Breaking News: పోలీస్ స్టేషన్ ముందే ఘోరం – పోలీస్ వాహనం ఢీకొని ఏఎస్ఐ మృతి..

సంగారెడ్డి, ఏపీబీ న్యూస్: సంగారెడ్డి జిల్లా మనూరు పోలీస్ స్టేషన్ వద్ద విషాదం చోటుచేసుకుంది. సాక్షాత్తూ రక్షణ కల్పించాల్సిన పోలీస్ వాహనమే ఒక అధికారి ప్రాణాలను తీయడం జిల్లాలో కలకలం రేపింది. మనూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ (ASI)గా విధులు నిర్వహిస్తున్న గోవింద్ నాయక్, పోలీస్ వాహనం ఢీకొనడంతో చికిత్స పొందుతూ మరణించారు.

వివరాల్లోకి వెళ్తే.. మనూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఏఎస్ఐ గోవింద్ నాయక్ నిలబడి ఉన్న సమయంలో, అదే స్టేషన్కు చెందిన పోలీస్ వాహనం అతివేగంగా వచ్చి ఆయనను బలంగా ఢీకొట్టింది. వాహనం ఆయనపైకి దూసుకెళ్లడంతో గోవింద్ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. సహచర సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఇది కేవలం ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్యేనని ఏఎస్ఐ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

  • కక్షపూరిత దాడి: డ్రైవర్ రామారావు కావాలనే కక్షపూరితంగా వాహనాన్ని ఏఎస్ఐ పైకి ఎక్కించి హతమార్చాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  • డ్రైవర్ పరారీ: ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ రామారావు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఇది కూడా కుటుంబ సభ్యుల అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. డ్రైవర్ రామారావు కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇది యాక్సిడెంటా? లేక పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యనా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. డ్రైవర్ పట్టుబడితే తప్ప అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు.

పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఇలాంటి ఘటన జరగడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఒక అధికారిపై డ్రైవర్ కక్ష పెంచుకుని ఇలాంటి చర్యకు పాల్పడి ఉంటే, అది వ్యవస్థలో క్రమశిక్షణారాహిత్యాన్ని సూచిస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉంది.

Share
Share