- నల్లగొండలో ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ మెరుపు దాడులు..
- 120 కిలోల కుళ్లిన మాంసం, ఆహార పదార్థాలు నిర్వీర్యం!
- టీ పొడిలో రంగులు.. హోటళ్లలో లేబులింగ్ లేని నిల్వ మాంసం
- బేకరీల్లో గడువు ముగిసిన చాక్లెట్లు, సాస్‌లు స్వాధీనం
- రెండు హోటళ్లకు నోటీసులు.. 5 నమూనాలు ల్యాబ్‌కు తరలింపు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా నల్లగొండ నగరంలో ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ (FSW) వాహనంతో అధికారులు మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్. శివ శంకర్ రెడ్డి నేతృత్వంలో టెక్నీషియన్ ఎం. వెంకటపతి, సిబ్బంది కలిసి ఆర్పీ రోడ్, డీవీకే రోడ్, సాగర్ రోడ్, డీఈఓ ఆఫీస్ పరిసరాల్లోని హోటళ్లు, మండీలు, రెస్టారెంట్లు, వీధి ఆహార కేంద్రాలపై విరుచుకుపడ్డారు. ఈ తనిఖీల్లో విస్తుగొల్పే భయంకరమైన నిజాలు వెలుగుచూశాయి.
హోటళ్లలో కుళ్లిన మాంసం.. కేఫేల్లో రంగుల టీ!
నిల్వ మాంసం: పలు హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్, మటన్ వంటి మాంసాహార పదార్థాలను కనీసం ‘యూజ్ బై డేట్’ లేబులింగ్ లేకుండా ఫ్రిజ్‌లలో కుక్కి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఫ్రిజ్ ఉష్ణోగ్రతల లాగ్ బుక్స్ మెయింటైన్ చేయకపోగా, కొన్ని చోట్ల మాంసం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది.
కల్తీ టీ పొడి: డీవీకే రోడ్డులోని ఒక ప్రముఖ కేఫేలో టీ తయారీ కోసం ప్రమాదకరమైన రంగులు వాడుతుండటాన్ని అధికారులు పట్టుకున్నారు. అక్కడి టీ పొడి, చక్కెర నమూనాలను స్వాధీనం చేసుకున్నారు.
బేకరీల నిర్వాకం: బేకరీలలో గడువు ముగిసిన (ఎక్స్పైరీ అయిన) బిస్కెట్లు, చాక్లెట్లు, సాస్‌లను తాజా ఆహార పదార్థాలతో కలిపి కస్టమర్లకు అమ్ముతున్నట్లు గుర్తించి, వాటిని అక్కడికక్కడే నాశనం చేశారు.
120 కిలోల మెటీరియల్ ధ్వంసం:
ఈ దాడుల్లో మొత్తం 120 కిలోల పాడైపోయిన చికెన్, మటన్, మంచూరియా, నూడుల్స్, ఎక్స్పైరీ బిస్కెట్లు, నిషేధిత ఫుడ్ కలర్స్, చక్కెర, టీ పొడిని సీజ్ చేసి నిర్వీర్యం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన రెండు సంస్థలకు ‘ఇంప్రూవ్మెంట్ నోటీసులు’ జారీ చేశారు. ఐదు అనుమానాస్పద నమూనాలను ల్యాబ్ విశ్లేషణకు పంపారు.
కార్బైడ్, వార్తాపత్రికలు వాడితే కఠిన చర్యలు:
ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శివ శంకర్ రెడ్డి వ్యాపారులను హెచ్చరించారు:
పండ్లను మగ్గబెట్టడానికి కార్బైడ్ వాడితే జైలు శిక్ష తప్పదని, కేవలం ఎథిలీన్ సాచెట్లే వాడాలని స్పష్టం చేశారు.
హోటళ్లు, వీధి బండ్లపై ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు పాత వార్తాపత్రికలను (News Papers) వాడటం పూర్తిగా నిషేధం అని గుర్తుచేశారు.
వంటల్లో వాడే నూనెలను పదే పదే మరిగించరాదని, ‘ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్’ (FIFO) పద్ధతిలోనే స్టాక్ వినియోగించాలని సూచించారు.
హెచ్చరిక: “తినే ముందు చూసుకోండి”
మనం బయట తినే ఆహారం ఎంతవరకు సురక్షితమో ఈ తనిఖీలు నిరూపిస్తున్నాయి. డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి హోటళ్లపై నిరంతరం నిఘా ఉండాలి. ప్రజలు కూడా ఆహార ప్యాకెట్లపై గడువు తేదీలను గమనించాలని, అనుమానం వస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఏపీబీ న్యూస్ కోరుతోంది.