- ఒకటి ఎన్డీడీబీ(NDDB)తో ఢీల్…రెండోది ప్రభుత్వంలో విలీనం
- ఏదైనా మార్చి 3న జరిగే సర్వసభ్య సమావేశంలోనే ఫైనల్
- ఎన్డీడీబీతో డీల్ కుదిరితే డెయిరీ పైన ఆధిపత్యం ఢిల్లీదే
- మదర్ డెయిరీ పాలకవర్గం, సొసైటీ చైర్మన్లు డమ్మీనే
- మంత్రి వాకిటి శ్రీహరితో ఎంపీ కిరణ్, గుత్తా అమిత్ భేటీ
- ఎన్డీడీబీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌తో ఫోన్లో సంప్రదింపులు
నల్లగొండ ప్రతినిది, ఏపీబీ న్యూస్: నల్లగొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహాకార సంఘం మనుగడ సాగించాలంటే రెండే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మార్చి 3న జరిగే సర్వసభ్య సమావేశంలో పాలకమండలి డైరక్టర్లు, సొసైటీ చైర్మన్లు సమిష్టిగా రెండు ఆప్షన్స్‌లో ఏదో ఒకదాన్ని కచ్చితంగా ఒప్పుకోవాలి, లేదంటే మొత్తం పాలకవర్గం రద్ధు చేసి, మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటది. పాలకవర్గం చేష్టల పైన తాడో పేడో తేల్చుకునేందుకు పాల సొసైటీ చైర్మన్లు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్చి 3న సర్వసభ్య సమావేశం నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్లు ఎదురుదాడికి దిగితే మొత్తం పాలకవర్గమే రద్ధు చేయాల్సి వస్తది. ఆ భయంతోనే మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. డెయిరీని ఏ దోవిధంగా గట్టెక్కించాలని కోరారు. అటానమస్ అధికారాలు కలిగిన డెయిరీ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని, మ్యాక్స్ చట్టం ప్రకారం సొసైటీ చైర్మన్లు, పాలకవర్గం సమిష్టిగా తీసుకునే నిర్ణయానికే ప్రభుత్వం కట్టుబడి ఉంటదని సీఎం స్పష్టం చేశారు. ఎన్డీడీబీ(NDDB) తో ఒప్పందానికి ప్రభుత్వం ఎన్ఓసీ (నో ఆప్ఙక్షన్ సర్టిఫికెట్) ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, ఎన్డీడీబీతో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంప్రదింపులు జరుపుతారని, ఎంపీ కిరణ్, గుత్తా అమిత్ రెడ్డి సమన్వయ కర్తలుగా వ్యవహారిస్తారని సీఎం భరోసా ఇచ్చినట్టు తెలిసింది.
ఈ రెండు ఆప్షషన్స్తోనే ముందుకు
మార్చి 3న జరిగే సర్వసభ్య సమావేశం డెయిరీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మొదటి ఆప్షన్ ఎన్డీడీబీ, యాక్సిస్(Axis) బ్యాంకు, మధర్ డెయిరీ ఒప్పందం. ఈ మూడింటి మధ్య జరిగే డీల్‌కు పాలకవర్గం, సొసైటీ చైర్మన్లు ఏకగ్రీవంగా తీర్మానం చేయాలి. ఈ డీల్ సవ్యంగా సాగాలంటే ముందున్న సవాళ్లను అధిగమించాలి. ప్రధానంగా యాక్సిస్ బ్యాంకులో డెయిరీకి రూ. 27 కోట్ల అప్పు ఉంది. ఆస్తులు తనఖా పెట్టి చేసిన అప్పుకు చాలా కాలం నుంచి కిస్తీలు కట్టకపోవడం తో బకాయిలు పెరిగిపోయాయి. దాంతో డెయిరీ ఆస్తులను ఈనెల 28న వేలం వేసేందుకు బ్యాంకు సిద్ధమైంది. ఇక రైతుల పాల బిల్లులు రూ.30 కోట్లు, ఉద్యోగుల జీతాలు రూ.4కోట్లు చెల్లించాల్సి ఉంది. ఫర్మ్‌లకు రూ.4 కోట్లు, రైతుల వాటాధన రూ.12 కోట్లు చెల్లించాలి.
బ్యాంకు రుణం, పాలబిల్లులు పెద్ద టాస్క్
ప్రధానంగా యాక్సిస్ బ్యాంకు రుణం పెద్ద టాస్క్. ఢిల్లీ స్థాయిలో పేరొందిన ఎన్డీడీబీ ఎంటర్ అయితే బ్యాంకు నమ్ముతుందని పాలక వర్గం ఆశిస్తోంది. కానీ ఎన్డీడీబీ మాత్రం బ్యాంకు నుంచి మరికొంత రుణం సాయం కోరుతుంది. ఇప్పుడున్న రూ.28 కోట్లు గాక, కొత్తగా అప్పు ఇస్తే ఆ డబ్బులతో రైతుల పాల బిల్లులు చెల్లించవచ్చని ఎన్డీడీబీ ఆలోచిస్తోంది. కొత్త రుణం ఇచ్చేందుకు యాక్సిస్ బ్యాంకు అంగీకరిస్తే ఎన్డీడీబీ, యాక్సిస్, మదర్ డెయిరీ ఈ మూడు ఒక ఒప్పందానికి రావాల్సి ఉంటది.
ఈ కండీషన్స్‌కు రైతులు తలొగ్గాల్సిందే
ఎన్డీడీబీ పెట్టే కండీషన్స్‌కు సొసైటీ చైర్మన్లు కచ్చితంగా తలొగ్గాల్సిందే. భారీ పెట్టుబడితో ముందుకు వస్తున్న సంస్థ కాబట్టి డెయిరీ పైన ఆధిపత్యం ఎన్డీడీబీదే. పాలకవర్గం, సొసైటీ చైర్మన్లు, అధికారులు డమ్మీగా మారిపోతారు. సర్వాధికారులు ఎన్డీడీబీకే కట్టబెట్టాల్సి ఉంటది. ఒకరకంగా చెప్పాలంటే మొత్తం మేనేజ్మెంట్ ఢిల్లీ చేతుల్లోకి వెళ్తుంది. ఒకప్పుడు ఇదే ఎన్డీడీబీ నిర్వాహకం వల్ల డెయిరీ ఇప్పుడు రూ.28 కోట్ల అప్పు భారం మోస్తోంది.
రెండో ఆప్షన్ ప్రభుత్వంలో విలీనం
రెండో ఆప్షన్ డెయిరీ మొత్తాన్ని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఈ ఆప్షన్‌కు సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించాలి. విలీన ప్రతిపాధనకు సభ్యులు ఆమోదిస్తే అప్పుడు ప్రభుత్వం అందుకు అంగీకారం తెలిపే అవకాశం ఉంటది. నార్మాక్స్ చట్టంలోని అంశాలన్నింటిని పరిశీలించాల్సి ఉంటది. ఇంకోవైపు సొసైటీ చైర్మన్లకు, ఉద్యోగులకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించాలి. ప్రభుత్వం టేకోవర్ చేసిన పక్షంలో డెయిరీ ఎవరి చేతుల్లోకి పోతదనేది ప్రశ్నార్ధకం. రైతుల కోరిక మేరకే ప్రభుత్వ నిర్ణయం ఉంటదని, ఒత్తిళ్లకు తలొగ్గి డెయిరీని ఇబ్బందులు పెట్టొద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
వాకిటి శ్రీహరితో చర్చలు సఫలం
సీఎం సూచన మేరకు బుధవారం ఎంపీ చామల కిరణ్, తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూధన్ రెడ్డిలు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో భేటీ అయ్యారు. మంత్రి శ్రీహరి, ఎంపీ కిరణ్ ఎన్డీడీబీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. ఎన్డీడీబీ నుంచి వచ్చే ప్రతిపాధనలను పరిశీలించిన పిదప మార్చి 3న జరిగే సర్వసభ్య సమావేశంలో వాటిని సభ్యులకు వివరిస్తారు. అదేవిధంగా సభ్యుల నుంచి వచ్చే ప్రతిపాధనలు, కండీషన్స్లు స్వీకరిస్తారు. అన్నివైపుల నుంచి చర్చలు సఫలమైతే అప్పుడు ఎన్డీడీబీ తో అగ్రిమెంట్ జరుగుతుంది. గుత్తా అమిత్ రెడ్డికి ఎన్డీడీబీ మేనే జ్మెంట్తో సత్సంబంధాలు కలిగిన నేపథ్యంలో త్వరలో ఎంపీ చామల కిరణ్‌తో కలిసి అవసరమైతే ఢిల్లీ వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు.