నల్లగొండలో వినూత్నంగా 64 కుక్క పిల్లల దత్తత! కలెక్టర్, మేయర్ చొరవ..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల మైలురాయి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి తో కలిసి మహిళలకు నూతన డిజైన్ల ఇందిరమ్మ చీరలను అందజేశారు.

అయితే, ఈ వేదికపై కేవలం సంక్షేమ పథకాలే కాకుండా.. నగరంలో వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని 64 మంది శ్వాన ప్రేమికులకు (Dog Lovers) మున్సిపల్ కుక్క పిల్లలను అధికారికంగా దత్తత (Adoption) ఇచ్చారు.

కుక్క పిల్లల దత్తత ప్రక్రియను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు:

అత్యంత విశ్వాసమైన జంతువు: జంతుజాలంలో కుక్క అత్యంత విశ్వాసమైనదని, వాటిని హింసించకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

వానాకాలం ముప్పు – కుక్కకాట్లు: రానున్న వర్షాకాలంలో కుక్కకాట్లు (Dog Bites) ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రోడ్లపై చెత్త వేయడం వల్లే ముప్పు: కాలనీల్లో, వీధుల్లో ఎక్కడపడితే అక్కడ ఆహార పదార్థాలు, మాంసం వ్యర్థాలు, చెత్తాచెదారం వేయడం వల్లే కుక్కలు ఆహారం కోసం గుంపులుగా వస్తున్నాయన్నారు. ఆ సమయంలో పాఠశాలలకు వెళ్లే చిన్న పిల్లలపై అవి దాడులు చేసే అవకాశం ఉందన్నారు. కాబట్టి కాలనీలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లాలో అందుబాటులో ఉన్న జంతు జనన నియంత్రణ కేంద్రం (Animal Birth Control Center) ద్వారా త్వరలోనే నగరవ్యాప్తంగా కుక్కలకు స్టెరిలైజేషన్ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని కలెక్టర్ ప్రకటించారు.

నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ కౌన్సిల్ మీటింగుల్లో కార్పొరేటర్లు నిరంతరం వీధి కుక్కల సమస్యను లేవనెత్తుతున్నారని, అందువల్లే ఈ దత్తత కార్యక్రమానికి ప్లాన్ చేశామని తెలిపారు. ఈ రోజు కుక్క పిల్లలను దత్తత తీసుకున్న 64 మంది వాటిని మళ్లీ వీధుల్లోకి వదలకుండా ఇంట్లోనే క్రమశిక్షణతో పెంచాలన్నారు. సమయానికి ఆహారం, వ్యాక్సినేషన్ అందిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని, కుక్కకాట్ల నివారణపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని కోరారు.

ఈ వినూత్న కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

నల్లగొండ నగరంలో 33వ డివిజన్తో పాటు పలు వార్డుల్లో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందంటూ గత కౌన్సిల్ సమావేశంలోనే కార్పొరేటర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 64 కుక్క పిల్లలను దత్తత ఇవ్వడం, యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కేంద్రాన్ని యాక్టివేట్ చేస్తామని కలెక్టర్ ప్రకటించడం స్వాగతించదగ్గ పరిణామం. అయితే కేవలం 64 పిల్లలను ఇళ్లకు పంపితే సమస్య తీరదు. నగర శివార్లలో, మార్కెట్ ఏరియాల్లో గుంపులు గుంపులుగా ఉన్న వందలాది వీధి కుక్కలకు తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయించి, వ్యాక్సిన్లు వేయించాలి. అప్పుడే వానాకాలంలో చిన్న పిల్లలకు కుక్కకాట్ల నుండి నిజమైన రక్షణ దొరుకుతుందని ‘ఏపీబీ న్యూస్’ అభిప్రాయపడుతోంది.

Share
Share