Breaking News:దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల భారీ ధర్నా.. సాయిబాబా గుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత..

దిల్సుఖ్నగర్/హైదరాబాద్, ఏపీబీ న్యూస్: హైదరాబాద్ నగరంలోని నిరుద్యోగుల అడ్డాగా పేరొందిన దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి పరిసర ప్రాంతాలు శుక్రవారం లంచ్ అవర్ సమయంలో రణరంగంగా మారాయి. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్యను పెంచాలని, వయోపరిమితి (Age Relaxation) పై తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు అకస్మాత్తుగా ప్రధాన రహదారిపై బైఠాయించి భారీ ధర్నాకు దిగారు.

నిరుద్యోగుల ఆందోళనతో దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని అభ్యర్థులను చెల్లాచెదురు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరుద్యోగ అభ్యర్థులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యర్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలువురు అభ్యర్థులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించి అరెస్ట్ చేయడంతో అక్కడ వాతావరణం మరింత హీటెక్కింది.

5 వేల నుండి 20 వేలకు పెంచాలి: గత కేసీఆర్ (BRS) ప్రభుత్వ హయాంలో దాదాపు 45 వేల వరకు పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5 వేల పోస్టులకే పరిమితం చేయడం నిరుద్యోగులను నట్టేట ముంచడమేనని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఈ పోస్టుల సంఖ్యను కనీసం 20 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

వయోపరిమితి సడలింపు (Age Limit): గత ప్రభుత్వంలో నిరుద్యోగుల వయస్సును పరిగణనలోకి తీసుకుని ఇచ్చిన వయోపరిమితి సడలింపులను ఈ ప్రభుత్వంలో ఎందుకు తగ్గించారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. నోటిఫికేషన్లు ఆలస్యం కావడం వల్ల ఎంతోమంది వయస్సు పైబడి అర్హత కోల్పోతున్నారని, కాబట్టి ఏజ్ లిమిట్పై తక్షణమే సడలింపు జీవో (GO) ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

తమ సమస్యలపై శాంతియుతంగా వినతులు ఇచ్చినా ప్రభుత్వం నుండి ఎలాంటి చలనం లేకపోవడం వల్లే తాము ప్రాణాలను పణంగా పెట్టి రోడ్డెక్కాల్సి వచ్చిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పొట్ట కొట్టేలా ఉన్న ఈ విధివిధానాలను మార్చకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి చౌరస్తా వద్ద భారీగా పోలీస్ బందోబస్తును మోహరించారు.

Share
Share