Breaking News: అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

న్యూఢిల్లీ, ఏపీబీ న్యూస్: పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కుల పరిరక్షణ దిశగా దేశ అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court of India) అత్యంత కీలకమైన, సంచలన తీర్పును వెలువరించింది. పోలీసు వ్యవస్థ చేసే అక్రమ అరెస్టులకు చెక్ పెడుతూ.. రాతపూర్వక కారణాలు (Written Grounds of Arrest) తెలపకుండా ఏ ఒక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదని, అలా చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.

పంజాబ్ రాష్ట్రం ముల్లాన్పూర్ దాఖా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ జస్కరణిత్ సింగ్కు సంబంధించిన ఒక అక్రమ అరెస్టు కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మసనం ఈ విప్లవాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది.

ఎవరినైనా అరెస్ట్ చేసే సమయంలో అతనికి స్పష్టంగా అర్థమయ్యే భాషలో, అరెస్టు చేయడానికి గల బలమైన కారణాలను లిఖితపూర్వకంగా (రాతపూర్వకంగా) ఇవ్వడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 (Article 22) ప్రకారం తమ అరెస్టుకు గల కారణాలను తెలుసుకోవడం అనేది ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు అని న్యాయస్థానం వెల్లడించింది.

ఒకవేళ ఈ నిబంధనను పాటించకుండా అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత, పోలీసులు ఎంత పక్కాగా ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ.. ఆ మొదటి అరెస్టును ‘అక్రమ అరెస్టు’గానే పరిగణించాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

రాతపూర్వక కారణాలు తప్పనిసరి: అరెస్ట్ అయ్యే వ్యక్తికి ఆయనకు అర్థమయ్యే భాషలో లిఖితపూర్వక నోటీసు/కారణాలు అందించాలి.

ఛార్జ్షీట్ వేసినా చెల్లదు: నిబంధనలు పాటించకుండా చేసిన అరెస్ట్ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసినా, ఆ అరెస్ట్ చట్టవిరుద్ధమే అవుతుంది.

మళ్లీ అరెస్ట్ చేయాలంటే మేజిస్ట్రేట్ అనుమతి: అక్రమ అరెస్ట్ నుంచి విడుదలైన వ్యక్తిని తిరిగి అరెస్ట్ చేయాలంటే పోలీసులు సొంతంగా నిర్ణయం తీసుకోకూడదు. మేజిస్ట్రేట్ ఎదుట రాతపూర్వకంగా సరైన కారణాలను నివేదించాల్సిందే.

తప్పు చేసిన అధికారికి మరో అవకాశం లేదు: మొదటి అరెస్ట్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించిన పోలీస్ అధికారికి ఆ కేసులో మళ్లీ దర్యాప్తు (Investigation) చేసే అవకాశం ఇవ్వకూడదు.

సర్వీస్ రికార్డులో నమోదు: ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే పోలీసు అధికారులపై కఠిన శాఖాపరమైన (Departmental) చర్యలు తీసుకోవడమే కాకుండా, వారి సర్వీస్ రికార్డుల్లో కూడా ఆ విషయాన్ని నమోదు చేయాలని ఆదేశం.

ఈ చారిత్రాత్మక తీర్పుతో విచారణ పేరిట ఇష్టారాజ్యంగా ముందస్తు నోటీసులు లేకుండా పౌరులను అదుపులోకి తీసుకునే పోలీసు అధికారులకు సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక జారీ చేసినట్లయింది. నిబంధనలు పాటించని అధికారుల సర్వీస్ రికార్డులపై ప్రభావం పడేలా ఆదేశాలు ఇవ్వడం వల్ల ఇకపై అక్రమ అరెస్టులకు అడ్డుకట్ట పడుతుందని న్యాయ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share
Share