Breaking News: లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికిన ఎంపీడీవో.. టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్న స్థానికులు..

మహబూబాబాద్, ఏపీబీ న్యూస్: లంచగొండుల కక్కుర్తికి నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయం వేదికైంది. హైదరాబాద్కు చెందిన కొందరు వ్యాపారస్తుల వెంచర్ అనుమతుల వ్యవహారంలో కోర్టు నోటీసులను మేనేజ్ చేస్తామని నమ్మించి, రూ.45,000 లంచం తీసుకుంటుండగా ఎంపీడీవో పెనుగొండ రాధిక, ఎంపీఓ కిన్నెర యాకయ్య మరియు ఎంపీడీవో కుమారుడు పెనుగొండ నాగార్జునలను ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అవినీతి అధికారుల అరెస్ట్తో మండల కేంద్రంలో స్థానికులు, రైతులు కార్యాలయం బయట టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచుకుంటూ భారీ సంబురాలు చేసుకోవడం గమనార్హం.

ఏసీబీ వరంగల్ అధికారులు వెల్లడించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన కొందరు వ్యక్తులు నర్సింహులపేట మండలంలోని పడమటి గూడెం గ్రామ పరిధిలో 4 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, లేఅవుట్ వెంచర్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అధికారికంగా అనుమతులు మంజూరయ్యాయి.

కోర్టు వివాదం – లంచానికి స్కెచ్: అయితే, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఆ భూమిపై హక్కు తనదేనంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో మండల అధికారులకు కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసుల వ్యవహారాన్ని తామే చూసుకుంటామని, వివాదం లేకుండా క్లియర్ చేస్తామని ఎంపీడీవో రాధిక, ఎంపీఓ యాకయ్యలు బాధితులను లంచం డిమాండ్ చేశారు.

కక్కుర్తికి పరాకాష్ట: అధికారుల ఒత్తిడి తట్టుకోలేక బాధితులు గత నెలలోనే ఎంపీడీవో రాధికకు రూ.30 వేలు, ఎంపీఓ యాకయ్యకు రూ.25 వేలు (మొత్తం ₹55,000) ముట్టజెప్పారు. అయినా పని పూర్తి చేయకుండా, అదనంగా మరో రూ.45,000 ఇస్తేనే ఫైల్ ముందుకు కదులుతుందని భీష్మించుకు కూర్చున్నారు.

అధికారుల నిరంతర వేధింపులతో విసిగిపోయిన బాధితులు.. చివరకు వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి రాతపూర్వక ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ బృందం పక్కా ప్లాన్తో శుక్రవారం మధ్యాహ్నం నర్సింహులపేట ఎంపీడీవో ఆఫీసులో నిఘా పెట్టింది.

బాధితుడి నుండి కెమికల్ పూసిన రూ.45,000 నగదును తీసుకుంటుండగా ఎంపీడీవో పెనుగొండ రాధిక, ఎంపీఓ యాకయ్యలను అధికారులు చుట్టుముట్టారు. ఈ అవినీతి భాగోతంలో ఎంపీడీవో కుమారుడు పెనుగొండ నాగార్జున కూడా మధ్యవర్తిత్వం వహించి లంచం డబ్బుల వసూళ్లలో కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలు లభించడంతో అతనిని కూడా ఏసీబీ అధికారులు లీగల్గా అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురి చేతులకు కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.

నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో సామాన్యుల పనుల కోసం ఈ అధికారులు నిత్యం నరకం చూపిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. రాధిక, యాకయ్యలు ఏసీబీకి దొరికిపోయారనే వార్త తెలియగానే కార్యాలయం ప్రాంగణానికి భారీగా చేరుకున్న స్థానికులు, బాధితులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి అభినందనలు తెల్పారు. నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, తదుపరి విచారణ నిమిత్తం వారిని హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించనున్నారు.

Share
Share