BIG Breaking News: ఉన్నోళ్లకే మున్సిపల్​ చైర్మన్​ … కౌన్సిలర్లను, కార్పోరేటర్లను క్యాంపులకు తరలించిన ఎమ్మెల్యేలు, మంత్రులు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మున్సిపల్, కార్పోరేషన్ మేయర్, చైర్మన్ పదవులు ఆశించి అభ్యర్థులకు పెట్టుబడి పెట్టినోళ్లకే పుర పీఠాలు సొంతం కానున్నాయి. ఈ మేరకు ఎన్నికలకు ముందే ఎమ్మెల్యేలు, మంత్రులతో లోపాయికారిక ఒప్పందాలు జరిగిపోయాయి. కాకపోతే అనుకున్న డబ్బుంతా ఎమ్మెల్యేల చేతుల మీదుగానే అభ్యర్థులకు పంపిణీ చేశారు. చైర్మన్ ఎవరనేది ముందుగానే లీక్ చేసి, వాళ్లతోనే డబ్బులు పంపిణీ చేయిస్తే లేనిపోని సమస్యలు వస్తాయని గుట్టుచప్పుడు కాకుండా ముగించారు. నల్లగొండ, సూర్యాపేట, చిట్యాల, చండూరు మున్సిపల్ చైర్మన్, మేయర్లను ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నికలకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. తిరుమలగిరి, చౌటుప్పుల్లో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ప్రకటించిన చైర్మన్ అభ్యర్థులు ఓడిపోయారు. తిరుమలగిరిలో అసలు ప్యానల్ లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి పెట్టిన అభ్యర్థుల పరిస్థితి ఏంటన్నది ఆగమ్యగోచరంగా మారింది.

నల్లగొండ కార్పోరేషన్లో అభ్యర్థికి రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. చండూరులో రూ.20 లక్షలు, చౌటుప్పుల్లో మొత్తం ఎన్నికల ఖర్చు రూ.7 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. భువనగిరిలో రూ.10 లక్షలు, హాలియాలో రూ.24 లక్షలు, కోదాడ, హుజూర్నగర్లో రూ.10 లక్షలు, సూర్యాపేటలో రూ.15 లక్షలు, చిట్యాల లో రూ.10 లక్షల చొప్పున దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థులే పెట్టుబడి పెట్టారు. ఒప్పందం మేరకు ఈ డబ్బు అంతా ఎమ్మెల్యేలకు ముందుగానే ముట్టచెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థుల శక్తి సామర్ధ్యాలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. 

leonia

కాంగ్రెస్ కౌన్సిలర్లు, కార్పోరేటర్లను ఎమ్మెల్యేలు, మంత్రులు క్యాంపులకు తరలించారు. ఫలితాలు ప్రకటించగానే గెలిచిన అభ్యర్థులను హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని రిసార్ట్లకు తరలించారు. కోదాడ, హుజూర్నగర్ కౌన్సిలర్లను ఉడ్ ల్యాండ్ రిసార్ట్కు, నల్లగొండ కార్పోరేటర్లను లీయోనియా రిసార్ట్, భువనగిరి కౌన్సిలర్లను మెయినాబాద్ సమీపంలోని రిసార్ట్కు, దేవరకొండ కౌన్సిలర్లను చీరాల, బాపట్ల, విజయవాడ ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఆలేరు, యాదగిరిగుట్ట కౌన్సిలర్లను ఫలితాలకు ముందే టూర్కు తీసుకెళ్లారు. మిర్యాలగూడ, నందికొండ, హాలియా కౌన్సిలర్లు మాత్రమే స్థానికంగా ఉన్నారు.

క్యాంపుల్లో ఉన్న అభ్యర్థుల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు అభిప్రాయ సేకరణ చేశారు. చైర్మన్ ఎవరైతే బాగుటందని వన్టువన్ పిలిచి అభిప్రాయం తీసుకున్నారు. కోదాడ, హుజూర్నగర్లో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి నిర్ణయానికే కట్టుబడి ఉంటామని మెజార్టీ సభ్యులు చెప్పినట్టు తెలిసింది. ఆదివారం మధ్యాహ్నాం చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరనేది క్యాంపుల్లోనే అధికారికంగా ప్రకటిస్తారు. అందరికీ పార్టీ విప్లు జారీచేశారు. ఎవరైనా విప్ దిక్కరించే ప్రవర్తిస్తే తక్షణమే వాళ్ల సభ్యత్వం రద్ధు అవుతుంది. క్యాంపుల నుంచి సోమవారం నేరుగా మున్సిపాలిటీలకు చేరుకుని ఓటింగ్లో పాల్గొంటారు.

చైర్మన్, వైస్ చైర్మన్లు ఎవరనేది ఎమ్మెల్యేలు, మంత్రులు ఎప్పుడో డిసైడ్ చేశారు. ఎన్నికలప్పుడు కొందరి పేర్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య, సూర్యాపేట చైర్మన్ మొరిశెట్టి నివేధిత, చండూరు చైర్మన్ కోడి శ్రీను, దేవరకొండ చైర్మన్ పున్నా శైలజ, చిట్యాల చైర్మన్ పందిరి గీత, యాదగిరిగుట్ట చైర్మన్ వాణి భరత్ గౌడ్, ఆలేరు చైర్మన్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సమీప బందువు బీజన బాలమణి భాస్కర్ యాదవ్, భువనగిరి చైర్మన్ ప్రముఖ బిల్డర్ గంజి గణేష్ రెడ్డి భార్య గంజి శ్రీవాణి, నేరేడుచర్ల చైర్మన్ కొణతం చినవెంకటరెడ్డి, హాలియా చైర్మన్ చింతల రామచంద్రారెడ్డిలను దాదాపు ఖరారు చేశారు. కోదాడ చైర్మన్గా పార్టీ సీనియర్ నేత లక్ష్మీనారాయాణ రెడ్డి సమీప బందువు దేవరం మల్లీశ్వరి, పారా సీతయ్య భార్య సత్యవతి, ఎర్నేని కుసుమ కుమారి మధ్య పోటీ నెలకొంది.

చైర్మన్ విషయంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వినూత్నంగా ఆలోచించారు. చైర్మన్ పదవి ఆశిస్తున్న ఐదుగురు అభ్యర్థులకు వాళ్లు పోటీ చేస్తున్న వార్డులతో పాటు, పక్కనే ఉన్న మరొక వార్డుకు మాత్రమే ఎన్నికల ఖర్చు పెట్టమని చెప్పారు. దాంతో వేణుగోపాల్ రెడ్డి, గుడిపాటి నవీన్, మిట్టపల్లి వెంకటేశం, బాలు, జలేందర్ రెడ్డిలకు రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టారు. మిగతా ఖర్చంతా ఎమ్మెల్యేనే పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. చైర్మన్ ఎవరనేది డిసైడ్ చేశాక వాళ్ల నుంచి పెట్టుబడి రికవరీ చేస్తారని తెలిసింది.

చౌటుప్పుల్ లో చైర్మన్ అభ్యర్థి వెన్రెడ్డి సంధ్య ఓడిపోయారు. జిల్లా సీపీఎం పార్టీ అంతా ఏకమై మాజీ చైర్మన్ వెన్రెడ్డి రాజును టార్గెట్ చేశారు. పేద కుటుంబానికి చెందిన జయమ్మను గెలిపిచేందుకు ప్రతిరోజు రెండు, మూడొందల మందితో వార్డులో ప్రచారం హోరెత్తించారు. దాంతో సంధ్య 300 ఓట్లతేడాతో ఓడిపోయారు. గతంలో రూ.50 కోట్లతో వెన్రెడ్డి రాజు వార్డు అభివృద్ధి చేశారు. చైర్మన్ పదవి ఖాయమనే హామీ మేరకు సుమారు రూ.7కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు తెలిసింది. సంధ్య పోటీ చేసిన వార్డులోనే రెండు కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసింది. చౌటప్పుల్ కౌన్సిలర్లను హైదరాబాద్ శివారు ప్రాంతంలోని రిసార్ట్కు తరలించారు. ఈ క్యాంపులో రాజు పెట్టుబడి గురించి చర్చకు అవకాశం ఉంది. సంధ్య ఓడిపోవడంతో రమేష్గౌడ్ భార్య పేరు తెరపైకొచ్చింది. తిరుమలగిరిలో కూడా అశోక్ రెడ్డి భార్య పేరును ముందుగానే ప్రకటించడంతో ఆమె కూడా ఓడిపోయింది.

Share
Share