Viral Video: ఇంకా పురుగుల మందు తాగలేదా.. బతికే ఉన్నావా?: గజ్వేల్ ఎమ్మార్వో హేయమైన వ్యాఖ్యలు..

గజ్వేల్ / సిద్దిపేట, ఏపీబీ న్యూస్: తమ భూమి సమస్యను పరిష్కరించాలని, బ్రతుకుతెరువు కోల్పోయే పరిస్థితి వచ్చిందని తహశీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న ఒక పేద రైతన్నపై ప్రభుత్వ అధికారి ప్రదర్శించిన అహంకారం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మార్వో స్వామి కార్యాలయానికి వచ్చిన ఓ రైతుతో అత్యంత దారుణంగా, వెటకారంగా మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో (Social Media) బయటకు వచ్చి తీవ్ర స్థాయిలో కలకలం రేపుతోంది.

ఆపదలో ఉండి న్యాయం చేయాలని ఆశ్రయించిన అన్నదాతను ఓదార్చాల్సింది పోయి.. “నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా.. బతికే ఉన్నావా?” అంటూ సదరు ఎమ్మార్వో అవహేళనగా మాట్లాడటం సంచలనంగా మారింది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు రైతన్న తన వ్యవసాయ భూమి సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తన జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన చెందుతూ తహశీల్దార్ ముందు తన బాధను వెళ్లగక్కాడు. అయితే, రైతు పడుతున్న వేదనను ఏమాత్రం పట్టించుకోని గజ్వేల్ ఎమ్మార్వో, ఆయన కష్టాన్ని నవ్వుతూ తక్కువ చేసి మాట్లాడటం ప్రారంభించాడు.

ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు.. “నా పరిస్థితిని చూసి మీకు నవ్వు వస్తుందా స్వామి?” అని సూటిగా ప్రశ్నించగా.. ఆ ఎమ్మార్వో ఏమాత్రం సంకోచించకుండా అత్యంత అహంకారంగా “అవును వస్తది.. బరాబర్ వస్తది” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.

స్థలం: గజ్వేల్ తహశీల్దార్ (MRO) కార్యాలయం, సిద్దిపేట జిల్లా.

బాధ్యుడు: గజ్వేల్ ఎమ్మార్వో స్వామి.

అధికారి వ్యాఖ్యలు: “ఇంకా పురుగుల మందు తాగలేదా.. బతికే ఉన్నావా?”

రైతు ప్రశ్న: “నా పరిస్థితి చూసి మీకు నవ్వు వస్తుందా?”

ఎమ్మార్వో సమాధానం: “అవును వస్తది.. బరాబర్ వస్తది”.

ప్రజా డిమాండ్: సదరు ఎమ్మార్వోపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలి.

రైతుతో ఎమ్మార్వో ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ కావడంతో ప్రజలు, వివిధ రైతు సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం సాగునీరు, అప్పుల బాధలు, భూ సమస్యలతో కుమిలిపోతున్న అన్నదాతలను రక్షించాల్సిన అధికారులే స్వయంగా ఆత్మహత్యలను ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేయడం శోచనీయమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజాసేవకుల స్థానంలో ఉండి, బాధ్యతాహితంగా ప్రవర్తించాల్సిన ఎమ్మార్వో స్వామిపై కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని రైతు లోకం డిమాండ్ చేస్తోంది.

Share
Share