APB News Exclusive: ఉమ్మడి జిల్లాలో అగ్రవర్ణాలే ఆసాములు..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: 38 లక్షల జనాభా కలిగిన ఉమ్మడి జిల్లాలో భూమి మాత్రం 40 శాతం కుటుంబాలకే ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భూమి తగ్గుతోంది. దాంతో ఒకప్పుడు పెద్దపెద్ద కమతాలు కలిగిన జిల్లాలో చిన్న కమతాలుగా విడిపోతున్నాయి. సగటు సాగుభూమి కూడా 0.30 ఎకరాలు మాత్రమే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన సామాజిక ఆర్ధిక కులగణన సర్వే గణాంకాలు ఉమ్మడి జిల్లాలో భూమి అసమానతలు బహిర్గతం చేస్తున్నాయి. ఇక జిల్లాలో రాజకీయంగా, ఆర్ధికంగా బలమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న అగ్రవర్ణాలకు ఆస్తిపాస్తులు ఎక్కువ ఉన్నాయి. పెద్దపెద్ద కమతాలు అన్ని ఓసీల చేతుల్లోనే ఉన్నాయి. జనాభా పరంగా ఓసీలు తక్కువగానే ఉన్నప్పటికీ భూములు మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పోలిస్తే వాళ్లకే అధికం.

ఉమ్మడి జిల్లాల్లోని 38 లక్షల జనాభాలో ఓసీలు 9 నుంచి 10 లక్షల మంది ఉన్నారు. అంటే జనాభాలో 20-25 శాతం మంది వాళ్లే. భూములు కలిగి ఉన్న కుటుంబాలు 33.7 శాతం ఉన్నాయి. సగటున ఒక్క కుటుంబం 0.42 ఎకరాలు కలిగి ఉంది. అంటే కుటుంబానికి ఒక్క ఎకరం భూమి కచ్చితంగా ఉంది. అట్లాగే బీసీలు 17 నుంచి 18 లక్షల మంది ఉన్నారు. జనాభాలో బీసీల వాటా 45-50 శాతం, కానీ భూములు ఉన్న కుటుంబాలు 36.3 శాతం మాత్రమే. సగటు సాగుభూమి 0.30 ఎకరాలు మాత్రమే ఉంది. అంటే ఒక్క కుటుంబానికి సగటున ఎకరంలో మూడో వంతు భూమి మాత్రమే ఉంది. ఎస్సీల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. ఎస్టీల తో పోలిస్తే ఎస్సీలు సాగుభూమిలో అతితక్కువ వాటాను కలిగి ఉన్నారు. చాలా చిన్న కమతాలు మాత్రమే ఉన్నాయి. ఒక్క కుటుంబం సగటున 970 చదరపు గజాల సాగు భూమి మాత్రమే ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఎస్సీల జనాభా 7 నుంచి 8 లక్షలు కాగా, మొత్తం జనాభాలో వీళ్ల వాటా 18 నుంచి 20 శాతం, కానీ భూమి ఉన్న కుటుంబాలు కేవలం 35.2శాతం మాత్రమే, సగటున ఒక్క కుటుంబం సాగుభూమి 0.20 ఎకరాలు మాత్రమే ఉంది. ఎస్టీల జనాభా 3 నుంచి 4 లక్షలు ఉండగా, జనాభాలో 8 నుంచి 10 శాతం వాటా ఉంది. దీంట్లో భూములు కలిగిన కుటుంబాలు 58.1 శాతం ఉన్నాయి. ఒక్క కుటుంబానికి సగటున సాగుభూమి 0.25 ఎకరాలు ఉంది. అంటే పావు ఎకరం భూమి చిన్నకారు రైతులతో సమానం.

ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వర్గాల్లో ఎస్సీలే అధికం. ఎకరం, 2.5 ఎకరాలు, 4.9 ఎకరాలు ఇలా 5 ఎకరాలు కంటే తక్కువ ఉన్న వర్గాల్లో ఎస్సీ కుటుంబాలు 90.5 శాతం ఉన్నాయి. బీసీలు 85 శాతం ఉండగా, ఎస్టీలు 80.1 శాతం కుటుంబాలు ఉన్నాయి. ఓసీల సంఖ్య చాలా తక్కువ. 69.1 శాతం కుటుంబాలే ఈ జాబితాలో ఉన్నాయి.

ఉమ్మడి జిల్లాలో పెద్ద పెద్ద కమతాలన్నీ ఓసీల చేతుల్లోనే ఉన్నాయి. అంటే 20 ఎకరాలు, ఆపైక ఎక్కువ భూములు వాళ్ల ఆధీనంలోనే ఉన్నాయి. జిల్లాలో అగ్రవర్ణాల జాబితాలో రెడ్డి, బ్రహ్మణ, వెలమ, కమ్మ సామాజిక వర్గాల ప్రాబల్యం అధికం. ఓసీల్లో 4.4 శాతం కుటుంబాలు 20 ఎకరాల కమతాలు ఉండగా, అత్యధిక జనాభా కలిగిన బీసీలు 2.9 శాతం కుటుంబాలకే 20 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంది. ఎస్సీలు 2శాతం, ఎస్టీలు 1 శాతం కుటుంబాలే ఉండటం గమనార్హం.

పెద్ద కమతాలు కలిగిన వర్గాల్లో ఓసీలు ఉండగా, పూర్తిగా చిన్న కమతాలు కలిగిన వర్గాల్లో బీసీ, ఎస్సీలు ఉన్నారు. ఎస్టీలో కొందరు చిన్న కమతాలు ఉండగా, కొన్ని కుటుంబాలు మధ్యస్థ కమతాలు ఉన్నాయి. ఓసీల్లో 5 నుంచి 20 ఎకరాలు కలిగిన కుటుంబాలు 26 నుంచి 27 శాతం మంది ఉన్నారు. బీసీలు 12 నుంచి 13 శాతం, ఎస్సీలు 8 నుంచి 9శాతం, ఎస్టీలు 18 శాతం మంది ఉన్నారు. దీన్ని బట్టి పరిశీలిస్తే బీసీల జనాభా ఎక్కువ, కానీ భూములు ఉన్న కుటుంబాలు తక్కువ. ఓసీ జనాభా తక్కువ కానీ భూములు ఉన్న కుటుంబాలు ఎక్కువ. ఎస్సీ జనాభా ఉంది కానీ వాళ్లకు భూములు లేవు. ఎస్టీల్లో భూములు ఉన్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నా అవన్నీ చిన్న కమతాలే కావడం గమనార్హం.

Share
Share