ట పైన బాట ఉంది. గ్రీన్ సిటీ ప్రహారి గోడను ఆనుకుని 30 ఫీట్ల వెడల్పుతో ఉన్న ఈ బాట గుండానే రైతులు వ్యవసాయ పనులు వెళ్లేందుకు వినియోగిస్తున్నారు. రైతుల కోరిక మేరకు ఇదే మార్గంలో విద్యుత్ శాఖ ట్రాన్స్ఫార్మర్ నిర్మించి, విద్యుత్ లైన్లు బిగించింది. చెరువుకట్ట కాబట్టి రైతులు అప్పట్లో వేపచెట్టు కింద కట్టమైసమ్మ గుడి నిర్మించారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో మైసమ్మ బోనాలు జరుపుకుంటారు. ఊరు బాగుండాలనే సెంటిమెంట్తో అప్పట్లో వేపచెట్టు సమీపంలో బర్రెను కూడా బలిచ్చారు. ఈ గుడికి కూతవేటు దూరంలో శ్మశాన వాటిక ఉంది. ఈ శ్మశాన వాటికను ఆనుకుని నల్లగొండ బైపాస్ రోడ్డు వెళ్తుంది. నల్లగొండ-దేవరకొండ మెయిన్ రోడ్డు నుంచి మొదలై 30 ఫీట్ల రోడ్డు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గానికి చివరి భాగంలో బైపాస్ రోడ్డు కలుస్తుంది.

30 ఫీట్ల రోడ్డును 20 ఫీట్లకు కుదించి, అక్రమంగా నిర్మిస్తున్న ప్రహారిగోడ
30 ఫీట్ల రోడ్డును 20 ఫీట్లకు కుదించి, అక్రమంగా నిర్మిస్తున్న ప్రహారిగోడ

కతాలగూడలో సర్వే నంబర్లు 503, 504, 505, 506, 507, 508, 509, 51 0, 512, 513, 517, 524 పరిధిలో వెంచర్ల పనులు జరుగుతున్నాయి. వీటిల్లో 30 ఫీట్ల వెడల్పు ఉన్న డొంకబాటలో సర్వే నంబరు 506లో 17గుంటలు, 509లో 20 గుంటలు, 510లో 8 గుంటలు, 511లో 7.50 గుంటలు రైతుల పేర్లు మీద ఉన్నాయి. 512 సర్వేలో గ్రామ శ్మశాన వాటిక ఉంది, కానీ 504, 505 సర్వే నంబర్లకు చెందిన కొందరు రైతులు  తమకు ఉన్న పట్టా భూమి కంటే ఎక్కువ చూపించి 30 ఫీట్ల రోడ్డును ఆక్రమించి, రియల్టర్లకు భేరం పెట్టారు. నిజానికి 504 సర్వే నంబర్లో ఒక ఎకరం 34 గుంటల భూమి ఉంది. దీంట్లో ఒక ఎకరం 28.50 గుంటల భూమికి మాత్రమే పట్టా ఉన్నది. మిగిలిన 5.50 గుంటలు 30 ఫీట్ల రోడ్డులో భాగం. అట్లాగే 505 సర్వే నంబర్లో ఎకరం 26 గుంటల భూమి ఉండగా, దీంట్లో రైతులకు ఎకరం 19 గుంటలు మాత్రమే పట్టా ఉన్నది. మిగిలిన 7 గుంటలు ఆక్రమించిన 30 ఫీట్ల రోడ్డులో భాగమే. ఈ రెండు సర్వే నంబర్లలోనే దాదాపు 12.50 గుంటల జాగను కాజేశారు. అంతేగాక రాత్రికిరాత్రే రిజిస్ట్రేషన్లు చేసి, రియల్టర్లకు విక్రయించారు.

శ్మశాన వాటిక బాట
శ్మశాన వాటిక బాట

రియల్టర్లు ఆక్రమించిన బాటను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వంకర టింకరగా మలుపులు తిప్పారు. కట్టమైసమ్మ గుడి, శ్మశాన వాటికను సైతం తొలిగించేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులు అడ్డుకోవడంతో కొద్దిరోజుల క్రితం రియల్టర్లతో గొడవలు జరిగాయి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. రైతుల మధ్య చిచ్చురాజేసి మొత్తం రోడ్డును ఆక్రమించేందుకు ప్రయత్నించే క్రమంలో ఇరువర్గాలు రాళ్లు కూడా రువ్వుకున్నారు. దీంతో రియల్టర్లు రోడ్డు మార్గాన్ని వంకర టింకర తిప్పారు. మైసమ్మ గుడి, ట్రాన్స్ఫార్మర్, శ్మశాన వాటిక ఏరియాలో 30 ఫీట్లు వదిలిపెట్టి మూల మలుపులు తిప్పారు. దీని పక్కనే ప్రభుత్వ భూమి కూడా ఉందని చెప్తున్నారు. రైతులు అడ్డుకోకుంటే మొత్తం భూమిని ఆక్రమించేందుకు రియల్టర్లు ప్రైవేటు సైన్యంతో దాడులు చేయిస్తున్నారని బాధిత రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.

కట్టమైసమ్మ గుడి వద్ద వంకర్ల తిరిగిన రోడ్డు

కతాలగూడలో రియల్టర్లు నిర్మిస్తున్న ప్రహారిగోడ పక్కన ఉన్నది డొంక అని రికార్డుల్లో ఉంది. క్లారిటీ కోసం తహీశీల్దార్ ఆఫీసుకు రాశాం. కొందరు రైతులు 20 ఫీట్ల రోడ్డు అని నా వద్దకు వచ్చారు. వాటిని కూడా పరిశీలిస్తున్నాం. అనుమతి లేకుండా పనులు చేయోద్దని చెప్పా.

Share
Share