- మంత్రి వెంకటరెడ్డి ఆదేశాలు భేఖాతర్
- ఏడాది నుంచి కలెక్టరేట్లోనే ఫైల్ పెండింగ్
- కలెక్టర్ ఇలా త్రిపాఠి మారడంతో మళ్లీ మొదటికి
- కమిటీల పేరుతో మరింత కాలయాపన
- మంత్రికి చెడ్డపేరు.. బాధితుల నోట్లో మట్టి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ బైపాస్ ఆర్బిట్రేషన్ కు ఆఫీసర్లు అడ్డుపడుతున్నారు. ఏడాది క్రితం పరిష్కారం కావాల్సిన బైపాస్ బాధితుల పరిహారం కేసు నీరు గారిపోతోంది. ఇలా త్రిపాఠి కలెక్టర్ గా ఉన్నప్పుడే ఆర్బిట్రేషన్ పంచాయితీ దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధితులకు న్యాయం చేస్తానని ఇచ్చిన హామీ కూడా ఏడాది దాటిపోయింది. మెడికల్ కాలేజీ ఓపెనింగ్ సందర్భంగా బాధితులకు మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం ఇప్పిస్తానని మంత్రి హామీ ఇవ్వడమేగాక, కలెక్టర్ ను ఆదేశించారు. దాంతో అప్పటి కలెక్టర్ త్రిపాఠి, నల్లగొండ ఆర్డీఓ(RDO)తో కలిసి ఆర్బిట్రేషన్ ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. కానీ మధ్యలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. కలెక్టర్ త్రిపాఠి కూడా బదిలీ కావడంతో ఆర్బిట్రేషన్ ఫైల్ కలెక్టరేట్లోనే పెండింగ్ లో పడిపోయింది. మళ్లీ కొత్తగా వచ్చిన కలెక్టర్ చంద్రశేఖర్ పని ఒత్తిడి కారణంగా ఆర్బిట్రేషన్ కేసు వ్యవహారంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. మధ్యలో ఆగిపోయిన ఫైల్ ను తిరిగి కదిలించే చర్యలు చేపట్టకుండా కొత్తగా త్రిమాన్ కమిటీ పేరుతో మరో సారి కాలయాపన చేయడం విమర్శలకు తావిస్తోంది. ఆర్డీఓ, నల్లగొండ తహాశీల్దారు, నేషనల్ హైవే ప్రాజెక్టు మేనేజర్ తో కలిపి త్రిమాన్ కమిటీ నియమించినట్టు తెలిసింది. ఇదంతా చూస్తుంటే బాధితులకు ఇప్పట్లో పరిహారం చెల్లించే ఉద్దేశం అధికారులకు లేనట్టు అనిపిస్తోంది.
మంత్రి ఆదేశాలు బుట్టదాఖలు..
ఓవైపు బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు యాదాద్రి జిల్లా రీజినల్ రింగ్ రోడ్డు బాధితులకు ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెరిగింది. ఇదే పద్ధతిలో నల్లగొండ బైపాస్ బాధితులకు న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే, కానీ స్థానికంగా కొందరు లీడర్లు అడ్డుపడుతున్నారని, మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదనే కారణాలను సాకుగా చూపించి మంత్రి అనుచరులు ఆర్బిట్రేషన్ ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారని బాధితులు వాపోతున్నారు. మంత్రికి చెడ్డపేరు తెచ్చేందుకే ఇందంతా చేస్తున్నారనే వాధన కూడా వినిపిస్తోంది. దాదాపు 1100 మంది బాధితులు ఉన్నారు. వీళ్లంతా పానగల్లు, ఆర్బాలబావి, గిరికబావిగూడెం, మర్రిగూడెం మునుగోడు రోడ్డు, గుండ్లపల్లి, సాగర్ క్రాస్ రోడ్డు, కొత్తపల్లి, అనంతారం, మామిళ్ల గూడెంకు చెందిన బాధిత కుటుంబాలు సుమారు 3వేల వరకు ఉన్నాయి. గత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయంగా సపోర్ట్ చేయలేదనే కారణంగా ఆర్బిట్రేషన్ ఫైల్ ను తొక్కిపట్టారని, మళ్లీ మంత్రి జోక్యం చేసుకుంటే తప్పా సమస్య తీరదని బాధితులు వాపోతున్నారు.
నిండా మునిగిన రైతులు..
పానగల్లు, ఆర్జాలబావి సమీపంలో ఎకరం భూమి రూ.కోటి, రెండు కోట్లు పలుకుతోంది, కానీ ప్రభుత్వం చెల్లించిన పరిహారం కేవలం ఎకరానికి రూ. 49 లక్షలే, వ్యవసాయ భూములతో పోలిస్తే ఖాళీ ప్లాట్లకు, ఇళ్లకు చెల్లించిన ధర ఎక్కువే. పంట భూములకు ఎకరం రూ.49లక్షలు చెల్లిస్తే, ప్లాట్లు, ఇళ్లు కోల్పోయిన వాళ్లకు గజం రూ.3వేల చొప్పున చెల్లించారు. దీని వల్ల రైతులు భారీగా నష్టపోయారు. ఒకే ప్రాజెక్టు కోసం భూములు సేకరించే క్రమంలో నష్టపరిహారం బేసిక్ వాల్యూతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా చెల్లించాలి. ఎందుకంటే పంట భూములకు రూ.49 లక్షలు చెల్లించి, దాని పక్కనే నాలా కన్వర్షన్ అయిన భూములకు ఇంకో రేటు నిర్ధారించడం కరెక్ట్ కాదని న్యాయ నిపుణుల వాధన.
పానగల్లు నుంచే భారీ అవకతవకలు…
నిబంధనల మేరకు ప్రభుత్వం నష్టపరిహారం డిసైడ్ చేయడానికి రిజిస్ట్రేషన్ శాఖలో బేసిక్ వాల్యూను ప్రామాణికంగా తీసుకుంటుంది. భూసేకరణ నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి గత మూడేళ్లలో ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందో పరిశీలిస్తుంది. ఈ మూడేళ్లలో ఏది ఎక్కువ రేటు ఉంటే దాన్నే పరిగణలోకి తీసుకుంటారు. గత మూడేళ్లలో పానగల్లులో ఎకరం భూమికి బేసిక్ వాల్యూ రూ.49 లక్షలకు మించి లావాదేవీలు జరగలేదు. అదే మర్రిగూడలో మెయిన్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న భూమి ధర కేవలం రూ.19లక్షలే. పానగల్లులో మెయిన్ రోడ్డు నుంచి కొంచెం లోపలికి ఉన్న భూములు ధర కూడా ఎకరా రూ. 49లక్షలే, కానీ నష్టపరిహారం చెల్లించడంలో మాత్రం పానగల్లులో కొందరికి ఎకరం భూమికి రూ.90 లక్షల నుంచి రూ. కోటి వరకు చెల్లించారు. అదే రూ.19 లక్షలు బేసిక్ వాల్యూ ఉన్న భూములకు అయితే ఏకంగా రూ.49 లక్షలు, కొందరికి రూ.50 లక్షలు చెల్లించారు. పానగల్లులో పది గుంటల జాగ కోల్పోయినోళ్లకు కూడా కోటి రూపాయాల పరిహారం చెల్లించారు. అదే పదిగుంటలకు పక్కనే ఉన్న భూమికి మాత్రం కేవలం రూ.12 లక్షలే చెల్లించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఆర్డీఓ అన్యాయం చేసిండు: జేఎం గౌడ్, బాధితుడు, నల్లగొండ.
మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న సర్వే నంబరు 101లో ప్లాట్లు చేసి అమ్మిన వాటికి గజం రూ.2900ల చొప్పున పరిహారం ఇచ్చారు. మూడెకరాల భూమిని నాలా కన్వర్షన్ లేదు. అప్రూవల్ లేవుట్ కూడా లేదు, కానీ ప్లాట్ల కింద లెక్కగట్టి పరిహారం చెల్లించారు. అదే సర్వే నంబర్ లో నాకు ఎకరం భూమి ఉంది. నాలా కన్వర్షన్ కోసం అప్లై చేశా, కానీ ఆర్డీఓ నాలా కన్వర్షన్ చేయలేదు. బైపాస్ రోడ్డు వస్తుందనే నాలా కన్వర్షన్ కోసం ఆప్లై చేశానని చెప్పి అడ్డుకున్నారు. అక్కడ మార్కెట్ రేట్ ప్రకారం ఎకరం రెండు, మూడు కోట్లు పలుకుతోంది, కానీ పరిహారం ఎకరానికి రూ.2.40 లక్షల చొప్పున డబుల్ చేసి 5.40 లక్షలు ఇస్తా అంటున్నడు. నోటీసులు పంపిస్తే వద్దని ఆర్బిట్రేషన్ కూడా గతేడాది జులైలో అప్లై చేసిన మంత్రి గారు కూడా మార్కెట్ రేటు ప్రకారం న్యాయం చేస్తానని హామీ ఇచ్చిండు. ఒకటే సర్వే నంబర్లో ఉన్న ప్లాట్లకు గజం రూ.2900లు ఇస్తే, నా భూమికి గజానికి రూ.90లు కూడా గిట్టుబాటు కావడం లేదు. కొత్తపల్లి ల్యాండ్ రికార్డ్స్ అన్ని వస్తే తప్పా ఆర్బిట్రేషన్ చేయడం కుదరదని కలెక్టరేట్ ఆఫీసర్లు చెప్తున్నారు.
కొందరు అడ్డుపడుతున్నరు: సయ్యద్ హాషం, సీపీఎం నేత
మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లించేందుకు మంత్రి వెంకటరెడ్డి గారు ఆర్బిట్రేషన్ ద్వారా ఇప్పిస్తామని హామీ ఇచ్చిరు, కానీ కొందరు వ్యక్తులు అడ్డుపడుతున్నరు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణస్తలేడు. దీని వల్లే ఆర్బిట్రేషన్ పరిష్కారం కావట్లేదు. 1100 మంది బాధితులు ఉన్నారు. మళ్లీ కమిటీ అంటున్నరు. పాత కలెక్టర్ త్రిపాఠి అంతా సిద్ధం చేశారు. ఈ కమిటీ ఎందుకు వేశారో అర్ధం కావట్లేదు.