హైదరాబాద్(APB News): సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సంఘటన్ సృజన్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ అబ్సర్వర్ సీపీ జోషికి తన నామిమేషన్ పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందని తెలిపారు. ప్రజల నుండి వచ్చిన నాయకత్వాన్ని ప్రజల ద్వారానే ఎంపిక చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని, ఈ స్ఫూర్తితో ఏఐసీసీ పరిశీలకులు తెలంగాణలోని ప్రతి జిల్లాలో నాయకులతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు సేకరిస్తున్నారని చెప్పారు.
మరోవైపు పార్టీ సంఘటన్ శ్రీజన్ అభియాన్ లో భాగంగా సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం ఏఐసీసీ అబ్జర్వర్ గా సీపీ జోషి, పీసీసీ అబ్జర్వర్లుగా నారాయణ పేట్ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి, శ్రీను బాబు, పవన్ మల్లాదిని అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా బుధవారం సనత్ నగర్ నియోజకవర్గంలోని B -బ్లాక్ పరిధిలోని అమీర్ పేట్, సనత్ నగర్ డివిజన్లలో కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఏఐసీసీ అబ్జర్వర్ సీపీ జోషి మాట్లాడారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కార్యకర్తల అభిప్రాయాలకే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కార్యకర్తల నుంచే నాయకుడిని ఎన్నుకోవాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టిందన్నారు. దేశంలోని 600 పైచిలుకు జిల్లాల్లో కాంగ్రెస్ ఇదే విధానాన్ని అవలంభిస్తున్నట్లు చెప్పారు. వారి అభీష్టం మేరకు డీసీసీ అధ్యక్షుల పేర్లను సేకరించి కేంద్ర నాయకత్వానికి నివేదికను పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.