- యాదాద్రి క్షేత్రంలో గోశాల ప్రారంభోత్సవం.. అనంతరం క్యాబినెట్ భేటీ
- ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాల్లో సమావేశాల నిర్వహణతో సరికొత్త సంప్రదాయం
- గతంలో మేడారంలోనూ క్యాబినెట్ నిర్వహించిన రేవంత్ సర్కార్
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశాల నిర్వహణలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఈ నెల 23న యాదగిరిగుట్టలో రాష్ట్ర మంత్రివర్గ అత్యున్నత స్థాయి సమావేశం జరగబోతున్నట్లు తెలుస్తోంది. అదే రోజున అక్కడ నిర్మిత గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండటంతో, దాన్ని పురస్కరించుకుని అక్కడే క్యాబినెట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
మేడారంలో మొదలైన పంథా.. యాదాద్రిలో కంటిన్యూ!
గతంలో ఎన్నడూ లేని విధంగా, తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, లక్షలాది మంది ప్రజల ఆరాధ్యదైవాలైన సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా మేడారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలిసారిగా క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు అదే పంథాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టను రెండో వేదికగా ఎంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
యాదాద్రి భేటీలో కీలక నిర్ణయాలు?
ఈ నెల 23న జరిగే ఈ క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులతో పాటు, ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో జరిగే ఈ సమావేశంపై గులాబీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. యాదగిరిగుట్ట కొండపైన టెంపుల్ సిటీ లో వేదపాఠశాల సుమారు 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి కూడా హాజరుకానున్నట్లు తెలిపిన ఆలయ ఈవో భవాని శంకర్.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వేద పాఠశాల భవనముతో పాటు కళ్యాణ మండపం,దీక్ష పరుల సదనము,మెట్ల మార్గానికి
పై కప్పు, పిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా మాడవీధుల్లోకి వెళ్లేందుకు నూతన మెట్ల మార్గం, తో పాటు పలుఅభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి.
విశ్లేషణ: “ప్రజల చెంతకు పాలన – ఆధ్యాత్మికత జోడింపు”
పరిపాలనను కేవలం హైదరాబాద్ లోని సచివాలయ నాలుగు గోడలకే పరిమితం చేయకుండా, ప్రజల సెంటిమెంట్లు, ఆధ్యాత్మిక కేంద్రాల వద్దకు తీసుకువెళ్లడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఒక కొత్త రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది ప్రజలకు ప్రభుత్వ నిర్ణయాలను మరింత దగ్గర చేయడమే కాకుండా, ఆయా ప్రాంతాల ప్రాముఖ్యతను చాటిచెప్పేలా దోహదపడుతుంది.